Monday, 16 February 2015

నిను వర్ణింప తరమా..!

నిను వర్ణింప  తరమా..!
                             - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                                  14.2.2015

అల చల్లనిగోదారి  అలలపై
ఇల  నావయ్యారిభామ తో
నడిరేయి నావ పై విహరించగ..,
మెల మెల్లగ కదిలే లహరి తరగలపై
మిల మిల  మెరిసే
వేవేల  చంద్రాబింబాల నడుమ

తెల తెల్లని చీరె కట్టి,
మరు మల్లియలు సిగను చుట్టి..
చల చల్లని గాలికి ఎగిరే ముంగురులతో..
ధగ ధగ ధవళ కాంతులీను..
నా కన్నులకలికి  సౌందర్యం కాంచి..



తిమిరమున
వేవేల నక్షత్రాల నడుమ..
కౌముది కౌగిట మురిసేటి  ఆ హిమసఖుడు
మరుచంద్రుడుదయించెనని భ్రమించెనో..
ఉషోదయమాసన్నమైనదని భ్రాంతి నొందెనో

నా ప్రణయిని చూసి ఉలిక్కి పడి
వడి వడిగ మేఘాల మాటున నక్కెనే.. 
ఓ నీరజారీ.!  నీ నవ్వులకు
ఆ తొగచెలికాడు తొందరపడి  తొలగిపోయెనే!

ఓ చెలి ,నా సహచరి ..!
నీ సౌందర్యం ఏమని వర్ణింతునే..!!

 

(లహరి = అల ,  ధవళ కాంతి = తెల్లని వెలుతురు,   కౌముది = వెన్నెల,
 కన్నుల కలికి=నీరజారి= ప్రణయిని= సహచరి = చెలి,  తొగ చెలికాడు = హిమసఖుడు = చంద్రుడు , తిమిరము = రాతిరి= చీకటి)

                   

No comments:

Post a Comment