Wednesday, 9 March 2016

'విశ్వ'నాథ దర్శనం -2


'విశ్వ'నాథ దర్శనం -2 - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ 04.03.2016

గురు బ్రహ్మ..గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహ ఓం నమో నమో నమశివాయ మంగళ ప్రదాయ గోపురంగతె నమశివాయ గంగయా తరంగి తోటమాంగినే నమశివాయ ఓం నమో నమో నమశివాయ శూలినే నమో నమహ్ కపాలినే నమశివాయ పాలినే విరంచితుండ మాలినే నమశివాయ..!!

విశ్వనాథ్ గారి ఇంటి ఆవరణలోకి ప్రవేశించి, అక్కడే ఉన్న లిఫ్ట్‌లో పై ఫ్లోర్ కి వెళ్లాము.. ఒక వ్యక్తి వచ్చి తలుపు తీశారు. పెద్ద హాల్ లో నాలుగు దిక్కులలో సోఫాలు.... సోఫాలో విశ్వనాథ్ గారున్నట్లున్నారు.. విజయదుర్గ గారి వెనుకే నేను ఉండటంతో నాకు వారు కనబడలేదు.. "అయ్యో..అయ్యో.. ఇంకెంతసేపూ.. దగ్గర నుంచి చూసే భాగ్యం" అంటున్న నా అంతరంగం ప్రశ్నలకు 'షటప్' అని సమాధానపరచుకున్నా..! అసలే నేను టెన్షన్ తో కొట్టుమిట్టడుతుంటే.. ఈ అంతరంగం ఒకటి.. బాబోయ్ ఎంత ఇబ్బంది పెట్టిందో చెప్పలేనండీ.! హాల్లో అడుగుపెట్టిన వెంటనే విజయదుర్గ గారు వారికి "నమస్కారం" చెప్పారు.. "నమస్కారం.." ప్రతి నమస్కారపు గంభీర స్వరం ధ్వనించింది. ఆమె వెనుకే నేను... గుండె ఘోష నాకు తెలుస్తూనే ఉంది.. అడుగులో అడుగేసుకుంటూ మరో రెండడుగులు వారిని చూసేందుకు ముందుకు వేశా..! నన్ను పరిచయం చేశారు విజయదుర్గ గారు.. తూర్పు వైపుకు కూర్చుని ఉన్న వారు....ఎలా ఉన్నారంటే..! "కొలువై ఉన్నాడే.. దేవదేవుడు.. కొలువై ఉన్నాడే... కొలువై ఉన్నాడే.. దేవదేవుడు.. కొలువై ఉన్నాడే... కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే..! కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే..!"  

ఎదురుగా.. దేవ దేవుడు.. మహాదేవుడైన విశ్వనాధుడే కోటి సూర్యుల తేజస్సుకు సమానముగా ప్రకాశిస్తూ కొలువై వున్నాడా అనిపించేంత ..ఠీవిగా కుర్చీలో.. ఆశీనుడై ఉన్నారు.. వారిని ఒకసారి ఆరాధనాపూర్వకంగా చూసా..! నెరిసిన పెద్దగడ్డం.. మెలి తిరిగిన మీసాలు.. కళ్లల్లో తేజస్సు.. ధవళ వర్ణ శోభతో .. మెరిస్తున్న దుస్తులు ధరించి.. సాక్షాత్తూ యోగ రూపుడైన కాశీ విశ్వేశ్వరుడే కొలువై ఉన్నట్లు కూర్చొని ఉన్నారు. పెద్దలను కలిసేటప్పుడు పుష్పం, ఫలం, తోయం మూడూ.. లేదా కనీసం వీటిలో ఒకటైనా..తీసుకెళ్లాలని చిన్నప్పుడెప్పుడో స్కూల్ మాస్టర్లు చెప్పిన విషయం జ్ఞాపకముంచుకుని, నేను తీసుకెళ్ళిన ద్రాక్ష వారి చేతికందించి.. నేరుగా వారి పాదాల పై పడిపోయాను... పైకి చెప్పని నేను లోలోన ప్రవర వినిపించాను... అంతసేపూ వారి పాదాల పైనే ఉన్నా..! అప్పుడు నా పరిస్థితి... "అందెల రవమిది పదములదా..!! అంబరమంటిన హృదయముదా..!" అని నా హృది ఎగిరి ఆకాశం ఎత్తున గంతులేసింది.. లేగదూడ ఆనందం లోలోన విరిసింది.. "కూర్చోండి" అని వారెదురుగా ఉన్న సోఫా చూపించారు.. వెంటనే.. విజయదుర్గ గారిని "ఎలా ఉన్నారూ ?"అని అడిగారు.. వారు బాగున్నాను సర్.. మీరెలా ఉన్నారు..? అని అడిగారు నేను మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్.. వాస్తవానికి నాకు విరుద్దంగా..! ఏం మాట్లాడాలో, ఏమీ ఆలోచనలో లేదు..చూడటం మాత్రమే నా కోరిక.. ఎదురుగా నే ఉన్న ఆ నిలువెత్తు రూపాన్ని రెప్పవాల్చకూండా చూస్తూ ఉన్నా..! 


వెంటనే నా వైపు తిరిగి "మీరేం చేస్తారు" అన్నారు.. 
"జెమిని న్యూస్ లో రిపోర్టర్" అని చెప్పారు విజయదుర్గ గారు... నాకు వారికి మధ్య సంభాషణ మొదలైంది..

"జెమిని న్యూస్ అంటే.. తమిళనాడు వాళ్ళదే కదూ..!" అవునండీ..! "ఇక్కడ ఎవరు చూస్తారు.." "ఎండి గారు కిరణ్ గారండీ.." "ఓ కిరణ్ గారా.. ఆ నాకు తెలుసులే.. ! నేనును మాట్లాడతాను లే..!... "జెమినిలో నేను చేసిన సీరియల్ కంటెంట్ నా లైబ్రరీలో పోయింది.. అది వారి వద్ద ఉంటే అడిగి తీసుకుందామని" అన్నారు విశ్వనాథ్ గారు.. "మీరెక్కడ ఉంటారు" నాతో.. మాటలు పొడిగించారాయన. (హైద్రాబాద్ లో ఎక్కడ వుంటారు? ) !" "ఇక్కడ కాదండీ.. నేను ఉండేది చీరాల, పనిచేసేది ప్రకాశం జిల్లా రిపోర్టర్ గా, ఒంగోలు బేస్డ్ "  


ఇక ఒంగోలు కబుర్లు షురూ..!

