Wednesday, 28 May 2014

తాళికట్టు శుభవేళ

తాళికట్టు శుభవేళ

- కళ్యాణ్ కృష్ణ కుమార్ .కరణం
04.12.2013
ఒళ్ళంతా.. ఒణుకు
వశిష్ట మంత్రోఛ్ఛారణ ఉధృతితో
ముఖమంతా ముచ్చెమటలు..
గట్టిమేళం మోతతో
గుండెలో మొదలైన దడదడలు
మాంగళ్యం తంతునా నేనా..శబ్ధభేరితో
తడి ఆరిన అధరాలు
నిజం...నిస్తేజం
అనందం..అదుర్దా
స్మైల్ ప్లీజ్ పిలుపుతో..
అరికాలులో తడి
లబ్ డబ్ ..లబ్ డబ్ శబ్ధంలో
వినిపించని చుట్టూ చేరిన
చుట్టాల.. సందడి..


కంఠంలో ప్రాణమున్నంత వరకూ
నీ నీడకు నీవు తోడుండాలని
నాకు నేనే జాగ్రత్తలు చెప్పుకుంటూ..
నాలో నేనే మాట్లాడుకుంటూ..
నేను...
ఒద్దికగా..ఒంగి..ఒణుకుతూ..ఉన్న
నాలాంటి మరో జీవి..తప్ప
అక్కడ అందరిదీ మరో లోకం..
మేమిద్దరమే.. 
ఓ చిత్ర లోకంలో ..
విచిత్రానుభూతితో..
గజగజ కంపితులమౌతూ..
ఒకటి..రెండు..మూడు
మూడుముళ్ళు...మరో మూడుముళ్ళు..
పెద్దల అక్షతల జల్లులలో..
తన జీవితాన్ని నాకు రాసిచ్చి
తన మనోబలాన్ని నాకందించి..
నాలో సగమై..
నా అడుగులో అడుగై..
వందేళ్ళకు గొడుగై..
ఒద్దికగా..ఒంగి.. ఒణికిపోతూ..
కలికి చిలకలకొలికి
కళ్ళల్లో భాష్పాలు..
కనుకొనల కొంటెచూపులు..
ధైర్యం..దైన్యం 
ఏకకలంలో..అమె నయనాల్లో ..
నన్ను చూసుకోమంటూ..
అదుగో అప్పుడు రెప్పపాటు చూశా..
అపరంజి బొమ్మని
నా జీవితానికి ఆ'దారమై' నిలిచిన 
అర్ధాంగిని..
నా రమాగాయత్రిని..
నిత్య శ్రమా ధరిత్రిని
నా హృదయనేత్రిని..
తన చూపు సోకిందో లేదో..
తన చిరుమందహాసం..
నను చేరిందో లేదో..
విహంగమై గాల్లో తేలినట్లు..
సీతకోకచిలుకనై 
పువ్వులలోకంలో విహరించినట్లు..
కోయిలనై.. కొత్త పాటలు కూర్చినట్లు..
ప్రపంచాన్ని జయిస్తానన్న
ధైర్యం ప్రోధి చేసుకున్నట్లు..
కొత్తలోకం..
నిత్యగాయత్రి పఠనం..
అదేనేమో నా అదృష్టం..
ఆ'కల 'వరించి..
అప్పుడే.. పదహారేళ్ళు..గడిచిపోయినా
ఇప్పుడే.. పదహారురోజుల పండగైనట్లు..
అంతలో వీణ మీటినట్లు
చలిగాలి చెక్కిలిని ముద్దాడినట్లు
చేతిలో చెయ్యివేసి నేనున్నా..అంటున్నట్లు..
మరువలేని..మధురానుభూతికి
మాటలు చాలునా. 
పుటలు మిగులునా.
ధరిత్రిలోన
చరిత్ర ఎరుగక
కలకాలం..కొనసాగే
కొంగొత్త జ్ఞాపకమే కదా..
తాళికట్టు శుభవేళ..
నిత్యనూతనమే..కదా..!
ప్రతీ జీవితం లో కళ్యాణ హేల..!!

నా వివాహమై నేటికి పదహారేళ్ళు పూర్త్తయిన సందర్భంలో వ్రాసుకున్న కవిత.. నా శ్రీమతికి మంగళ్యధారణ చేస్తున్న నాటి ఫొటో..డిసెంబర్ 4 1997 ఉదయం 10.08 నిల సమయంలో చిత్రించబడింది.

6 comments: