Monday, 9 February 2015

కన్నీరు కురిసిన రాత్రి

// కన్నీరు కురిసిన రాత్రి //
                                - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                                      30.01.2015


నిశ్చేష్ట నిశిలో
గాలి నిలిచిన వేళలో
నాలుగు గోడలు సాక్షిగా
నిన్ను నీవే ప్రశ్నించుకుంటూ
లోలోన దహించుకుంటూ
క్షణికావేశంలో.. కలతలో
ఏంచేస్తున్నావో తెలుస్తోందా..??
ఒంటరిగా..?  ఓ రాక్షసిలా..?
నీ పిచ్చి చేష్టకి విస్తుపోతూ..
నీ ఏకాంతమందిరం మూగగా రోదిస్తోంది
వెక్కి వెక్కి..కుమిలి కుమిలి..

జీవకణం జార్చిన , నాన్న..
పిండం పదినెల్లు మోసి కన్న అమ్మ
నీతోడై నడచిన  తోబుట్టువులు
నీడల్లె వెన్నంటే నీ హితుల్ బాంధవుల్
వీరెవ్వరూ  గుర్తులేరా..??
చిన్నవేదనకి లొంగిపోతే
నీవాళ్లకి ఏమిస్తావు సుమ్మీ
కడివెడు కన్నీళ్ళు తప్ప

ఎందుకంత ఆత్రం,ఆరాటం
ప్రాణంపై ఎందుకంత అసహ్యం
బ్రతకమనే భగవంతుడు
భూమి పై వదిలాడు తెలుసుకో
ఆ బ్రతుకే భారమైతే నీవారితో పంచుకో
గుండెలో దాచుకుని ఆవేశపడితే
నీదంటూ ఏమి మిగలదు సుమ్మీ
గుప్పెడు బూడిద తప్ప..

పువ్వు పువ్వుని చిదిమేస్తుందా?
కాయ కాయను రాలుస్తుందా..?
కట్టె తనని తాను దహించుకుంటుందా?
నీ కిలకిలలతో ముచ్చటపడ్డ తల్లిదండ్రులకి
కంటతడి పెట్టిస్తే ఏం ఒరుగుతుందోయ్ నీకు?
పంచుకుంటే తగ్గే భారం కోసం
చెప్పుకుంటే తీరే కష్టం కోసం
నీవాళ్ళు ఎందుకు లేరనుకుంటావ్??
చెట్టుకి కాయ భారమా నేస్తం??
బాధకు మందే స్వహత్యై తే
భవిత ఉండదు సుమ్మీ
స్మశానాల్లో సమాధులు తప్ప

ఒక్కక్షణం ఆలోచించుకో.. నేస్తం..!
బాధా పంజరం వీడితే
బ్రతుకు స్వేచ్చా విహంగం
చిమ్మచీకటి కమ్ముకొస్తే
వేకువ వెన్నంటి లేదా..?
ఎండిన పచ్చని చెట్టు
మళ్ళీ చిగురించటంలేదా..?
గ్రహణం మింగిన చంద్రం
వెలుగు చిమ్మటంలేదా?
అగ్నికి శకటం ఆహుతవుతోందని
పయనించక నిలిచామా ఎప్పుడైనా?
అనంతంలో ..
ఆ ఏకాంతం లో ఏం సాధిస్తావ్
కష్టాలకే కన్నుమూస్తే
జాతి ఉండదు సుమ్మీ
శవాల గుట్టలు తప్ప

పుట్టిందెందుకో తెలుసుకున్నావా ఎపుడైనా..
మరి మరణానికి చేరువెందుకోయ్,ఆపు ఇకనైనా..?
పుట్టినోడు గిట్టక తప్పదన్నోడు,
ప్రపంచానికి చేశాడు ఎంతో కొంతైనా.!
ఎవరూ ఏంచెయ్యలేదనే  నువ్వు
పుట్టి  ఏం సాధించావో చెప్పు ఇప్పుడైనా..??

అయినా ఆవేశానికే మొగ్గు చూపావా..?
ఇక చెప్పుకోను ఏముంటుంది నీ గొప్ప..!
ఓ చేదు జ్ఞాపంకంగా మిగలటం తప్ప..!!

             
(ఆత్మహత్య మహాపాపం అంటున్నాయి ప్రభోధ గ్రంధాలు.. నేరం అంటున్నాయి చట్టాలు.. అనవసర ఆవేశంతో జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాలనుకునే వారు ఒక్కసారి ఆలోచించండి ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది.. చావు మాత్రమే పరిష్కారం కాదు. - మీ  కరణం)

1 comment: