Friday, 5 June 2015

" పిచ్చోడు గింజలు విసిరెన్.." (ఓ యదార్ధ గాధకు కథారూపం.)

//" పిచ్చోడు గింజలు విసిరెన్.." (ఓ యదార్ధ గాధకు  కథారూపం.)//

                                                - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్, 28.05.2015

             విజయవాడ వంటి ఒకానొక నగరంలో ఇది జరిగినట్లు.. చిన్నప్పుడు వినట్లు గుర్తు.. అయినా గుర్తున్న విషయాన్ని నా పద్ధతిలో  మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను.. అది వాస్తవమైతే ఆయనకి పాదాభివందనం తెలుపుకుంటూ .. అసలు విషయానికొస్తున్నా..!

 ఓ నగరానికి మేయర్ ఎన్నికలు.. పార్టీలు పోటాపోటీగా సిద్ధమౌతున్నాయ్.. ఓ పెద్దపార్టీ తర్జనభర్జనలు పడి...లెక్కలు బొక్కలు వేసి, తీసివేతలు కూడికలు అనంతరం ఓ అనామకుడిని, రైతు కూలిని తెచ్చి మేయర్ పదవికి నిలబెట్టారు. అనూహ్యంగా అతడు గెలిచాడు.. " ఆ వేలుముద్రేగా మనదే రాజ్యం అని నాయకులు సంబరపడ్డారు..

  మేయర్ హోదాలో కార్పొరేషన్ మెట్లెక్కిన ఆయన అధికార్ల సమావేశం ఏర్పాటు చేశాడు. అతనికి కేటాయించిన అంబాసిడర్ బుగ్గ కారులో ఊరంతా కలియతిరిగాడు.. తర్వాత మరలా అధికారులతో సమావేశమై  అందరినీ పేరుపేరున కుశల ప్రశ్నలేశారు.. అనంతరం తనకి ఒక హెలికాఫ్టర్ కావాలి నగరం చూడాలి.. మనరాజ్యం ఎంతవరకూ విస్తరించి ఉందో తెలుసుకోవాలంటూ ఆదేశించాడు.. ఇదెక్కడి ఖర్మ రెండు లక్షలు ఖర్చుచేసి హెలికాఫ్టర్ అద్దెకు తెప్పించాలా అనుకుంటూ చెవులు కొరుక్కునారు అధికారులు..

ఉదయాన్నే మున్సిపల్ గౌండ్స్ కి హెలికాఫ్టర్ వచ్చి ఆగింది.. జనాలతో పాటూ అధికారులు, ప్రతిపక్ష, విపక్షాలూ గౌండ్ కి చేరాయి.. అక్కడికి చేరుకుని కారుదిగిన మేయర్ భుజాన పెద్ద మూట ఒకటి పెట్టుకుని నేరుగా హెలీప్యాడ్ వద్దకు వచ్చి హెలికాఫ్టర్ ఎక్కి పోనీ అన్నాడు.. ఆ మూట ఏవిటో, ఏం చెయ్యబోతున్నాడో అక్కడున్న ఎవ్వరికీ అంతుపట్టలేదు.. మనదేంపోయే జనాల సొమ్మేకదా అనుకున్నారు అధికారులు, మనకి కౌన్సిల్ లో గొడవ చేయడానికి మంచి సబ్జెక్ట్ దొరికిందని సంబరపడ్డారు ప్రతిపక్షాలు.. ఏదేమైనా ఆమేయర్ తీసుకెళ్ళిన మూట ఏంటో అక్కడెవ్వరికీ అంతుపట్టలేదు.. కొద్దిగా ఎగరగానే మూట విప్పిన మేయయ్.. మూటలోని గింజలను నేలపై విసురుతూ అదే చల్లుతుండటం చూసి బిత్తరపోయాడు పైలెట్.. నగరం నలుమూలలూ తిరిగి మూటలోని గింజలన్నీ చల్లి నాక తృప్తిగా క్రిందకు దిగాడు మేయర్..