------------------------ "మా హరనాధరావు ఎలా ఉన్నాడు( Mvsharanatha Rao gaaru ) " మాటల పూదోట ఒంగోలు వాసి అయిన ఎం.వి.ఎస్. హరనాధరావుగారి గురించి ఆరా తీశారు. చాలా బావున్నారండీ.. ! మా ఆఫీస్ కి దగ్గరే హరనాధరావుగారిల్లు.. "ధారా రామనాధ శాస్త్రి గారెలా ఉన్నారూ".. అని అడిగారు. "చాలా బావున్నారండీ.. ! ఇటీవలే వారి నాట్యావధానం షష్ట్యబ్ధి ఉత్సవాలు జరిగాయ్.." అన్నాను.. "అవునా ఒంగోలు వెళ్ళినప్పుడు వారింటికి వెళ్ళి కలిసొచ్చా.!" అన్నారు విశ్వనాథ్ గారు.. "ఒంగోలులో హోటల్స్ బావుండవనుకున్నా.. ! ఫర్వాలేదు బాగున్నాయ్.. ఈ మధ్య నాట్య పాఠశాల వార్షికోత్సవానికి వచ్చాను.. ! వారు ఒంగోలు పిలవగానే భయపడ్డాను..హోటల్స్ ఎలా ఉంటాయోనని.. ఆ డాన్స్ టిచర్ వాళ్ల బాబాయ్ తిరుపతిలో ఉంటారు.. ఆయన పిలిచారు.. తప్పలేదు.. కానీ బాగానే ఉన్నాయ్.. అంటూ ఒంగోల్ హోటళ్ళను మెచ్చుకున్నారు గురువుగారు.. "అప్పుడు విజయవాడ వరకు ఫ్లైట్ లో వచ్చి అక్కడ నుండి ఒంగోలుకు కార్ లో వచ్చా..!" అని ఒంగోలుకు వచ్చిన రోజును వారు గుర్తుచేసుకున్నారు. అంతలో విజయ దుర్గ గారు.. "భోజనం కూడా ఒంగోల్ లో బావుంటుందండీ.." అన్నారు.. "నేను ఎక్కడికి వెళ్ళినా బయట తినే ఛాన్స్ ఉండదమ్మా..! ఎవరో ఒకరు వారింటికి తీసుకెళ్తుంటారు.." అంటూ ఓ నవ్వు నవ్వారు..! విశ్వనాథ్ గారు. కొద్దిసేపు నవ్వులు విరిశాయ్.. "మరి చీరాల... ?" అక్కడ ఎందుకున్నారు అన్నట్లు అడిగారు.. మా నాన్న గారు రిటైర్ అయ్యి అక్కడే ఇల్లు కట్టుకున్నారండి ! అందుకే అక్కడే వారితోనే వున్నాం.. ఇక్కడ మా తమ్ముడు (చైతన్య), విజయవాడలో మరో తమ్ముడు (నారాయణ) ఉంటారండి. నేను నాన్న గారి వద్దే ఉంటా..! " అవును పెద్ద వాళ్ళు ,. వారి సొంత ఇల్లు దాటి రావడానికి అస్సలు ఇష్టపడరు.." అన్నారు.. వారామాటనగానే నాకు నేను వ్రాసిన " ఎత్తరుగుల ఇల్లు" కథ గుర్తొచ్చింది.. "మీనాన్న గారు లెక్చరర్ కదా..! ఏ లెక్చరర్ రో చెప్పు" అన్నారు విజయదుర్గ గారు
"జువాలజీ అండి.. డిగ్రి కాలేజ్ ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అయ్యార"న్నా!..అంతలో జెమిని హైద్రాబాద్ చూసేది కిరణ్ గారేకదా.. అన్నారు.. అవును సర్.. కిరణ్ గారే.. ! అన్నాన్నేను" "నేను ఫోన్ చేసి మాట్లాడతా..లే..! నా కథను ఒక తమిళ్ నిర్మాత వచ్చి సీరియల్ కి అడిగారు.. అప్పటికే నేను తయారు చేసుకున్న చాలా మంచి కథ ఉంది... అది చెప్పా! మనం సినిమాకి సంబంధించి కథలు చేసుకుంటాం కానీ, సీరియల్స్ గురించి ఆలోచించం కదా.! మేం తయారు చేసుకునే కథ రెండున్నర గంటలకు సరిపడా ఉంటుంది.. సీరియల్ కూడా బాగానే మొదలైంది.. "సర్వమంగళ" అని. జెమినిలో టెలికాస్ట్ అయ్యిందిలే..! అని.సీరియల్ గురించి చెప్పారు విశ్వనాథ్ గారు.. "అవునండీ నేను చూశా ఆ సీరియల్ భానుప్రియ గారు కదా.! కీ రోల్ .. సీరియల్ థీం చాలా బావుంది.." అన్నారు విజయదుర్గ గారు. ఎప్పుడైతే విజయదుర్గ గారు ఆ మాటన్నారో..! ఆయన కళ్లల్లో ఆనందంతో పాటు ఒకింత గర్వం తొణికిసలాడింది.. నేను చూస్తూనే ఉన్నా.! నన్ను చూస్తూనే మాట్లాడుతున్నారాయన.!.. "ఆ ప్రాజెక్ట్ చెయ్యాలనుంది.. సీరియల్ కన్నా సినిమా బాగా వస్తుంది.. ఆ నిర్మాతకూడా నాకు పేమెంట్ ఇవ్వలేదు..