Wednesday, 28 May 2014

ఉషా కిరణాలు

ఉషా కిరణాలు

-కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
13.11.2013

ఉషోదయపు..ఉషా కిరణాలు
తుషార సమయాన
ప్రభాత ఆహ్వాన డోలికలు...
యామినికి
వీడ్కొలిపే
విరహ గీతికలు
చలిని చల్లగా తరిమి
వేడి కాపు కాసే 
మనోల్లాస మాలికలు
సాగర అలలపై 
మిలమిల మెరిసే 
మిణుగురులు
తెలిమంచు
తొలగించే
తొలి దీపికలు
సుషుప్త నుంచి
సుష కు తెచ్చే
వేవేల శరాలు
కొండలు దాటి..
కానలు దాటి..
కొమ్మలు దాటి..
కిటికీ దాటి.. 
నన్ను స్పృశించే
అమ్మ చేతులు..
ఉషస్సుతో ..
చేతన నింపి
ధైర్ఫ్యం ఇచ్చే..
అమృత హస్తాలు...!



తాళికట్టు శుభవేళ

తాళికట్టు శుభవేళ

- కళ్యాణ్ కృష్ణ కుమార్ .కరణం
04.12.2013
ఒళ్ళంతా.. ఒణుకు
వశిష్ట మంత్రోఛ్ఛారణ ఉధృతితో
ముఖమంతా ముచ్చెమటలు..
గట్టిమేళం మోతతో
గుండెలో మొదలైన దడదడలు
మాంగళ్యం తంతునా నేనా..శబ్ధభేరితో
తడి ఆరిన అధరాలు
నిజం...నిస్తేజం
అనందం..అదుర్దా
స్మైల్ ప్లీజ్ పిలుపుతో..
అరికాలులో తడి
లబ్ డబ్ ..లబ్ డబ్ శబ్ధంలో
వినిపించని చుట్టూ చేరిన
చుట్టాల.. సందడి..


కంఠంలో ప్రాణమున్నంత వరకూ
నీ నీడకు నీవు తోడుండాలని
నాకు నేనే జాగ్రత్తలు చెప్పుకుంటూ..
నాలో నేనే మాట్లాడుకుంటూ..
నేను...
ఒద్దికగా..ఒంగి..ఒణుకుతూ..ఉన్న
నాలాంటి మరో జీవి..తప్ప
అక్కడ అందరిదీ మరో లోకం..
మేమిద్దరమే.. 
ఓ చిత్ర లోకంలో ..
విచిత్రానుభూతితో..
గజగజ కంపితులమౌతూ..
ఒకటి..రెండు..మూడు
మూడుముళ్ళు...మరో మూడుముళ్ళు..
పెద్దల అక్షతల జల్లులలో..
తన జీవితాన్ని నాకు రాసిచ్చి
తన మనోబలాన్ని నాకందించి..
నాలో సగమై..
నా అడుగులో అడుగై..
వందేళ్ళకు గొడుగై..
ఒద్దికగా..ఒంగి.. ఒణికిపోతూ..
కలికి చిలకలకొలికి
కళ్ళల్లో భాష్పాలు..
కనుకొనల కొంటెచూపులు..
ధైర్యం..దైన్యం 
ఏకకలంలో..అమె నయనాల్లో ..
నన్ను చూసుకోమంటూ..
అదుగో అప్పుడు రెప్పపాటు చూశా..
అపరంజి బొమ్మని
నా జీవితానికి ఆ'దారమై' నిలిచిన 
అర్ధాంగిని..
నా రమాగాయత్రిని..
నిత్య శ్రమా ధరిత్రిని
నా హృదయనేత్రిని..
తన చూపు సోకిందో లేదో..
తన చిరుమందహాసం..
నను చేరిందో లేదో..
విహంగమై గాల్లో తేలినట్లు..
సీతకోకచిలుకనై 
పువ్వులలోకంలో విహరించినట్లు..
కోయిలనై.. కొత్త పాటలు కూర్చినట్లు..
ప్రపంచాన్ని జయిస్తానన్న
ధైర్యం ప్రోధి చేసుకున్నట్లు..
కొత్తలోకం..
నిత్యగాయత్రి పఠనం..
అదేనేమో నా అదృష్టం..
ఆ'కల 'వరించి..
అప్పుడే.. పదహారేళ్ళు..గడిచిపోయినా
ఇప్పుడే.. పదహారురోజుల పండగైనట్లు..
అంతలో వీణ మీటినట్లు
చలిగాలి చెక్కిలిని ముద్దాడినట్లు
చేతిలో చెయ్యివేసి నేనున్నా..అంటున్నట్లు..
మరువలేని..మధురానుభూతికి
మాటలు చాలునా. 
పుటలు మిగులునా.
ధరిత్రిలోన
చరిత్ర ఎరుగక
కలకాలం..కొనసాగే
కొంగొత్త జ్ఞాపకమే కదా..
తాళికట్టు శుభవేళ..
నిత్యనూతనమే..కదా..!
ప్రతీ జీవితం లో కళ్యాణ హేల..!!

నా వివాహమై నేటికి పదహారేళ్ళు పూర్త్తయిన సందర్భంలో వ్రాసుకున్న కవిత.. నా శ్రీమతికి మంగళ్యధారణ చేస్తున్న నాటి ఫొటో..డిసెంబర్ 4 1997 ఉదయం 10.08 నిల సమయంలో చిత్రించబడింది.

నింగికెగిరిన శాంతి కపోతం

నింగికెగిరిన శాంతి కపోతం


- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్

- 07.12.2013


మాయమయ్యేనా..ఆ చిరునవ్వు..

మానవుడే మరువలేని ధీశాలి నీవు

నల్లకలువ గా ప్రపంచానికి వెలుగిచ్చిన సూరీడు నీవు

శాంతి కోసం ఆజన్మం తపించింది నీవు


నీవు..మాకు ఆరాధ్యం


నీ నడత మాకు శిరోధార్యం..


నీ భావనలు నరనరాన నింపుకుంటాం


నీ చరితను తరతరాల పాడుకుంటాం..


మా గుండెలు అదిరేలా చెబుతున్నాం


జాతివెలుగు మండేలా నీకు మరణం లేదు..


 


తొలి పద్యశాసనం.

 తొలి పద్యశాసనం.
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ 
03.01.2014

తొలి పద్యశాసనం..ప్రకాశం జిల్లా అద్దంకి లోనిది...
తొలి తెలుగు పద్యం పుట్టిన గడ్డగా చారిత్రక సాహిత్య నేపథ్యాన్ని కలిగిన శాసనం గురించి కొన్ని విషయాలు...
చైన్నై ప్రభుత్వం మ్యూజియంలోని మాతృకకు ఈ ఫొటోలోని శాసనం ప్రతికృతి.
క్రీ.శ 848 (శా.శ 770)కి సంబంధించిన ఈ శాసనం వేంగీ చాళుక్య లిపిలో ఉంది. చారిత్రక ఆధారాలననుసరించి దేశీయమైన తొలి తెలుగుపద్యాన్ని అందించిన శాసనం ఇది. గ్రామాధికారి కీ.శే కాకాని కోటయ్య గారికి వేయిస్తంభాలగుడి పరిసరాల్లో ఈ శాసనం లభించింది. నెల్లూరు శాసనాల సంకలన గ్రంధంలో కీ.శే అలెన్ బటర్ వర్త్ గారు కీ.శే వేణుగోపాల చెట్టి గారు 1905 లో తొలుత దీనిని ప్రచురించారు. ఈ శాసనంలో తరువోజ పద్యం వుందన్న విషయాన్ని గమనించి ప్రకటించినవారు..కీ.శే కొమర్రాజు లక్ష్మణరావు పంతులు గారు. ప్రముఖ సాహితీ వేత్త కీ.శే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఈ శాసనాన్ని భద్రపరచటానికి కృషిచేశారు. ప్రఖ్యాత భాషా పరిశోధకులు కీ.శే బూదరాజు రాధాకృష్ణ గారి 'ప్రాచీనంధ్ర శాసనాలు ' గ్రంథం యథాతథ పాఠాన్ని ప్రముఖ శాసనభాషా పరిశీధకులు కీ.శే జయంతి రామయ్య పంతులు గారి ' శాసన పద్య మంజరి ' గ్రంథం నుంచి సవరణ నేటి తెలుగులో కొలువై వున్నది పండ రంగడి అద్దంకి శాసనం అద్దంకిలో. పండరంగడు పరమ మహేశ్వరుండను ఆదిత్య భట్టారకునికి ఇచ్చిన భూమి వివరాలు ఈ పద్యంలో చక్కగా వివరించబడినవి.
నేను ఈ రోజే వెళ్ళి చూసిన... పండరంగడి అద్దంకి శాసనం లిపి.. నేటి తెలుగు లిపి ల చిత్తరువులు ఐదు పోస్ట్ చేస్తున్నాను..
'అచ్చంగా తెలుగు ' తొలి పద్యాన్ని చదివి ...ఆనందిస్తారని ఆశిస్తూ ....! 

