//జలతారు దీపాలు//
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
08.11.2014
సగం గుడ్డలేసుకున్న దిక్కుమాలిన బ్రతుకుల్లో ..
వెలుగు రేఖవ్వడం మరిచావా ఓ పాలకా..!
దిక్కులు చూస్తూ.. అటూ ఇటూ పోయే వాళ్ళకు
వెర్రి సైగల కేకలేస్తూ..
కడుపు చించుకు కాలిపై పడ్డ భోగ బ్రతుకులు
గుప్పెడు మెతుకులకై సిగ్గు మరిచిన జీవితాలు
పిపీలకం లా చిదిమేయబడ్డ కరిగిన మేఘాలు
ఎవడబ్బో తెలియక వచ్చిపోయేవాణ్నల్లా చూస్తుంటే..
"అందాల బొమ్మ రేటెంతో" అన్న వాడి
వెకిలి చేష్టలకు విస్తుపోయినప్పుడు..
ఏం వాగాడో అర్ధం కాక బిత్తరపోయినప్పుడు..
వాడెవడో ముసలి మదపుటేనుగు
వేలం పాటకి అంగడి బొమ్మై ఆడినప్పుడు ..
కన్నీటి మరక చెంపపై జారినప్పుడు..
ఎర్రనీళ్ళు చూడకుండానే
కస్టమర్ కి పరుపైనప్పుడు
ఒకడికి ముగ్గురు కుక్కలై
నల్లిలా నలిపినప్పుడు
తాగినోడు జుట్టీడ్చి తన్నినప్పుడు..
వెగటు వేషాలేసినప్పుడు..
ఆడుతూ పాడుతు చిందాడే వయస్సులో
అవాంచిత గర్భం దాల్చినప్పుడు..
ఏమైందో అర్ధం కాక పిచ్చిచూపులు చూసినప్పుడు
అప్పుడు పట్టని ఓ పాలకా..! ఇప్పుడు నీకింత ప్రేమోంటో..?
ఒడలు, కాలిన సిగిరెట్ల కు యాష్ ట్రేగా మారినప్పుడు
మెడుకు, ఉచ్చువేసి వెర్రినాకొడుకులు మూత్రం తాపినప్పుడు
నగ్నంగా వేలాడదీసి వీడియోలు తీసినప్పుడు..
వద్దన్నా వినకుండా రక్షణ తొలిగించి రమించినప్పుడు
కోతి చేష్టలతో చేష్టలుడిగి.. కోతి రోగాలల్లుకున్నప్పుడు
చీకి చీకి చిక్కి శల్యమై అందాల భామ
ఈగల ఆవాసమైనప్పుడు
తనతో కులికినోళ్ళళ్ళా, నోరెళ్ళబెట్టి వెళుతూ
తానెవ్వరో తెలీయనట్లు ..నటులైనప్పుడు..
అప్పుడు గుర్తురాని
మా పాపపు జీవితాల్లో ...
మా కుళ్ళిన బ్రతుకుల్లో ..
వెలుగు నింపేందుకు మాకు లైసెన్సులిత్తారా??
మేము ట్యాగులేసుకుని తిరగాలా?
చట్టం ఉంటేనే, చుట్టంగా మార్చుకున్న మీకు
మా పై ఇంత ప్రేమేంటో??
బాండ్లు రాసి ఆంటీలకు అమ్ముడవ్వాలా??
మీ దారేంటో కాస్త తెలుసుకో.. !
మాకేం కావాలో అడిగి తెలుసుకో ..!
జనాల మనసుల్లో ఏది గూడైందో వెతుకు ఫో..!
నిశి కమ్మిన జీవితాలకు
వెలుగుబాట కాకున్నా మేలేన్నా..
దీపంపురుగుల్లా మార్చొద్దు.
మలమల మాడ్చొద్దు.. !
మమ్ము ఏమార్చవద్దు..!!
No comments:
Post a Comment