Wednesday, 27 July 2016

మా ఇంట్లో ఓ జెంటిల్ మన్

మా ఇంట్లో ఓ జెంటిల్ మన్ (వీడు చాలా కంత్రీ)




హాయ్ మిత్రాస్..!

మీకు మా పెద్దవాడు శ్రీరాం శరణ్ గురించి మీలో చాలామందికి తెలుసు.. వాడిప్పుడు మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు.. కానీ చిన్నోడి గురించే ఎక్కువగా తెలీదు.. వాడి గురించి చెప్ఫే సందర్భాలూ తక్కువే వచ్చాయ్.. మా చిన్నోడి పేరు శ్రీశ్యాం శరణ్.. ఇక వీడికి ఇంటర్ లో మంచి మార్కులే వచ్చాయి... కాకుంటే ఎంపిసి కనుక.. బైపిసి అంత విజన్ ఉండదు కదా..! ఇంటర్ లో 943 మార్కులు సాధించి 95 శాతానికి చేరువయ్యాడు.. వీడు చదివింది హైద్రాబాద్ కెపిహెచ్‌బి లోని శ్రీ చైతన్య కాలేజ్ లోనే.. !(పెద్దవాడు శ్రీరాం శరణ్ కూడా అక్కడే లేండి.) ఇంటర్ లొ మంచి మార్కులే సాధించడంతో ఊపిరి పీల్చుకున్నాము.. ఇక ఇంజనీరింగ్ ఓ పెద్ద ప్రహసనం.. యూనివర్శిటీల, కళాశాలల మెసేజ్ లు, వాటి వివరాల సేకరణతో తల బొప్పికట్టింది.. మా వాడు మొదట చెన్నై అన్నాడు.. కాదు కాదు ఊహు వెల్లూరు అన్నాడు.. కానే కాదుదు పంజాబ్ lu అన్నాడు.. కాదు పాండిచ్చేరి.. ఇలా దేశం మొత్తం కంప్యూటర్ ముందు కూర్చుని తిరిగిన పరిస్థితి మాది..! అందరినీ అడగటం, ఆయా కాలేజ్ వివరాలు తెలుసుకోవడం.. ఇదీ మా ఇంటిల్లిపాది దినచర్య.. ఆ ఫీజుల, శబ్ధాలు గుండెల్లో రైళ్ళ శబ్దాలు చేస్తూనే ఉన్నాయి.. ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి.. నా సంకట స్థితి తెలుసుకున్న కొందరు ఎఫ్బి ఫ్ర్రెండ్స్ స్వచ్చంధ సంస్థలనీ ఎడ్యుకేషన్ లోన్ కోసం సంప్రదించారంటే మా పరిస్థితి ఎలా ఉందో మీకర్ధమయ్యే ఉంటుంది.. చివరకు ఏపి ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి.. 6930 వ ర్యాంకు వీడు సాధించాడు.. ! సంబరాలే మాఇంట.
ఎక్కడ ఏమిటి ఎలా..??
ర్యాంకు వచ్చిందన్న సంబరం కన్నా ఎక్కడ చేర్చాలన్నది మరో ప్రశ్న..! వాడి ర్యాంకుకు వచ్చే కాలేజీలేవి.. వాడు ఇష్టపడుతున్న కాలేజీలేవీ//? చివరకు మావాడు ఫైనల్ చేసిన కాలేజీలన్నీ ఫీజుల మోతలా కనబడ్డాయి.. అయినా వాడిని చేర్చేద్దాం అని నిర్ణయించుకున్నాము.. కొందరేమో బయట రాష్ట్రాల్లో చేర్పించమని సలహా..! అక్కడి విద్యార్ధులేమో.. నో.. ఇక్కడస్సలు చేర్చవద్దని వేడుకోలు.. ఈ గందరగోళం లో చివరకు ఏమి చేయాలో తెలీని సంధిగ్ధ స్థితిలో ఏపి ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ మొదలయ్యాయి..

మరేమైంది..?
అక్కడికే వస్తున్ననండోయ్...! వెబ్ ఆప్షన్స్ ఎంపికలో మేము కొత్త పద్దతి అవలంబించాము.. ముందు ఎక్కడ కావాలి? తరువాత ఏ బ్రాంచ్ కావాలి అనే ప్రాతిపదికన గతం లోని ఆయా కళాశాలల రికార్డ్స్ పరిశీలించి... ఓ పది కళాశాలలు ఆప్షన్స్ గా ఎంపిక చేసుకున్నాం.. అందులో ఒకటి " జిన్," .. కొత్త గా ఉంది కదూ.. అవునండీ.. జియో-ఇన్‌ఫర్‌మాటిక్స్ అనే బ్రాంచ్ కూడా ఉంది.. ! దేశంలో రెండు యూనివర్శిటీలే ఆఫర్ చేస్తున్నాయి.. ఒకటీ అన్నమలై చెన్నై, రెండు ఆంధ్రా యూనివర్శిటీ, వైజాగ్..

ఊహించనిది...!

అనుకోకుండా..ఫస్ట్ కౌన్సిలింగ్ లో మా వాడికి జియో ఇన్‌ఫర్‌మాటిక్స్ ఆంధ్రాయూనివర్శిటీ కాంపస్, వైజాగ్ లో వచ్చింది... మేము విజయవాడలో వస్తుందనుకున్నాం.తొమ్మిదో ఆప్షన్ లో సరదాగా పెట్టిన 'జిన్' రావడంతో మేమంతా షాక్..మరలా డీలా..! (అందుకే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎవరైనా సరే ఊహలు, నమ్మకాలు, సరదాలు తగ్గించుకోవాలి)

ఏంచేసేది లేక, వైజాగ్ వెళ్ళి యూనివర్శిటీ, దానితో పాటు, జిన్ బ్రాంచ్ కి వెళ్ళి వివరాలు తెలుసుకొని వచ్చాము.. నిజానికి అదొక మంచి కోర్స్ అని అర్ధమైంది.. సో సెకండ్ కౌన్సిలింగ్ లో విజయవాడలో సిఎస్‌సి రాకపోతే గనుక అక్కడే వైజాగ్ లో జిన్ లోనే జాయిన్ చేయాలని నిర్ణయించుకున్నాం.

ఇక్కడ మా ఫ్రెండ్, నందిని గారికి, వారి అమ్మగారికి కృతజ్ఞతలు తెలపాల్సిందే..! మేము వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి వచ్చేంతవరకూ వారు చేసిన సహాయం మరువరానిది.. వారింట్లో చేసిన లంచ్ కూడా..! థాంక్యూ నందిని..

రెండో కౌన్సిలింగ్ కోసం ఎదురుచూపులు.. :

పెళ్ళి చూపుల కోసం కూడా అంతలా ఏ ఏజ్ బార్ అమ్మాయి కూడా ఎదురు చూడదేమో అనిపించేంత గా ఎదురుచూశాం రెండో కౌన్సిలింగ్ డేట్ కోసం..! చివరకు పదహారన్నారు.. మరలా పోస్ట్ పోన్ చేశారు చివరకు 23న వెబ్ ఆప్షన్స్ కి తలుపులు తెరిచారు... ఆప్షన్స్ లో జాగ్రత్తగా విజయవాడలోని రెండు కాలేజీల్లో ఆరు బ్రాంచ్ లు, గుంటూరులోని ఒక కాలేజ్లో మూడు బ్రాంచ్ లు పెట్టాం రాకున్నట్లైటే తిరిగి వైజాగ్ వెళ్ళీపోవాలని నిశ్చయంతో!,..!

ఇంతకీ ఎక్కడ వచ్చింది..?