          

ఈ పెద్దోళ్ళున్నారే..పెద్దోల్లు

ఈ పెద్దోళ్ళున్నారే..పెద్దోల్లు

 - కరణం
06.01.2013
మనసంతా నువ్వే..! మిత్రమా.. 
చిత్రంగా నేలరాలిన నక్షత్రమా..! 
ఇంత మంది హృదిని గాయపరచుట న్యాయమా..?
శ్రీరామా మేమంతా నీకు లేమా.. ?
అంత కాని వారమా?? 
నువ్వూ-నేను అంటూ..
నీ దారి నీవెత్తుక్కుని
నీ ఆత్మను చంపుకుని... 
నీ చిరునవ్వును చిదిమేసి
మా అత్మను క్షోభకు గురిచేసి..
ఆనందించడం నీకు తగునా.. 
అస్తమించిన (ఉదయ)కిరణమా..?
ఇది నీకు ధర్మమా
దివికెగసిన బాధా తప్త సంద్రమా..
మా నివాళులు ఆందుకో నేస్తమా
లోకం లో మరెవ్వరి జీవితాలూ 
నీలా అర్ధాంతరం కాకూడదు సుమా..!


జ్ఞాపకాల సంక్రాంతి

జ్ఞాపకాల సంక్రాంతి


కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
16.01.2014

గోమాతల,పల్లె అందం
హరి దాసుల కదంబం
గంగిరెద్దుల విన్యాసం
భోగిమంటల కాపటం
రంగవల్లుల హరివిల్లు పథం
గొబ్బెమ్మల పచ్చదనం
పిల్లల్ల పై రాలిన రేగువర్షం
బొమ్మలలో కొలువైన సంగీతం
మెరిసిన మెహిందీల అరుణ వర్ణం
పిండివంటలూ- పాయసం
కలబోసిన..బోసినవ్వుల చిరుదరహాసం
పులకరింపజేసిన అక్షతల అనురాగం

రోజంతా ఇంటింట పండుగ ఆనందం
బంధు రాక స్ఫురణకు తెచ్చె కదా ఉమ్మడి కుటుంబం
సంక్రమణ రోజున సంక్రమించిన ఈ సంబరం
చూచే కన్నులకు కలిగించె కదా భాగ్యం..!
మరి మీరందరూ పల్లెను విడిచి వెళ్తూ..
మా కన్నులను చెరువులు చేసి..
మాకు మిగిల్చేరు కదా.. విషాదం..!
మీకోసం వేయికన్నులతో వేచి ఉంటాం..
మరలా మీ రాకకై ఎదురుచూస్తూనే ఉంటాం..

మరణం తద్యమని...

మరణం తధ్యమని...
కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
- 23.01.2014

అలిసిపోయిన ఎవరెస్టు .కరిగిపోయింది.
తన నటనా జీవన సుధీర్ఘ యాత్రలో..
ఆడగొంతుక నుంచి..ఈనాటి వరకూ..
ధర్మపత్ని నుంచి.. నేటీ వరకూ
ఎన్నో సిత్రాలు.. ఎన్నో వేషాలు.. 
ఎన్నో చీత్కారాలు..ఎన్నో సమ్మానాలు
ఎన్నో గెలుపులు.. 
మధ్య..మధ్యే ఓటములు
ఉత్ధానపతనాలు..
తన వారితోనే..పోటీలు..
నటన తన నరం..
నటనే సర్వస్వం..
నటనే.. గుండె స్పందన..
మనుమరాలితో నటించినా..
మనుమరాలులో నటించినా..
ప్రేమనగర్ లో ద్వేషించినా
ప్రేయసి కోసం ఆకాశదేశాన పరుగిడినా...
పారూ కోసం మధువు సేవించినా..
సిలకా.. అంటూ జాణ తెలుగు నేర్పించినా..
చేతిలో చేయి వేసినా..