ఆర్టిస్ట్ లకు కూడా ఇవ్వలేదనుకుంటా..!నన్ను చేయమన్నారు.. కానీ నేను వేషం వెయ్యను అన్నాను.. శరత్ బాబు బాగుంటారూ అందుకని ఆయన్ని రికమెండ్ చేశా..! అరవై ఏళ్ల మహా పండితుడైన బ్రహ్మచారి కథ.. వేరొకడి చేతిలో మోసపోయి గర్భవతి అయిన 25 ఏళ్ళ అమ్మాయి ..అనుకోకుండా ఆ బ్రహ్మచారి వృద్ధుడితో కలిసి నడవాల్సొచ్చినప్పుడు.. నా బిడ్డకు మీ ఇంటి పేరు ఇస్తారా..? అని ఆమె అడగటం" అనే సినిమా కథలోని ముఖ్య ఘట్టం , ( కాశీ క్షేత్రం బ్యాగ్ డ్రాప్ లో జరుగుతుంది.) ప్రస్తావించినప్పుడు వింటున్న మాకు ఒక్కసారిగా కన్నీటి పొర తడిసిపోయింది.. ఇక ఆయన చిత్రిస్తే..! ఎంత అందంగా రూపుదిద్దుకుంటుందో అనిపించింది నాకు..!  
సముద్ర తీరాల గురించి కాసేపు సాగిన ముచ్చట.! ------------------------------------------ "బాపట్ల దగ్గర ఏవో రిసార్ట్స్ ఉండాలి..అదే ఊరు..!" ప్రశ్నించారాయన. షడన్ గా నాకు గుర్తురాలేదు... సూర్యలంక బీచ్ గురించి అడిగారు.. "అదేమి అంత బాలేదు.." మా ఫ్రెండ్ ఎవరో చెబితే బాపట్లలో కోనా ప్రభాకర్ రావు గారింట్లో ఒక ఫంక్షన్ కి వచ్చినప్పుడు వెళ్ళా..! "కోస్తాలో చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గరి హార్స్లీ హిల్స్ తప్ప ...ఏవి సమ్మర్ స్పాట్స్ లేవనుకుంటా..! హార్స్లీ హిల్స్ బావుంటుంది.. " అన్నారాయన.. ఇప్పుడు చీరాలలో మంచి రిసార్ట్స్ వచ్చాయండి..! చాలా మంచి పేరొచ్చింది.. సీ బ్రీజ్ రిసార్ట్స్ అని పెట్టారు..సీ బ్రీజ్ రిసార్ట్స్ కి మంచి పేరొచ్చింది.. ఇప్పుడు పైవ్ స్టార్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు..కుడా.. ! పాంకోస్ట్ అని.. ఇంకా కొన్ని రిసార్ట్స్ కుడా వచ్చాయండి.. " అన్నాన్నేను.. మా చీరాల దేనికి తీసిపోదన్నట్లు.. "ఏమో ఆ బాపట్ల బీచ్ అస్సలు మెయింటనేన్స్ లేనే లేదు.. " అన్నారాయన. "సూర్యలంక బీచ్ రిసార్ట్స్ ప్రభుత్వంది కదా.! సర్ అలాగే ఉంటాయ్.. గతంలో చాలా బాగా ఉండేది.. ఫేమస్ కుడా..! అన్నాన్నేను బాపట్ల సూర్యలంక బీచ్ మదిలో మెదులుతుండగా! అంతలో ఇంట్లోకి వచ్చిన విశ్వనాథ్ గారి పెద్దబ్బాయ్ మమ్మల్ని పలకరించి.. నేరుగా లోపలి వెళ్ళి మూడు బిస్కట్లు తెచ్చి మా ముందుంచారు.. "తీసుకోండి" అన్నారు పెద్దాయన.!.. నేను దుర్గ గారు చెరొకటి తీసుకున్నాం.. అత్యద్భుతంగా ఉన్న ఆ బిస్కట్ గురించి ఆయన చెబుతూ.. అవి మన పల్లి పట్టీ లాంటివి అన్నారు.. ఇక్కడే బేకరీ ఉందమ్మా!.. స్విస్ కాజల్స్ అని చాలా బావుంటాయ్.. విజయదుర్గ గారికి ఆ బేకరీ అడ్రస్ చెప్పారు.. " నన్ను పట్టించుకోరేంటి అని పాపం ఎదురుచూస్తోంది.." అన్నారు విశ్వనాథ్ గారు అకస్మాత్తుగా.!. దేని గురించో నాకు అర్ధం కాలేదు.. ఒక్కక్షణం.! తెలిసిన తర్వాత నవ్వాగలేదు.. ఎదురుగా టేబుల్ పై సాసర్ లో ఉన్న మూడో బిస్కట్ గురించి..! వారు చెణుకు విసిరారు. "చెరి సగం తినండి.. పాపం లేకుంటే అది బాధపడుతుంది" అని మూడవ బిస్కట్ నుద్దేశించి హాస్యమాడారు.. కాసేపు మరలా నవ్వులు మెరిశాయ్..!!