26 సాయంత్రం ఫైనలైజ్ అని చూసి ఉసూరంటూ ఊరుకున్నాం.. కానీ.. 25 సాయంత్రానికే ఎలాట్‌మెంట్ అయిపోయింది.. విజయవాడ లోని పొట్లూరి.వి.సిద్ధార్ధ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో సీటు వచ్చింది.. రూ.97 వేలు సంవత్సరానికి ఫీజ్...!
మరెలా..??
అన్నట్లు చెప్పనే లేదు కదూ.. పదివేలు ర్యాంక్ లోపల సీట్ వచ్చిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా విద్యనందిస్తోంది.. ఇంజనీరింగ్ లో.. ! (ఇటీవల తెలంగాణా ప్రభుత్వం కూడా ప్రకటించిందనుకుంటా..!)

సో....మా చిన్నోడు శ్రీశ్యాం శరణ్ కూడా ఫ్రీసీట్ సంపాదించాడండోయ్..!
పెద్దవాడు శ్రీరాం శరణ్ మెడిసిన్ లో ఫ్రీ సీట్ సంపాదిస్తే,..>! చిన్నవాడూ ఇంజనీరింగ్ లో ఫ్రీ సీట్ సంపాదించి.. మా కుటుంబం ఆనందాన్ని వెయ్యింతలు చేశాడనటంలో సందేహమే లేదు..! ఈ విద్యామహాయజ్ఞంలో మాకు ఎప్పుడు అండగా ఉండే మా తమ్ముళ్ళు లక్ష్మినారాయణ, కృష్ణచైతన్య, మరదళ్ళు భారతి, ఆనందలక్ష్మిలకు నా కృతజ్ఞతాపూర్వక ఆశీస్సులు..
ఇంతకీ విజయవాడ సీటు రావాలని దేవుళ్లను కోరుకున్న మా అమ్మ శ్రీమతి స్వరాజ్యలక్ష్మీసుబ్బారావు, నా శ్రీమతి రమా గాయత్రి ల ఆనందం మాత్రం చెప్పనలవి కావటం లేదు..


ఇదండీ సంగతి.. మీ ఆశీస్సుల జల్లు మా చిన్నవాడు శ్రీశ్యాం శరణ్ పై కురిపిస్తారని ఆశిస్తూ.. _ మీ కరణం

Tuesday, 7 June 2016

// అడుగుజాడలు//

// అడుగుజాడలు//
                                                       - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                                                           06.06.2016




కదిలిస్తే.. పగిలేందుకు సిద్ధంగా ఉన్న కన్నీటి కుండలే..!
అదిలిస్తే...  వర్షించేందుకు సిద్ధంగా ఉన్న కారుమేఘాలే...!!
పంటి బిగువున స్వేచ్ఛను తొక్కిపట్టుకున్న నడిచే జీవశ్చవాలే...!
తీరం ఉన్నా, చేరేందుకు ఆరాట పడని అలుపెరగని కెరటాలే..!!

ఎన్ని కథలకు అక్షరాల అరువు కావాలో ...
అన్ని గాథల గ్రంథాలయాలు..
జీవిత తిరగమోతల... ఘాటైన మసాలాలు..
విషాద ముగింపులకు ఆముఖాలు...
ప్రేమ మైకం ముంచిన వెర్రితనాలు..
కట్టుకున్నోడి కొరకొర చూపుల కాలిన చికెన్ పీసులు..
ఆలి గేలి చేసిన అభాగ్యపు మగతనాలు...

ఏ చరిత్ర లోనో ఎందుకూ..
ఏ మేను తరచి చూసినా ఏముంటోంది, గర్వకారణం...!
నిస్తేజ జీవితాల మైదానాలు
నేలపై పారాడే కడలి తరంగాలు...
అంతర్మధనంలో గూడుకట్టుకున్న భావాల చెలమలు..
కలం రెక్కలు కట్టుకున్న స్వేచ్చా విహంగాలు...
అక్షరాలే దారప్పోగులై నింగని తాకుతున్న పతంగాలు...
విజ్ఞాన గనుల నుండి పుట్టుకొస్తున్న మాణిక్యాలు..
విశృంఖలాలను నిలదీస్తున్న విప్లవ జ్యోతులు..
లోకం పోకడలను కలంపోటుతో నిలదీస్తూ..
సమాధుల్లా బ్రతుకీడుస్తున్న సమాజాల కాటికాపరులు
ఆలోచనల పుట్టలు..ఆవేశపు వడగాలులు..
అందరూ తమవారే అని అనుకునే అమాయక ధ్వజాలు
సమాజం కోసం కలం కత్తిగ మార్చి యుద్దం చేసే గెరిల్లాలు

మాయామర్మం తెలియని మాలోకాలు...
ప్రపంచం పట్టించుకోని అక్షర శిల్పులు
తమలోకం వారిని వెతుక్కుంటూ .. 
సంబరపడే అల్ప సంతోషులు..
వారికి వారె ఆత్మీయులు...
చిరునవ్వు వెనుక బడబాగ్ని బంధించి..
నవ్వుతూ బ్రతికేటి నిప్పుల కుంపట్లు .. నా నేస్తాలు...
కవి అన్న చిన్న పదానికి ..అంకితమై
అహరహం అక్షర సేద్యం చేసే కర్షకులు..
అందరు ఉన్నా ఒంటరిగా మిగిలే అనాధలు..
భావి తరానికి బాసటై..
బాటలుగా మారే అక్షరాల అడుగుజాడలు..!

శుభమధ్యాహ్నం మిత్రాస్_ మీ కరణం

Thursday, 26 May 2016

అరణ్య రోదన

//అరణ్య రోదన//

_ కరణం కళ్యాణ్ కృష్ణకుమార్
25.05.2016



వేదనా సంద్రాన్ని
విరహానికి ఓపికెక్కువే.. 
ఒంటి చేత్తో ఈదేసే, మనసు
తీరం చేరాలని, తరంగంగా మారి..
మొప్పలు పట్టుకుని.. 
అటు ఇటూ ఊగిసలాడుతూ ...
 
తదేకంగా.. లక్ష్యం కోసం
అందిపుచ్చుకోవాలన్న...
చూపుల లంగరేసి.. 
తపిస్తూ.. తపస్సే చేస్తూ.. 
 మధుమాసపు విరుల అందాన్ని 
 ఆశల వలయంలో
ఎన్ని అవస్థలు పడుతోందో

చిక్కుకున్న తుమ్మెదై.. 
మనోవేదన పై కనీళ్ళ జల్లునే 
కళ్ళాపిజల్లుతూ 
నా పిడికిలంత హృదయం
 నీ విరహతాపంలో...
ఆ రాకకై, వేచి వేచి చూస్తున్నా..

తెలిసీ.. ఏం చెప్పనూ..! 
నన్ను గేలిచేస్తూ.. 
ఎప్పుడూ నీవే గెలిచేలా చేసే.. 
నీ రాక.. అందని ద్రాక్షేనని....!

కబుర్లన్నీ వెదుక్కుంటూ..
కనులు నొచ్చుకుంటూనే ఉన్నా,.... 
 సముదాయిస్తూ.. సతాయింపు భరిస్తూ.. 
 వెర్రినై..వేదనాభరితమై.. 

 నీవు నీటిపై రాసిన స్వరానికి నోరునొక్కి..
తాత్సారానికి అలవాటుపడ్డ
నా చితికి నేనే 
 దహన సంస్కారం చేసుకుంటూ.. 
 అసంకల్పితంగా రోదిస్తూ.. 
రాలే జ్ఞాపకాల పత్రాలని 
దీనంగా చూస్తూ.. 
 నిన్నే తలుస్తూ.. 
సమయాన్ని నిందిస్తూ..

అరణ్య రోదన చేస్తున్న
 నా అంతరాత్మ గొంతుపై 
 అరిపాదాలేసి నొక్కేస్తున్నా..! 
నీ నిశబ్దం బద్దలు కొట్టాలని..
 నీలో నన్ను ఐక్యం చేయాలని..!!

Friday, 20 May 2016

సిరివెన్నెల సిరా జల్లు





నా అభిమాన 'సినీ' నెలవంక , నా మానస త్రిమూర్తులలో ఒకరు, గురువులు , అపర సరస్వతీ మానసపుత్రులు శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి జన్మదినం సందర్భంగా గతంలో నేను వ్రాసి వారికి సవినయంగా సమర్పించుకుంటున్న ఓ నూలుపోగు.. ఈ అక్షరాభిషేకం.. సీతారమశాస్త్రి గారికి మన: పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. _ కరణం

సిరివెన్నెల సిరా జల్లు
                           - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ 


సిరి మువ్వల చప్పుడు ఆయన గీతమాలికలు
సిరి అంచు పట్టు ఆయన అక్షరములు
సిరి వెన్నెల వెలుగులు ఆయన నగవులు
సిరియాయె భారతి ఆయనకు రమాకృష్ణా..!


ఆ 'చెంబోలు' కళ్ళు ...

వెదుకుతూనే ఉంటాయి ప్రపంచాన్ని..
ఎటేపో ఒంటరి ఆడదై ప్రయాణిస్తాయి.
ఎవరో ఒకరు.. నడవరా అంటూ చలన నాడులౌతాయ్
దుర్బిణి వేసి చూస్తాయి కాల గమనాన్ని..
బూడిదిచ్చేవాడిని ఏమి కోరాలంటూ నిలదీస్తాయి..
ఉందిగా సెప్టెంబరు మార్చి పైన అంటూ ఓదారుస్తాయి..

శరమై చండాడుతాయి..సన్నివేశాన్ని..
నిప్పుతునకతో కార్చిచ్చురగిలిస్తాయి..
సిగ్గులేని జనాన్ని అగ్గితో కడిగిపారేస్తాయ్

ఆమాంతం తడుముతాయి..
లక్షలపుస్తకాలలోని అక్షరక్రమాన్ని..!
సాహసం చేసేందుకు డింభకుణ్ణి సిద్ధం చేస్తాయి..
నువ్వే..నువ్వే..నువ్వేనువ్వు..అంటూ గుండె కవాటాలను కదిలిస్తాయ్
వద్దురా..సోదరా నువెళ్ళెళ్ళి పెళ్ళి గోతిలో పడొద్దంటూ హెచ్చరిస్తాయ్..

ఆయన పాళీ.. సిరా ..!



ఈ వేళలో నువ్వేం చేస్తూ ఉంటావో అంటూ..
ప్రియ గారాలతో ఆరాలు తీస్తాయ్..
కన్నుల్లో నీరూపం పదిలమంటూ..
వర్తమాన దర్శినై నిన్ను నీకే చూపుతాయ్..
కోటానుకోట్ల పదాలలో మునిగి సరళమై..
మదిని తాకుతాయ్..మనోరంజనమౌతాయ్..
వెన్నెల జలపాతాల సడిలోని చల్లనిగాలై  స్పర్శిస్తాయ్..
పులకింతలతో.. పునీతం చేస్తాయ్..
కమ్మగా అమ్మై జోలపాట పాడతాయ్..

 ఆ సుమధురాక్షరాల అక్షతలు..

ఆవేశమై అరుస్తాయి..
అణువణువూ అణ్వేషిస్తాయ్..
అంతా తానై ఆలోచిస్తాయ్..
ఆపుకోలేక ఆక్రోశిస్తాయ్..
అంతలోనే ఆనందిస్తాయ్..
అవేదనలో తమతో తామే రమిస్తాయ్..

దిక్సూచై మెరుస్తాయి ఆయన 'కల ' మధురిమలు
భాండమై నిలుస్తాయి శిష్యులను వరించ 'కల 'లు
నిర్మాతల శిరముపై ఆ పదాలు  పన్నీటి జల్లులు
పండితపామరులపై కురిసే సిరివెన్నెల తరగలు.. ఆయన పాటలు
అవి అచ్చంగా తెలుగు నేలపై పరచిన వెన్నెలకిరణాలు

ఆ పల్లవులు సిరిజ్యోతల సంస్కారమై నమస్కరిస్తాయ్
ఆ చరణాలు సిరిమల్లెల పరిమళాలై ఆహ్వానిస్తాయ్..
ఆ వచానాలు విరితేనెల రంగరించిన తెలుగునుచ్చరిస్తాయ్..



ఆ...
ప్రణవనాద జగత్తుకు ప్రాణం పోసిన

సీతారా'ముని'కి కరణం ప్రణామాలు
నడిచే పాటకు నమోవాకాలు
కదిలే కవితకు అక్షరలక్షలు
జతుల జావళికి సిరిజ్యోతలు
నిలువెత్తు కవనానికి నెసర్లు
వాచస్పతికి వేవేల వందనాలు
సరిగమల సెలయేరుకు సాధువాదాలు
      - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
            05.04.2014



Friday, 8 April 2016

//ఎక్కడ నా కావ్యనాయిక//

Kalyan Krishna Kumar Karanam's photo.లక్ష్యం వైపు పరుగుపెడుతున్నా..
మాలిక పత్రిక ఉగాది పొటీలలో కన్సొలేషన్ బహుమతి పొందిన నాకవిత.. మాలిక పత్రిక వారికి కృతజ్ఞతలతో.. వారి అనుమతితో మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలతో.. _ మీ కరణం
//ఎక్కడ నా కావ్యనాయిక//
_కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్, 13.03.2016
నా కైతకు ఆలంబన
నా కవితా ప్రాణవాయువు
నా కవనానికి కథానాయిక..
జాడ ఏదీ..? ఎక్కడ..? కనబడదే..?
అలనాటి కవుల వర్ణన వెతుక్కుంటూ..
కుసుమాగమ కేళీవిలాసాలను తలచుకుంటూ 

సిమెంటడవులు దాటి..
దూరంగా.. సుదూరంగా..
పాదాలు భూమిలో దిగబడుతున్నా,
పరిగెడుతున్నా..! పరుగు పెడుతూనే ఉన్నా!
ఎంతదూరం..? ఇంకెంతదూరం..?
విపినమంత ఎడారులై ..
పచ్చదనమంత ఒయాసిస్సులై
నన్నెక్కడికో నడిపించేస్తున్నాయ్..
అలసట.. ఆయాసం..
బొట్లు, బొట్లుగ కారుతున్న తాపం..
నోరెండి, బెట్టకడుతోంది..
నీడలేక మేను ఉక్కిరౌతోంది..
ఉక్కపోత..నెత్తిన చిందాడుతున్న భానుడు..
అయినా మసకబడ్డ కళ్ళు వెదుకుతూనే ఉన్నాయ్..
మనసు పరిగెడుతూనే ఉంది..చూడాలి..
ఒక్కసారి కళ్ళారా చూసి, కావ్యమేదో రాయాలి..
తడి ఆరి నోరు తెరచిన బీళ్ళు
నను దీనంగా చూస్తున్నాయ్..
నన్ను కదిలించలేవ్..
ఆకాశానికేసి ఆబగా చూస్తున్న చెరువులు
నన్ను చూసి వెర్రిగా నవ్వుకున్నాయ్..
నేను తగ్గేదే లేదు..
ఎంత దూరం నడిచినా..దూరం తరగటం లేదు..
నా కావ్య నాయిక ఉనికి కనిపించటంలేదు...!
దాశరధి కలాన జాలువారిన రీతి
శేషేంద్ర శర్మ పద్యాల శైలి
ఎంత నడిచినా..ఏ దిక్కు వెదకినా
ప్రకృతిలో వారు చూపిన అందమేదో..
ఊహు.., కానరాక,
నా హృది ఆగ్రహంతో ఊగిపోతోంది..
ప్రకృతిని పరిహాసమాడుతూ,
ఋతువులన్నీ బోసిపోయాయ్...
నీలాకాశాన ఏదీ ఆ కాదంబిని శోభ
ఇంధ్రధనుస్సు సప్తవర్ణ వయ్యారాలెక్కడ..
మలయమారుత కేళీవిలాసమెక్కడ..
బాలసమీరము సరస స్పర్శలెక్కడ..
కలకూజితాల కుహూరవములేవీ..
వగరు మామిడి ఫలముల పూతలేవీ..
సురభి ఋతువున హరితపు చాయలేవి
ప్రకృతి పట్టుకొమ్మకు చిగురించిన పత్రాలేవీ.!
కిరీటి మూటకట్టిన ఆయుధాల్లా..
శమీవృక్షం పై జంతుకళేబరంలో దాగున్నాయా... ?
కాలుష్యపు కాసారాలకు, మూలంగా మారుతున్న
మానవుడి మేథో సంపత్తికి భీతిల్లి మాయమయ్యాయా..?
స్వార్ధం ఈనిన నేలమీద,
బ్రతుకెందుకని బలవన్మరణం చేసుకున్నాయా..?
ఏదీ కావ్యనాయిక కానరాదే..!
నా కవితకు ప్రాణవాయువందిచదే!
రాదు.. రానే రాదు
కానరాదు.. కవితకాదు.
మానిసి... మసి కమ్మిన కసాయిత్వాన్ని
కుబుసంలా విడిచేంతవరకు,
నిండా, ఎండిన మానసికరుగ్మత వీడి,
సదాలోచనల కొత్త చివురులు తొడిగి..
వసంత రాగమాలపించేంతవరకు..
అంతరంగాన ఆమని పూయించి..
మృగాన్ని మనిషిగా చేసిన,
ప్రకృతిని మనసారా ఆరాధించే వరకూ..
వసంతం ఋతుక్రమం తప్పుతూనే ఉంటుంది.
ఆనందం ఆవిరి చేస్తూనే ఉంటుంది..
కావ్యనాయిక కలగానే మిగిలిపోతుందంటూ..
ఎక్కడ నుంచో ఆకాశవాణి ,
స్పృహకోల్పోయిన అంతరంగాన్ని తట్టి చెబుతోంది.
మనిషి మారిన నాడే నిత్య వసంతం..!
అదే నిఖిల జగత్తుకు యుగాది నివేదనం!!

 ప్రియ స్నేహితులందరికీ నాహృదయపూర్వక దుర్ముఖినామ శుభాకాంక్షలు - మీ కరణం
____________*****__________
http://magazine.maalika.org/
(ఈ లంకె మోది మాలిక పత్రిక ఉగాది ప్రత్యేక సంచిక లోని కవితాపోటీలో విజేతల కవితలు, కార్టూన్ పోటీలో నెగ్గిన కార్టూన్ లతో పాటు ఎన్నో కథలు, కవితలు, నవలలు చదివే అవకాశం వినియోగించుకోగలరు... )

Wednesday, 9 March 2016

'విశ్వ'నాథ దర్శనం -2


'విశ్వ'నాథ దర్శనం -2 - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ 04.03.2016

గురు బ్రహ్మ..గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహ ఓం నమో నమో నమశివాయ మంగళ ప్రదాయ గోపురంగతె నమశివాయ గంగయా తరంగి తోటమాంగినే నమశివాయ ఓం నమో నమో నమశివాయ శూలినే నమో నమహ్ కపాలినే నమశివాయ పాలినే విరంచితుండ మాలినే నమశివాయ..!!

విశ్వనాథ్ గారి ఇంటి ఆవరణలోకి ప్రవేశించి, అక్కడే ఉన్న లిఫ్ట్‌లో పై ఫ్లోర్ కి వెళ్లాము.. ఒక వ్యక్తి వచ్చి తలుపు తీశారు. పెద్ద హాల్ లో నాలుగు దిక్కులలో సోఫాలు.... సోఫాలో విశ్వనాథ్ గారున్నట్లున్నారు.. విజయదుర్గ గారి వెనుకే నేను ఉండటంతో నాకు వారు కనబడలేదు.. "అయ్యో..అయ్యో.. ఇంకెంతసేపూ.. దగ్గర నుంచి చూసే భాగ్యం" అంటున్న నా అంతరంగం ప్రశ్నలకు 'షటప్' అని సమాధానపరచుకున్నా..! అసలే నేను టెన్షన్ తో కొట్టుమిట్టడుతుంటే.. ఈ అంతరంగం ఒకటి.. బాబోయ్ ఎంత ఇబ్బంది పెట్టిందో చెప్పలేనండీ.! హాల్లో అడుగుపెట్టిన వెంటనే విజయదుర్గ గారు వారికి "నమస్కారం" చెప్పారు.. "నమస్కారం.." ప్రతి నమస్కారపు గంభీర స్వరం ధ్వనించింది. ఆమె వెనుకే నేను... గుండె ఘోష నాకు తెలుస్తూనే ఉంది.. అడుగులో అడుగేసుకుంటూ మరో రెండడుగులు వారిని చూసేందుకు ముందుకు వేశా..! నన్ను పరిచయం చేశారు విజయదుర్గ గారు.. తూర్పు వైపుకు కూర్చుని ఉన్న వారు....ఎలా ఉన్నారంటే..! "కొలువై ఉన్నాడే.. దేవదేవుడు.. కొలువై ఉన్నాడే... కొలువై ఉన్నాడే.. దేవదేవుడు.. కొలువై ఉన్నాడే... కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే..! కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే..!"  

ఎదురుగా.. దేవ దేవుడు.. మహాదేవుడైన విశ్వనాధుడే కోటి సూర్యుల తేజస్సుకు సమానముగా ప్రకాశిస్తూ కొలువై వున్నాడా అనిపించేంత ..ఠీవిగా కుర్చీలో.. ఆశీనుడై ఉన్నారు.. వారిని ఒకసారి ఆరాధనాపూర్వకంగా చూసా..! నెరిసిన పెద్దగడ్డం.. మెలి తిరిగిన మీసాలు.. కళ్లల్లో తేజస్సు.. ధవళ వర్ణ శోభతో .. మెరిస్తున్న దుస్తులు ధరించి.. సాక్షాత్తూ యోగ రూపుడైన కాశీ విశ్వేశ్వరుడే కొలువై ఉన్నట్లు కూర్చొని ఉన్నారు. పెద్దలను కలిసేటప్పుడు పుష్పం, ఫలం, తోయం మూడూ.. లేదా కనీసం వీటిలో ఒకటైనా..తీసుకెళ్లాలని చిన్నప్పుడెప్పుడో స్కూల్ మాస్టర్లు చెప్పిన విషయం జ్ఞాపకముంచుకుని, నేను తీసుకెళ్ళిన ద్రాక్ష వారి చేతికందించి.. నేరుగా వారి పాదాల పై పడిపోయాను... పైకి చెప్పని నేను లోలోన ప్రవర వినిపించాను... అంతసేపూ వారి పాదాల పైనే ఉన్నా..! అప్పుడు నా పరిస్థితి... "అందెల రవమిది పదములదా..!! అంబరమంటిన హృదయముదా..!" అని నా హృది ఎగిరి ఆకాశం ఎత్తున గంతులేసింది.. లేగదూడ ఆనందం లోలోన విరిసింది.. "కూర్చోండి" అని వారెదురుగా ఉన్న సోఫా చూపించారు.. వెంటనే.. విజయదుర్గ గారిని "ఎలా ఉన్నారూ ?"అని అడిగారు.. వారు బాగున్నాను సర్.. మీరెలా ఉన్నారు..? అని అడిగారు నేను మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్.. వాస్తవానికి నాకు విరుద్దంగా..! ఏం మాట్లాడాలో, ఏమీ ఆలోచనలో లేదు..చూడటం మాత్రమే నా కోరిక.. ఎదురుగా నే ఉన్న ఆ నిలువెత్తు రూపాన్ని రెప్పవాల్చకూండా చూస్తూ ఉన్నా..! 