తన ధ్యేయం.. నటన
తన మాట నటన
తన జీవిత కాన్వాసే నటన
ఆడుతుపాడుతూ.. పనిచేసినా
ఏరా..! ఫ్రెండూ అంటూ చిన్ననాటి సంగతులు వల్లెవేసినా
చిందులేసినా.. 
ఎంత ఎదిగి పోయావయ్యా అనిపిలిచినా..
తనదంటూ ఒక బ్రాండ్.. 
తనదైన ఓ స్టైల్..
అది ఒక శకం
'నాశ 'ము లేనిది
నాగేశ్వరరావు శకం...
ఎనభై మూడేళ్ళ తెలుగు సినిమా తో
డెబ్బై ఎనిమిదేళ్ళ సావాసం.
అలుపెరుగని బాటసారి బహుదూర పయనం 
తొంబైఏళ్ళ నవయువ్వనంలో
రెండు శతాలకు పైగా చిత్రాలలో 
రకరకాల రూపాలలో జీవనం..
అక్కినేని ఒకనాటి జపం..
ఏ.ఎన్.అర్ ఒకనాటి మంత్రం
తనలో తమ వారిని చూసుకునే 
లక్షలాది హృదయ స్పందనం..
ఒక్కసారి ఆగిపోయింది
భారత సినీ ఎల్ల కరిగిపోయింది.
కడచూపు దొరికేనా అంటూ.. 
ప్రతి కళ్ళలో
తపన.. అతృత..అదుర్దా...
మేరునగధీరుడు.. మిన్నుకెగశాడు..
నింగిలో మరో చుక్క తళుక్కున మెరిసింది..
దేవదాసు మళ్ళి పుట్టడు..
మరణం తథ్యమన్నంతమాత్రాన
ఆ రూపం మా మనసుల నుంచి చెదిరి పోతే కదా..!
ఆ నవ్వు మా మదిలో చెరిగిపోతే కదా..!
అజరామరుడా అక్కినేని
కళతో మా కన్నుల్లో నిలిచినేని
మా నుంచి నీవు పోలేదని
కనీసం నన్ను నేను ఓదార్చుకోనీ..
అనంతలోకాలలో తన వారి కోసం పయనమైన 
అక్కినేని నాగేశ్వరరావు గారి
ఆత్మకు శాంతి కలుగు గాక..

ఏమని వర్ణించను..

ఏమని వర్ణించను..

కరణం కళ్యాణ్ కృష్ణకుమార్
03.03.2014
దారెంట పూలు వాడెను కదా..
తుమ్మెదలు తమను విడిచి
నీ వెంట నడిచేవని..
గాలి తెమ్మెరలు సైతం 
పోటీ పడుతున్నాయి కదా..
నీ కురుల స్పర్శ కోసం..
సంధ్యా సమీరం 
ససేమిరా అంటోంది.. కదా..!
నిను తాకిన సంబరాన్నివర్ణించను
వెన్నెల మూతి ముడిచే కదా
నీ తేజో విలాసము చూసి
చిన్నబుచ్చుకుని...



మెరుపు నొచ్చుకునే కదా
నీ హాసపు తళుకులతో
తన కాంతి తగ్గెనని...
ధరణి మురిసేను కదా
నీ పద్మపాదముల 
స్పర్శతో పునీతమై...
హృదయం స్థంబించే కదా
నీ ఉచ్వాస నిశ్వాస 
వేణుగాన రాగానికి
నిద్రను మరిచే కదా
నినుచూసిన నయనాలు
ఆనందపరవశమై..
ఏమని వర్ణించను..
నీ లాస్య..రూపలావణ్యాన్ని
నేస్తమా..! సిరివెన్నెల జలపాతమా..!

సౌందర్యం

సౌందర్యం

-కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
06.03.2014
ఓహో గులాబి బాలా..!
కళ్ళు తిప్పుకోనివ్వని సౌందర్యం
ఎందుకు మీకు మాపై ఇంతటి ఆగ్రహం
జలపాతసోయగం..
సంధ్యాసమయ ఆకాశవిహంగ దృశ్యం
ఎల్లోరా..అజంతల శిల్పలావణ్యం
ఒక్కసారిగ ఎద ఎదుట మెరిస్తే
తట్టుకోవడం తరమౌనా..సిద్ధికైనా..బుద్దికైనా..