'విశ్వ'నాధ దర్శనం...1
_ కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్,03.03.2016
గంగా తరంగ రమణీయ జటా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం |
నారాయణ ప్రియం అనంగ మదాపహారం
వారాణసీపురపతిం భజ విశ్వనాథం ||
సర్వేశ్వరుని నేరుగా దర్శిస్తే ఎలా ఉంటుంది.. ఊహే పులకింత కలిగిస్తోంది కదూ.. నిజమే నేను సర్వేశ్వరుని కలిసే భాగ్యం ఈ లీపు సంవత్సరం అందించింది. నా కొద్దిపాటి పాఠవంతో.. వారి గురించి క్లుప్తంగా...!
కాశీనాధుని వారు..
కల్లాకపటం లేని వారు
కళలకు కాణాచి వీరు
కదిలే విద్వత్తుల మేరు
కాసేపు ముచ్చట చాలు..
అండ పిండబ్రహ్మాండంబుల
దర్శనమే ముంగిట వాలు.!
పలికే పలుకులు
'సాగర సంగమ' దృశ్యకావ్యాలు
ఆ ముసిముసి నగవులు
మెరిసేటి 'సిరివెన్నెల' జిలుగురేఖలు.
ఆ ప్రేమనిండిన మాటల్లోని
'శృతిలయలు'...
ఎదలోని భావతరంగాలను సవరించేటి
"సిరిసిరిమువ్వ"ల సవ్వడులు
'శంకారభరణ'మైన
ఆ నిలువెత్తు రూపం..
నటరాజు మ్రోల
'స్వర్ణకమలం'..
కదిలిస్తే కథల వరద..
కదిలించేటి మనుసులోతు పొర
కళ్ళల్లో తొంగిచూసేటి నిండైన'ఆత్మగౌరవం'
'సప్తపది' అడుగులు..
అమాయకత్వంతో ఇజాన్ని మార్చిన
'స్వాతిముత్యపు' చిందులుతో
మెరిపించి,మైమరపించిన ఠీవి..! కళాతపస్వి..!!
మనుషుల్లో మార్పుకోసం సినిమా వేదికగా
తపన పడీ, వెలిగిన 'స్వయంకృషీ'వలురు..
వారి 'శుభసంకల్పం'తో..
'ఆపద్భాందవుడు'లా,
సినీచరిత్ర గతి మార్చిన వైనం
ఎందరికో మార్గదర్శకం..
జాతీయ అవార్డుల 'శుభలేఖ'లు
తెలుగు సినిమా వాకిళ్ళకు
తోరణాలుగ జేసిన తేటతెలుగు 'స్వాతికిరణం'
వారే నా హృదయ పీఠాన కొలువైన రూపం.
వారే వారే 'కాశీనాధుని విశ్వనాథ్'ల వారనే బృహత్కావ్యం.
- కరణం 29.02.2016
సరే..! ఈ ఆనంద పరవశానికి కారణం.. ఫిబ్రవరి 29 మధ్యాహ్నం 12.30 సమయంలో నేను సాక్షాత్తూ కాశీ విశ్వేశ్వరుని రూపంలా ఠీవిగా ఉన్న 'కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథ్ గారిని దర్శించుకున్న క్షణాలు.. షుమారు 3600 క్షణాలు..ఊపిరి బిగబట్టి, జాలువారే అక్షర జలపాతం లోంచి పదమనే ముత్యాలను ఏరుకుంటూ.. అలా గడిపేశానంతే..! ఆ అదృష్టం.. నాకు కలగటం సుకృతమే కదూ..!
------------------------------------------------
కళాతపస్వి ని కలుసుకోవాలన్న ఆలోచన వచ్చిన రోజు అనుకోకుండా ఒక ఘటన జరిగింది.. ప్రముఖ దూరదర్శన్ ప్రెజెంటర్ విజయదుర్గ గారి తో ఒక టెలిఫిల్మ్ విషయమై మాట్లాడుతూ.. విశ్వనాథ్ గారితో వారు చేసిన ఇంటర్వూ.. "సంగీత, సాహిత్య సమలంకృతం .. విశ్వనాధ అంతరంగం" గురించి, ప్లేబ్యాక్ సింగర్ పార్ధసారధి గారు చేస్తున్న 'విశ్వనాధామృతం' లు డిస్కషన్ లోకి వచ్చాయి.. మాటలు సాగుతుండగా"విశ్వనాథ్ గారంటే అంతిష్టమా మీకు" అన్నారు విజయదుర్గ గారు...
కాదని అనగలరా ఎవరైనా..? "నేను త్రిమూర్తులను కలవాలని"ఉన్న నాకోరిక ను బయట పెట్టాను. అందులో ఒకరు కాశీ విశ్వేశ్వరుడు...! ఆ మాటలు జరిగినప్పుడు మేడం విజయదుర్గ గారు అమెరికాలో అనుకుంటా వున్నారు.
ఒక వైపు పెళ్ళి, మరో వైపు పిలుపు..
-------------------------
మిత్రుడు ( Srikanth Kanam ) శ్రీకాంత్ , బ్రహ్మణిల వివాహము చూతుమురారండి.. అంటూ మన ముఖ పుస్తక మిత్రులైన వారంతా పిలిచేసరికి హైద్రాబాద్ వచ్చా..! హైద్రాబాద్ వచ్చినప్పుడు విజయదుర్గ గారికి ఫోన్ చేసి మాట్లాడా కర్టసీగా..! మధ్యాహ్నానికి అకస్మాత్తుగా విజయదుర్గ గారి నుంచి ఫోన్.. రేపు హైద్రాబాద్‌లోనే ఉండండి.. విశ్వనాథ్ గారి వద్దకు వెళ్తున్నాం. ఇదీ వారి ఫోన్ అందించిన సందేశం.. మూడు నాలుగు నెలల క్రితం విజయదుర్గ గారు అమెరికాలో ఉన్నప్పుడు మాట్లాడిన విషయాన్ని గుర్తుపెట్టుకుని, అకస్మాత్తుగా అవకాశం కల్పించడం
గొప్పవిషయం కదా..వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాంజలి.
మరోవైపు ........
గోటేటన్న (Venkateswara Rao Goteti) వస్తారు రిసెప్షన్ కి రమ్మని శ్రీకాంత్.. మనోహర్ ( Manohar Borancha ) సారు..! ఏంచేయాలో, అర్ధం కాని పరిస్థితుల్లో గురువుగారు మనోహర్ గారు..విషయం తెలుసుకున్న వారై, "విశ్వనాథ్ గారి వద్దకే వద్దకే వెళ్లవోయ్..అలాంటి అదృష్టం మరోసారి రాదు "అన్నారు..
పట్టుకోవడానికి వెంటపడి కుక్కట్‌పల్లి దాటాక బస్ ఎక్కి... దిల్షుక్ నగర్ చేరి అక్కడ నుండి విజయదుర్గ గారింటికి వెళ్ళే సరికి అప్పటికే ఆలస్యమైందేమో ..రోడ్ పైనే నాకోసం కార్లో వెయిట్ చేస్తూ ఉన్నారు విజయదుర్గ గారు.. అప్పటికి ఎంతసేపటి నుంచి వేచి చూస్తున్నారో నాకైతే తెలీదు.. అడిగే ధైర్యమూ చేయలేదు..
వారి సీరియస్ ఫేస్ చూసి సారీ చెప్పా..! అంతకు మినహా నేను ఏమీ చేయలేను.. అంతా హైద్రాద్ సిటీ బస్సు మహిమ..! వారి కారు దూసుకుంటూ ట్రాఫిక్ బూజు దులుపుకుంటూ నేరుగా వెళ్ళి ఫిలిం నగర్ లోని ఒక ఇంటి ముందాగింది..
'స్వర్ణకమల'పు అందెల రవళి, నా హృదయం పై నృత్యం చేసింది.. సప్తస్వరాలు 'స్వాతి కిరణ' రేణువులై మేను తాకి పులకరింపజేశాయి.. ఎక్కడనుంచో.. 'సువ్వి సువ్వి' అని లీలగా వినపడుతున్న భావన.. ఏమీ అర్ధం కావటం లేదు.. ఇంటి ముందు "కాశీనాధునీస్" అన్న పేరు చదువుతూనే పరవశాన విజయదుర్గ గారిని అనుసరించా..! నా కాళ్ళు నా స్వాధీనం లో లేవు. ..."గాల్లో తేలిపోతున్నాయని వేరే చెప్పఖ్ఖర్లేదనుకుంటా".>!.😊
..........(ఇంకా వుంది)
No comments:
Post a Comment