వెంటనే నా వైపు తిరిగి "మీరేం చేస్తారు" అన్నారు.. 
"జెమిని న్యూస్ లో రిపోర్టర్" అని చెప్పారు విజయదుర్గ గారు... నాకు వారికి మధ్య సంభాషణ మొదలైంది..

"జెమిని న్యూస్ అంటే.. తమిళనాడు వాళ్ళదే కదూ..!" అవునండీ..! "ఇక్కడ ఎవరు చూస్తారు.." "ఎండి గారు కిరణ్ గారండీ.." "ఓ కిరణ్ గారా.. ఆ నాకు తెలుసులే.. ! నేనును మాట్లాడతాను లే..!... "జెమినిలో నేను చేసిన సీరియల్ కంటెంట్ నా లైబ్రరీలో పోయింది.. అది వారి వద్ద ఉంటే అడిగి తీసుకుందామని" అన్నారు విశ్వనాథ్ గారు.. "మీరెక్కడ ఉంటారు" నాతో.. మాటలు పొడిగించారాయన. (హైద్రాబాద్ లో ఎక్కడ వుంటారు? ) !" "ఇక్కడ కాదండీ.. నేను ఉండేది చీరాల, పనిచేసేది ప్రకాశం జిల్లా రిపోర్టర్ గా, ఒంగోలు బేస్డ్ "  


ఇక ఒంగోలు కబుర్లు షురూ..!

------------------------ "మా హరనాధరావు ఎలా ఉన్నాడు( Mvsharanatha Rao gaaru ) " మాటల పూదోట ఒంగోలు వాసి అయిన ఎం.వి.ఎస్. హరనాధరావుగారి గురించి ఆరా తీశారు. చాలా బావున్నారండీ.. ! మా ఆఫీస్ కి దగ్గరే హరనాధరావుగారిల్లు.. "ధారా రామనాధ శాస్త్రి గారెలా ఉన్నారూ".. అని అడిగారు. "చాలా బావున్నారండీ.. ! ఇటీవలే వారి నాట్యావధానం షష్ట్యబ్ధి ఉత్సవాలు జరిగాయ్.." అన్నాను.. "అవునా ఒంగోలు వెళ్ళినప్పుడు వారింటికి వెళ్ళి కలిసొచ్చా.!" అన్నారు విశ్వనాథ్ గారు.. "ఒంగోలులో హోటల్స్ బావుండవనుకున్నా.. ! ఫర్వాలేదు బాగున్నాయ్.. ఈ మధ్య నాట్య పాఠశాల వార్షికోత్సవానికి వచ్చాను.. ! వారు ఒంగోలు పిలవగానే భయపడ్డాను..హోటల్స్ ఎలా ఉంటాయోనని.. ఆ డాన్స్ టిచర్ వాళ్ల బాబాయ్ తిరుపతిలో ఉంటారు.. ఆయన పిలిచారు.. తప్పలేదు.. కానీ బాగానే ఉన్నాయ్.. అంటూ ఒంగోల్ హోటళ్ళను మెచ్చుకున్నారు గురువుగారు.. "అప్పుడు విజయవాడ వరకు ఫ్లైట్ లో వచ్చి అక్కడ నుండి ఒంగోలుకు కార్ లో వచ్చా..!" అని ఒంగోలుకు వచ్చిన రోజును వారు గుర్తుచేసుకున్నారు. అంతలో విజయ దుర్గ గారు.. "భోజనం కూడా ఒంగోల్ లో బావుంటుందండీ.." అన్నారు.. "నేను ఎక్కడికి వెళ్ళినా బయట తినే ఛాన్స్ ఉండదమ్మా..! ఎవరో ఒకరు వారింటికి తీసుకెళ్తుంటారు.." అంటూ ఓ నవ్వు నవ్వారు..! విశ్వనాథ్ గారు. కొద్దిసేపు నవ్వులు విరిశాయ్.. "మరి చీరాల... ?" అక్కడ ఎందుకున్నారు అన్నట్లు అడిగారు.. మా నాన్న గారు రిటైర్ అయ్యి అక్కడే ఇల్లు కట్టుకున్నారండి ! అందుకే అక్కడే వారితోనే వున్నాం.. ఇక్కడ మా తమ్ముడు (చైతన్య), విజయవాడలో మరో తమ్ముడు (నారాయణ) ఉంటారండి. నేను నాన్న గారి వద్దే ఉంటా..! " అవును పెద్ద వాళ్ళు ,. వారి సొంత ఇల్లు దాటి రావడానికి అస్సలు ఇష్టపడరు.." అన్నారు.. వారామాటనగానే నాకు నేను వ్రాసిన " ఎత్తరుగుల ఇల్లు" కథ గుర్తొచ్చింది.. "మీనాన్న గారు లెక్చరర్ కదా..! ఏ లెక్చరర్ రో చెప్పు" అన్నారు విజయదుర్గ గారు
"జువాలజీ అండి.. డిగ్రి కాలేజ్ ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అయ్యార"న్నా!..అంతలో జెమిని హైద్రాబాద్ చూసేది కిరణ్ గారేకదా.. అన్నారు.. అవును సర్.. కిరణ్ గారే.. ! అన్నాన్నేను" "నేను ఫోన్ చేసి మాట్లాడతా..లే..! నా కథను ఒక తమిళ్ నిర్మాత వచ్చి సీరియల్ కి అడిగారు.. అప్పటికే నేను తయారు చేసుకున్న చాలా మంచి కథ ఉంది... అది చెప్పా! మనం సినిమాకి సంబంధించి కథలు చేసుకుంటాం కానీ, సీరియల్స్ గురించి ఆలోచించం కదా.! మేం తయారు చేసుకునే కథ రెండున్నర గంటలకు సరిపడా ఉంటుంది.. సీరియల్ కూడా బాగానే మొదలైంది.. "సర్వమంగళ" అని. జెమినిలో టెలికాస్ట్ అయ్యిందిలే..! అని.సీరియల్ గురించి చెప్పారు విశ్వనాథ్ గారు.. "అవునండీ నేను చూశా ఆ సీరియల్ భానుప్రియ గారు కదా.! కీ రోల్ .. సీరియల్ థీం చాలా బావుంది.." అన్నారు విజయదుర్గ గారు. ఎప్పుడైతే విజయదుర్గ గారు ఆ మాటన్నారో..! ఆయన కళ్లల్లో ఆనందంతో పాటు ఒకింత గర్వం తొణికిసలాడింది.. నేను చూస్తూనే ఉన్నా.! నన్ను చూస్తూనే మాట్లాడుతున్నారాయన.!.. "ఆ ప్రాజెక్ట్ చెయ్యాలనుంది.. సీరియల్ కన్నా సినిమా బాగా వస్తుంది.. ఆ నిర్మాతకూడా నాకు పేమెంట్ ఇవ్వలేదు..ఆర్టిస్ట్ లకు కూడా ఇవ్వలేదనుకుంటా..!నన్ను చేయమన్నారు.. కానీ నేను వేషం వెయ్యను అన్నాను.. శరత్ బాబు బాగుంటారూ అందుకని ఆయన్ని రికమెండ్ చేశా..! అరవై ఏళ్ల మహా పండితుడైన బ్రహ్మచారి కథ.. వేరొకడి చేతిలో మోసపోయి గర్భవతి అయిన 25 ఏళ్ళ అమ్మాయి ..అనుకోకుండా ఆ బ్రహ్మచారి వృద్ధుడితో కలిసి నడవాల్సొచ్చినప్పుడు.. నా బిడ్డకు మీ ఇంటి పేరు ఇస్తారా..? అని ఆమె అడగటం" అనే సినిమా కథలోని ముఖ్య ఘట్టం , ( కాశీ క్షేత్రం బ్యాగ్ డ్రాప్ లో జరుగుతుంది.) ప్రస్తావించినప్పుడు వింటున్న మాకు ఒక్కసారిగా కన్నీటి పొర తడిసిపోయింది.. ఇక ఆయన చిత్రిస్తే..! ఎంత అందంగా రూపుదిద్దుకుంటుందో అనిపించింది నాకు..!  
సముద్ర తీరాల గురించి కాసేపు సాగిన ముచ్చట.! ------------------------------------------ "బాపట్ల దగ్గర ఏవో రిసార్ట్స్ ఉండాలి..అదే ఊరు..!" ప్రశ్నించారాయన. షడన్ గా నాకు గుర్తురాలేదు... సూర్యలంక బీచ్ గురించి అడిగారు.. "అదేమి అంత బాలేదు.." మా ఫ్రెండ్ ఎవరో చెబితే బాపట్లలో కోనా ప్రభాకర్ రావు గారింట్లో ఒక ఫంక్షన్ కి వచ్చినప్పుడు వెళ్ళా..! "కోస్తాలో చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గరి హార్స్లీ హిల్స్ తప్ప ...ఏవి సమ్మర్ స్పాట్స్ లేవనుకుంటా..! హార్స్లీ హిల్స్ బావుంటుంది.. " అన్నారాయన.. ఇప్పుడు చీరాలలో మంచి రిసార్ట్స్ వచ్చాయండి..! చాలా మంచి పేరొచ్చింది.. సీ బ్రీజ్ రిసార్ట్స్ అని పెట్టారు..సీ బ్రీజ్ రిసార్ట్స్ కి మంచి పేరొచ్చింది.. ఇప్పుడు పైవ్ స్టార్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు..కుడా.. ! పాంకోస్ట్ అని.. ఇంకా కొన్ని రిసార్ట్స్ కుడా వచ్చాయండి.. " అన్నాన్నేను.. మా చీరాల దేనికి తీసిపోదన్నట్లు.. "ఏమో ఆ బాపట్ల బీచ్ అస్సలు మెయింటనేన్స్ లేనే లేదు.. " అన్నారాయన. "సూర్యలంక బీచ్ రిసార్ట్స్ ప్రభుత్వంది కదా.! సర్ అలాగే ఉంటాయ్.. గతంలో చాలా బాగా ఉండేది.. ఫేమస్ కుడా..! అన్నాన్నేను బాపట్ల సూర్యలంక బీచ్ మదిలో మెదులుతుండగా! అంతలో ఇంట్లోకి వచ్చిన విశ్వనాథ్ గారి పెద్దబ్బాయ్ మమ్మల్ని పలకరించి.. నేరుగా లోపలి వెళ్ళి మూడు బిస్కట్లు తెచ్చి మా ముందుంచారు.. "తీసుకోండి" అన్నారు పెద్దాయన.!.. నేను దుర్గ గారు చెరొకటి తీసుకున్నాం.. అత్యద్భుతంగా ఉన్న ఆ బిస్కట్ గురించి ఆయన చెబుతూ.. అవి మన పల్లి పట్టీ లాంటివి అన్నారు.. ఇక్కడే బేకరీ ఉందమ్మా!.. స్విస్ కాజల్స్ అని చాలా బావుంటాయ్.. విజయదుర్గ గారికి ఆ బేకరీ అడ్రస్ చెప్పారు.. " నన్ను పట్టించుకోరేంటి అని పాపం ఎదురుచూస్తోంది.." అన్నారు విశ్వనాథ్ గారు అకస్మాత్తుగా.!. దేని గురించో నాకు అర్ధం కాలేదు.. ఒక్కక్షణం.! తెలిసిన తర్వాత నవ్వాగలేదు.. ఎదురుగా టేబుల్ పై సాసర్ లో ఉన్న మూడో బిస్కట్ గురించి..! వారు చెణుకు విసిరారు. "చెరి సగం తినండి.. పాపం లేకుంటే అది బాధపడుతుంది" అని మూడవ బిస్కట్ నుద్దేశించి హాస్యమాడారు.. కాసేపు మరలా నవ్వులు మెరిశాయ్..!!

అంతలో మా ముచ్చట సినిమాల మీదకి మళ్ళింది.. _________________________________ 'అమ్మమనసు సినిమా..!'గురించి ప్రస్తావనొచ్చింది.... ఈ సినిమా పేరు నేనైతే వినలేదు.. పుట్టానో లేదో గుగూలమ్మని అడిగి తెలుసుకోవాలి.. 'నేరము శిక్ష' సినిమాలో కృష్ణ గారి ప్రక్కన రోల్ వేసిన భారతి గారిని .. 'అమ్మమనసు'లో చలం గారి ప్రక్కన తీసుకున్నారు.. ఎందుకు సార్..! ? అని అడిగారు విజయదుర్గ గారు.. ఏదో అలాజరిగిపోయింది...అదో మంచి సినిమా..! "సత్యనారాయణ. జయంతి మెయిన్ క్యారెక్టర్స్... జయంతి సత్యన్నారాయణ చేతిలో మోసపోయి గర్భవతై కూడా... ప్రియుడిని. పెంచిన మేనమామ కూతురిని వివాహం చేసుకోవటమే సరియైనదని.. ఆ మామ గారి కూతుర్నే పెళ్ళి చేసుకోమనే కథ .. చాలా బాగొచ్చింది.." అని ఆ సినిమాని గుర్తు చేసుకున్నారాయన.! "అవునండి చాలా మంచి సినిమా.. మూగ కొడుకుని కని, ఆ పిల్లాడిని కూడా తాను నడుపుతున్న అనాధాశ్రమంలో అనాధలాగే పెంచుతారు జయంతి... అమ్మ అని పిలిపించుకోవాలన్న ఆశతో ఉన్న జయంతి చనిపోయేంత వరకు అమ్మ అని పిలవలేడు.." అంటూ ఆ కథ లోని సెకండ్ పార్ట్ ని మేడం విజయదుర్గ గారు వినిపించారు.. పోన్లే విశ్వనాథ్ గారి ఈ చిత్రం మనం చూడలేదు అన్న బాధ తప్పింది.. వారి నోటితోనే సినిమా విన్నాం కదా..! అంతకంటే ఏం కావాలి చెప్పండి..! అన్నట్లు 'అమ్మ మనసు' డిస్కషన్ జరుగుతున్నప్పుడు కూడా ఆయన నావైపే చూస్తూ మాట్లాడుతున్నారు.. నా మనసు ఉప్పొంగి పోతొంది..నేను ఎలా కూర్చున్నానో అని ఒక్కసారి పరిశీలనగా చూసుకున్నాను.. స్ట్రైట్ గా చేతులు కట్టుకుని. . సోపాలో ముందుకి నిటారుగా కూర్చొని ఉన్నా..! బాగ పరిశీలిస్తే..! గాల్లో ఉన్నానండీ.. బాబూ..!


అంతలో వారింట్లో భోజన సన్నాహాలు చేస్తున్నట్లు చిన్నపాటి శబ్దాలు వినిపించినయ్..! గాంధీ గారు ఆనంద పరవశుడై ఎవరితోనైనా కబుర్లలో ఉంటే ఏంచేయాలో అర్ధం కాని ఆయన శిష్యురాలు అలారం తెచ్చి ఎదురుగా పెట్టి వెళ్ళేవారుట..అలా లోపలి శబ్ధం విని పెద్దాయన మాతో కబుర్లలో పడి సమయం మరచిపోయినట్లున్నారని, మా వల్ల వారికి ఇబ్బంది కలగ కూడదని నేను ఉత్తిష్ట అనదాం అనుకునే లోపే, నాకన్నా షార్ప్ గా విజయదుర్గ గారు లేచి బయలుదేరదాం అన్నారు.. అప్పుడు చూశాను వారి చిత్రం దూరంగా వీణ తో ఉన్న విశ్వనాథ్ గారి ఫొటో..అద్భుతంగా ఉంది.. ఇంకా చిన్నచిన్న వన్నీనూ..! అంటే అప్పటి దాకా వారిని తప్ప పరిసరాలు ఏవి చూడలేదండి బాబూ..!


అప్పుడే మేమొచ్చి గంట అయిపోయింది...
ఫొటోలు దిగాం.. నేనూ మేడం ఉన్న ఫొటోని స్వయంగా విశ్వనాథ్ గారి అబ్బాయే తీశారు.. థాంక్స్ టూ హిం.. వెళ్ళొస్తామని చెప్పి విశ్వనాథ్ గారి కాళ్ళకు మరొక్కసారి నమస్కరించుకుని లేచాను.. ఆయన చేతులు ఆశీర్వదిస్తున్నట్లు.. పెకిలేచాయి.. ఆ తన్మయత్వంలో బయటకు ఎటువెళ్లాలో కూడా అర్ధం కాలేదు నాకు.. "వెళ్లి పోదాం అన్నందుకు ఏమి అనుకోకు..కృష్ణ వారికి భోజన వేళ అయినట్లుందని వెళ్దాం అన్నాను.."అని విజయదుర్గ గారు నాతో అన్నారు... నేను చిరునవ్వు నవ్వా..! అర్ధమైఁదన్నట్లు..! "కాశీనాధుని విశ్వనాథ్ గారిని కాదు కాశీ విశ్వనాధుడినే చూసినట్లుంది వారిని చూస్తుంటే" అని అన్నాన్నేను.విజయదుర్గ గారికి థాంక్స్ చెబుతూ ..!

నాకు తెలిసి ఇంతవరకూ అంతసేపు విశ్వనాథ్ గారు ఎవరితోనూ మాట్లాడిన దాఖలాలు లేవు కృష్ణా అని విజయదుర్గ గారన్నారు. ఆ నిముషం నాకు 'సాగరసంగమం' చిత్రం లో పచ్చగడ్డిలో కూర్చొని... మాధవి (జయప్రద) అందించిన '25 వ ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టవల్స్ ఇన్విటేషన్' చూస్తూ అందులో..'క్లాసికల్ డాన్స్ రిసైటల్ బై శ్రీబాలకృష్ణ' అన్న అక్షరాలు చూశాక, తనను తాను నమ్మని స్థితిలో ఉక్కిరిబిక్కిరైన బాలుడిలా మారిన బాలు పరిస్థితే నాది.. ! కనుదోయి నుంచి ఆనందభాష్పాల వృష్ణి.. ఏదైనా రాసుండాలండీ...!

మొన్న చీరాలలో మానాన్న గారికి విశ్వనాథ్ గారితో నాఫొటోలు ... చూపిస్తే ఏమానందించారో..! చెప్పలేను.. "నాన్నా ఈ ఫోటోలో ఎవరో గుర్తుపట్టారా..! విశ్వనాథ్ గారు..వారి ప్రక్కన నేను" అనగానే ఆయన మోము విరిసింది.. "గడ్డం పెంచారు..! అని ముసి ముసి గా నవ్వి.. నాకన్నా పెద్దవారు" అన్నారు. స్వస్తి.. (మిత్రులారా..! ఫిబ్రవరి 29న అనుకోకుండా కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథ్ గారిని కలిసి ముచ్చటించే భాగ్యం కలిగింది.. ఆరోజు మధుర క్షణాలను మీ అందరితో పంచుకోవాలనే ఆశతో అందిస్తున్నాను.. ఇది రెండవభాగం..)







Saturday, 5 March 2016

'విశ్వ'నాధ దర్శనం...1

'విశ్వ'నాధ దర్శనం...1
                                                                                        _ కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్,03.03.2016

గంగా తరంగ రమణీయ జటా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం |
నారాయణ ప్రియం అనంగ మదాపహారం
వారాణసీపురపతిం భజ విశ్వనాథం ||

సర్వేశ్వరుని నేరుగా దర్శిస్తే ఎలా ఉంటుంది.. ఊహే పులకింత కలిగిస్తోంది కదూ.. నిజమే నేను సర్వేశ్వరుని కలిసే భాగ్యం ఈ లీపు సంవత్సరం అందించింది. నా కొద్దిపాటి పాఠవంతో.. వారి గురించి క్లుప్తంగా...!



కాశీనాధుని వారు..  
కల్లాకపటం లేని వారు
కళలకు కాణాచి వీరు
కదిలే విద్వత్తుల మేరు
కాసేపు ముచ్చట చాలు..
అండ పిండబ్రహ్మాండంబుల
దర్శనమే ముంగిట వాలు.!
పలికే పలుకులు
'సాగర సంగమ' దృశ్యకావ్యాలు  

ఆ ముసిముసి నగవులు
మెరిసేటి 'సిరివెన్నెల' జిలుగురేఖలు.
ఆ ప్రేమనిండిన మాటల్లోని 
'శృతిలయలు'...
ఎదలోని భావతరంగాలను సవరించేటి
"సిరిసిరిమువ్వ"ల సవ్వడులు
'శంకారభరణ'మైన 
ఆ నిలువెత్తు రూపం..
నటరాజు మ్రోల
'స్వర్ణకమలం'..
కదిలిస్తే కథల వరద..
కదిలించేటి మనుసులోతు పొర
కళ్ళల్లో తొంగిచూసేటి నిండైన'ఆత్మగౌరవం'
అనాచారాలను నిష్కర్షగ దూనమాడే  
'సప్తపది' అడుగులు..
అమాయకత్వంతో ఇజాన్ని మార్చిన 
'స్వాతిముత్యపు' చిందులుతో
మెరిపించి,మైమరపించిన ఠీవి..! కళాతపస్వి..!!
మనుషుల్లో మార్పుకోసం సినిమా వేదికగా
తపన పడీ, వెలిగిన 'స్వయంకృషీ'వలురు..
వారి 'శుభసంకల్పం'తో..
'ఆపద్భాందవుడు'లా, 
సినీచరిత్ర గతి మార్చిన వైనం
ఎందరికో మార్గదర్శకం..
జాతీయ అవార్డుల 'శుభలేఖ'లు 
తెలుగు సినిమా వాకిళ్ళకు 
తోరణాలుగ జేసిన తేటతెలుగు 'స్వాతికిరణం'
వారే నా హృదయ పీఠాన కొలువైన రూపం.
వారే వారే 'కాశీనాధుని విశ్వనాథ్'ల వారనే బృహత్కావ్యం. 
                                                    - కరణం 29.02.2016


సరే..! ఈ ఆనంద పరవశానికి కారణం.. ఫిబ్రవరి 29 మధ్యాహ్నం 12.30 సమయంలో నేను సాక్షాత్తూ కాశీ విశ్వేశ్వరుని రూపంలా ఠీవిగా ఉన్న 'కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథ్ గారిని దర్శించుకున్న క్షణాలు.. షుమారు 3600 క్షణాలు..ఊపిరి బిగబట్టి, జాలువారే అక్షర జలపాతం లోంచి పదమనే ముత్యాలను ఏరుకుంటూ.. అలా గడిపేశానంతే..! ఆ అదృష్టం.. నాకు కలగటం సుకృతమే కదూ..!