అంతలో మా ముచ్చట సినిమాల మీదకి మళ్ళింది.. _________________________________ 'అమ్మమనసు సినిమా..!'గురించి ప్రస్తావనొచ్చింది.... ఈ సినిమా పేరు నేనైతే వినలేదు.. పుట్టానో లేదో గుగూలమ్మని అడిగి తెలుసుకోవాలి.. 'నేరము శిక్ష' సినిమాలో కృష్ణ గారి ప్రక్కన రోల్ వేసిన భారతి గారిని .. 'అమ్మమనసు'లో చలం గారి ప్రక్కన తీసుకున్నారు.. ఎందుకు సార్..! ? అని అడిగారు విజయదుర్గ గారు.. ఏదో అలాజరిగిపోయింది...అదో మంచి సినిమా..! "సత్యనారాయణ. జయంతి మెయిన్ క్యారెక్టర్స్... జయంతి సత్యన్నారాయణ చేతిలో మోసపోయి గర్భవతై కూడా... ప్రియుడిని. పెంచిన మేనమామ కూతురిని వివాహం చేసుకోవటమే సరియైనదని.. ఆ మామ గారి కూతుర్నే పెళ్ళి చేసుకోమనే కథ .. చాలా బాగొచ్చింది.." అని ఆ సినిమాని గుర్తు చేసుకున్నారాయన.! "అవునండి చాలా మంచి సినిమా.. మూగ కొడుకుని కని, ఆ పిల్లాడిని కూడా తాను నడుపుతున్న అనాధాశ్రమంలో అనాధలాగే పెంచుతారు జయంతి... అమ్మ అని పిలిపించుకోవాలన్న ఆశతో ఉన్న జయంతి చనిపోయేంత వరకు అమ్మ అని పిలవలేడు.." అంటూ ఆ కథ లోని సెకండ్ పార్ట్ ని మేడం విజయదుర్గ గారు వినిపించారు.. పోన్లే విశ్వనాథ్ గారి ఈ చిత్రం మనం చూడలేదు అన్న బాధ తప్పింది.. వారి నోటితోనే సినిమా విన్నాం కదా..! అంతకంటే ఏం కావాలి చెప్పండి..! అన్నట్లు 'అమ్మ మనసు' డిస్కషన్ జరుగుతున్నప్పుడు కూడా ఆయన నావైపే చూస్తూ మాట్లాడుతున్నారు.. నా మనసు ఉప్పొంగి పోతొంది..నేను ఎలా కూర్చున్నానో అని ఒక్కసారి పరిశీలనగా చూసుకున్నాను.. స్ట్రైట్ గా చేతులు కట్టుకుని. . సోపాలో ముందుకి నిటారుగా కూర్చొని ఉన్నా..! బాగ పరిశీలిస్తే..! గాల్లో ఉన్నానండీ.. బాబూ..!


అంతలో వారింట్లో భోజన సన్నాహాలు చేస్తున్నట్లు చిన్నపాటి శబ్దాలు వినిపించినయ్..! గాంధీ గారు ఆనంద పరవశుడై ఎవరితోనైనా కబుర్లలో ఉంటే ఏంచేయాలో అర్ధం కాని ఆయన శిష్యురాలు అలారం తెచ్చి ఎదురుగా పెట్టి వెళ్ళేవారుట..అలా లోపలి శబ్ధం విని పెద్దాయన మాతో కబుర్లలో పడి సమయం మరచిపోయినట్లున్నారని, మా వల్ల వారికి ఇబ్బంది కలగ కూడదని నేను ఉత్తిష్ట అనదాం అనుకునే లోపే, నాకన్నా షార్ప్ గా విజయదుర్గ గారు లేచి బయలుదేరదాం అన్నారు.. అప్పుడు చూశాను వారి చిత్రం దూరంగా వీణ తో ఉన్న విశ్వనాథ్ గారి ఫొటో..అద్భుతంగా ఉంది.. ఇంకా చిన్నచిన్న వన్నీనూ..! అంటే అప్పటి దాకా వారిని తప్ప పరిసరాలు ఏవి చూడలేదండి బాబూ..!


అప్పుడే మేమొచ్చి గంట అయిపోయింది...
ఫొటోలు దిగాం.. నేనూ మేడం ఉన్న ఫొటోని స్వయంగా విశ్వనాథ్ గారి అబ్బాయే తీశారు.. థాంక్స్ టూ హిం.. వెళ్ళొస్తామని చెప్పి విశ్వనాథ్ గారి కాళ్ళకు మరొక్కసారి నమస్కరించుకుని లేచాను.. ఆయన చేతులు ఆశీర్వదిస్తున్నట్లు.. పెకిలేచాయి.. ఆ తన్మయత్వంలో బయటకు ఎటువెళ్లాలో కూడా అర్ధం కాలేదు నాకు.. "వెళ్లి పోదాం అన్నందుకు ఏమి అనుకోకు..కృష్ణ వారికి భోజన వేళ అయినట్లుందని వెళ్దాం అన్నాను.."అని విజయదుర్గ గారు నాతో అన్నారు... నేను చిరునవ్వు నవ్వా..! అర్ధమైఁదన్నట్లు..! "కాశీనాధుని విశ్వనాథ్ గారిని కాదు కాశీ విశ్వనాధుడినే చూసినట్లుంది వారిని చూస్తుంటే" అని అన్నాన్నేను.విజయదుర్గ గారికి థాంక్స్ చెబుతూ ..!

నాకు తెలిసి ఇంతవరకూ అంతసేపు విశ్వనాథ్ గారు ఎవరితోనూ మాట్లాడిన దాఖలాలు లేవు కృష్ణా అని విజయదుర్గ గారన్నారు. ఆ నిముషం నాకు 'సాగరసంగమం' చిత్రం లో పచ్చగడ్డిలో కూర్చొని... మాధవి (జయప్రద) అందించిన '25 వ ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టవల్స్ ఇన్విటేషన్' చూస్తూ అందులో..'క్లాసికల్ డాన్స్ రిసైటల్ బై శ్రీబాలకృష్ణ' అన్న అక్షరాలు చూశాక, తనను తాను నమ్మని స్థితిలో ఉక్కిరిబిక్కిరైన బాలుడిలా మారిన బాలు పరిస్థితే నాది.. ! కనుదోయి నుంచి ఆనందభాష్పాల వృష్ణి.. ఏదైనా రాసుండాలండీ...!

మొన్న చీరాలలో మానాన్న గారికి విశ్వనాథ్ గారితో నాఫొటోలు ... చూపిస్తే ఏమానందించారో..! చెప్పలేను.. "నాన్నా ఈ ఫోటోలో ఎవరో గుర్తుపట్టారా..! విశ్వనాథ్ గారు..వారి ప్రక్కన నేను" అనగానే ఆయన మోము విరిసింది.. "గడ్డం పెంచారు..! అని ముసి ముసి గా నవ్వి.. నాకన్నా పెద్దవారు" అన్నారు. స్వస్తి.. (మిత్రులారా..! ఫిబ్రవరి 29న అనుకోకుండా కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథ్ గారిని కలిసి ముచ్చటించే భాగ్యం కలిగింది.. ఆరోజు మధుర క్షణాలను మీ అందరితో పంచుకోవాలనే ఆశతో అందిస్తున్నాను.. ఇది రెండవభాగం..)







No comments:

Post a Comment