అమ్మహామహుని కలిసిన అద్భుతం ఎలా జరిగింది?  
------------------------------------------------

కళాతపస్వి ని కలుసుకోవాలన్న ఆలోచన వచ్చిన రోజు అనుకోకుండా ఒక ఘటన జరిగింది.. ప్రముఖ దూరదర్శన్ ప్రెజెంటర్ విజయదుర్గ గారి తో ఒక టెలిఫిల్మ్ విషయమై మాట్లాడుతూ.. విశ్వనాథ్ గారితో వారు చేసిన  ఇంటర్వూ.. "సంగీత, సాహిత్య సమలంకృతం .. విశ్వనాధ అంతరంగం" గురించి, ప్లేబ్యాక్ సింగర్ పార్ధసారధి గారు చేస్తున్న 'విశ్వనాధామృతం' లు డిస్కషన్ లోకి వచ్చాయి.. మాటలు సాగుతుండగా"విశ్వనాథ్ గారంటే అంతిష్టమా మీకు" అన్నారు విజయదుర్గ గారు...

కాదని అనగలరా ఎవరైనా..? "నేను త్రిమూర్తులను కలవాలని"ఉన్న నాకోరిక ను బయట పెట్టాను. అందులో ఒకరు కాశీ విశ్వేశ్వరుడు...! ఆ మాటలు జరిగినప్పుడు మేడం విజయదుర్గ గారు అమెరికాలో అనుకుంటా వున్నారు.


ఒక వైపు పెళ్ళి, మరో వైపు పిలుపు..     
-------------------------
మిత్రుడు ( Srikanth Kanam ) శ్రీకాంత్ , బ్రహ్మణిల వివాహము చూతుమురారండి.. అంటూ మన ముఖ పుస్తక మిత్రులైన వారంతా పిలిచేసరికి హైద్రాబాద్ వచ్చా..! హైద్రాబాద్ వచ్చినప్పుడు విజయదుర్గ గారికి ఫోన్ చేసి మాట్లాడా కర్టసీగా..! మధ్యాహ్నానికి అకస్మాత్తుగా విజయదుర్గ గారి నుంచి ఫోన్.. రేపు హైద్రాబాద్‌లోనే ఉండండి.. విశ్వనాథ్ గారి వద్దకు వెళ్తున్నాం. ఇదీ వారి ఫోన్ అందించిన సందేశం.. మూడు నాలుగు నెలల క్రితం విజయదుర్గ గారు అమెరికాలో ఉన్నప్పుడు మాట్లాడిన విషయాన్ని గుర్తుపెట్టుకుని, అకస్మాత్తుగా అవకాశం కల్పించడం 
గొప్పవిషయం కదా..వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాంజలి.

మరోవైపు ........
గోటేటన్న (Venkateswara Rao Goteti) వస్తారు రిసెప్షన్ కి రమ్మని శ్రీకాంత్.. మనోహర్ ( Manohar Borancha ) సారు..! ఏంచేయాలో, అర్ధం కాని పరిస్థితుల్లో గురువుగారు మనోహర్ గారు..విషయం తెలుసుకున్న వారై, "విశ్వనాథ్ గారి వద్దకే వద్దకే వెళ్లవోయ్..అలాంటి అదృష్టం మరోసారి రాదు "అన్నారు..   


ఇక తర్వాత రోజు హడావుడిగా మా తమ్ముడు వాళ్ళు నివాసం ఉండే నిజాంపేటలో బయలుదేరి.. బస్   

పట్టుకోవడానికి వెంటపడి కుక్కట్‌పల్లి దాటాక బస్ ఎక్కి... దిల్షుక్ నగర్ చేరి అక్కడ నుండి విజయదుర్గ గారింటికి వెళ్ళే సరికి అప్పటికే ఆలస్యమైందేమో ..రోడ్ పైనే నాకోసం కార్లో వెయిట్ చేస్తూ ఉన్నారు విజయదుర్గ గారు.. అప్పటికి ఎంతసేపటి నుంచి వేచి చూస్తున్నారో నాకైతే తెలీదు.. అడిగే ధైర్యమూ చేయలేదు..

వారి సీరియస్ ఫేస్ చూసి సారీ చెప్పా..!  అంతకు మినహా నేను ఏమీ చేయలేను.. అంతా హైద్రాద్  సిటీ బస్సు మహిమ..!  వారి కారు దూసుకుంటూ ట్రాఫిక్ బూజు దులుపుకుంటూ నేరుగా వెళ్ళి ఫిలిం నగర్ లోని ఒక ఇంటి ముందాగింది.. 


అక్కడ అడుగు పెట్టామో లేదో.. 'సిరివెన్నెల'  మురళి గానం మనసును లీలగా తాకింది..   
'స్వర్ణకమల'పు అందెల రవళి, నా హృదయం పై నృత్యం చేసింది..  సప్తస్వరాలు 'స్వాతి కిరణ' రేణువులై మేను తాకి పులకరింపజేశాయి.. ఎక్కడనుంచో.. 'సువ్వి సువ్వి' అని లీలగా వినపడుతున్న భావన..  ఏమీ అర్ధం కావటం లేదు.. ఇంటి ముందు "కాశీనాధునీస్" అన్న పేరు చదువుతూనే పరవశాన విజయదుర్గ గారిని అనుసరించా..! నా కాళ్ళు నా స్వాధీనం లో లేవు. ..."గాల్లో తేలిపోతున్నాయని వేరే చెప్పఖ్ఖర్లేదనుకుంటా".>!.😊
                                                                                      ..........(ఇంకా వుంది)

సినీదర్శక స్రష్ట విశ్వనాధ్ గారి తో చర్చా గోష్టి వివరాలు మరల అందిస్తాను.._                                                                                                                                                                                                                    _  మీ కరణం..

Friday, 5 February 2016

//ఎందరో మహానుభావులు అందరికీ వందనము...//

//ఎందరో మహానుభావులు అందరికీ వందనము...//
              నేను అందరినీ ఇంటర్వూ చేసే ఒక మీడియా ప్రతినిధిని, ప్రకాశం జిల్లా జెమిని న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న నన్ను, మాలిక పత్రిక ఎడిటర్లలో ఒకరైన డా. సత్య గౌతమి గారు ఇంటర్వూ చేశారు.
హహహ..!
కొత్తగా ఉంది కదూ.. అవునండీ నిజమే.. !

              ఇటీవల ప్రకాశం జిల్లాలో మేము తీసి, మా జెమినిన్యూస్ చానల్ యాజమాన్యం ప్రసారం చేసిన "అమ్మ..నాన్న దూరమైతే..!" కథనానికి యునిసెఫ్ అవార్డ్ వరించింది.. ఈ అవార్డ్ ను రిపోర్టర్ గా నేను నాతో పాటూ, మా జెమినిన్యూస్ సబ్ ఎడిటర్ బెహరానందిని గారు కలిసి 2015 డిసెంబర్ పదవతేదీ హైద్రాబాద్ తాజ్ లో అందుకున్నాం..

            అగమ్యగోచరంగా మారుతున్న చిన్నారుల జీవితాలపై నేను అందించిన "అమ్మ నాన్న దూరమైతే..!" కథనం, యునిసెఫ్ అవార్డ్ గెలుచుకున్న సందర్భంలో డా. సత్య గౌతమి (యు.ఎస్.ఎ) వారు అబినందించేందుకు, నన్ను సంప్రదించి అనేక విషయాలపై నాతో చర్చించారు. ఆ చర్చ ఈ నెల మాలిక పత్రికలో ప్రచురించారు..
మిత్రులారా..!
వీలు చూసుకుని ఒకసారి నా ఇంటర్వూని చదివి మీ అమూల్యమైన సందేశాన్ని అక్కడే ఉన్న కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.. ఇంటర్వూ కోసం ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయగలరు.
                                                                                 - మీ కరణం


లింక్ :

http://magazine.maalika.org/2016/02/04/%E0%B0%AF%E0%B1%82%E0%B0%A8%E0%B1%80%E0%B0%B8%E0%B1%86%E0%B0%AB%E0%B1%8D-%E0%B0%85%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B1%81-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%80%E0%B0%A4/