 పైలెట్ ద్వారా మేయర్ ఏమిచేశాడో తెలుసుకున్న మీడియా, ప్రతిపక్షాలు.. విపక్షాలతో సహా రెండు లక్షలు నేలపాలు అని ఒహటే గొడవ.. ప్రతిపక్షనాయకుడు ఒక అడుగు ముందుకేసి పిచ్చోడు గింజలు విసిరెన్ అని పూరణ ఇచ్చాడు.. అదే నగరామంతా ప్రాకిపోయింది.. "ఏ నోట విన్నా పిచ్చోడు గింజలు విసిరెన్" అని ఒక సామెతలాగా ప్రాకిపోయింది..

 ఎవ్వరు ఎంత గోల చేస్తున్నా.. మేయర్ మాత్రం తొణకలేదు.. తాను చాలా గొప్పపని.. గతంలో ఎవ్వరూ చేయని పని చేశానని తృప్తితో గర్వంగా ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు.. ఇక అతనితో వాదన అనవసరం అని ఊరుకున్నారు...
**************************************      *****************************                        

20 ఏళ్ల అనంతరం..

ఆనగరం ఆకాశానికి పచ్చదనపు సోయగాలు చూపింది..
వర్షపాతంలో రికార్డు నమోదు చేసింది.
ఆరోగ్యంలో ఆసియాలో ఫస్ట్ నిలిచింది..
చల్లని గాలితో ప్రజలను అక్కున చేర్చుకుంది.


ఒక చిన్న పిల్లాడు..  తన తాతతో చెట్ల నీడన నడుస్తూ.. తాతా మనూర్లో ఇన్ని చెట్లు  ఎవరు నాటించారు.. అశోకుడా.. అ..? " అని అడిగాడు..

"పిచ్చోడు గింజలు విసిరెన్.." అనబోయిన అప్పటి ప్రతిపక్షనాయకుడైన తాత నాలిక కరచుకుని.. తడబడ్డాడు.. అప్పటి తప్పు మరలా చేయదలచుకోలేదాయన్.. అప్పటి మేయర్ ను పిచ్చోడు గింజలు విసిరెన్ అని అన్న వ్యక్తి అతనే..


అసలా రోజేం జరిగిందని గుర్తుతెచ్చుకున్నాడు అప్పటి ప్రతిపక్షనాయకుడైన తాత.

  మేయర్ ప్రమాణం తర్వాత మంచి వర్షాలు పడ్డాయి.. మధ్యలో హెలికాఫ్టర్ లో ఆకాశమార్గాన తిరిగిన మేయర్ ఊరంతా గింజలు చల్లాడు.
     .. కొండలు గుట్టలు.. ఎక్కడా ఖాళీ ప్రదేశాలూ వదిలి పెట్టకుండా గింజలు చల్లాడు.. ఆ తర్వాత వర్షాలు జోరుగాపడ్డాయి.. దీంతో గింజలన్నీ మొలకెత్తాయ్.. అత్యధికంగా మొక్కలన్నీ బ్రతికాయ్..

      దీంతో నగరం అంతా పచ్చదనం పరచినట్లైంది.. కేవలం రెండు లక్షలతో అడవినే పండించాడు మేయర్ అని తోచిందిప్పుడా నాయకుడికి.. వేలుముద్ర మేయర్ ముందు చూపుకి.. మనసులోనే హేట్సాఫ్ చెప్పుకున్నాడు..  మేయర్ ని అవహేళన చేసినందుకు చిన్నబుచ్చుకుని చుట్టూ పరచిన పచ్చసోయగాలను చూస్తూ.. "చదువుకున్న నాకంటే చదురాని మేయర్ ఎంతాబాగా భవిస్యత్తుని ఊహించాడు" అనుకుంటూ  నడినెత్తిన సూరీడు పెళపెళలాడే సమయంలో మనుమడితో కలిసి చెట్టు నీడలో  ముందుకు నడిచాడు అప్పటి ప్రతిపక్షనాయకుడు..

      "పిచ్చోడు గింజలు విసిరెన్" అని మేయర్ ని తననోటితో తొలిగా అన్నందుకు మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నాడు., ఎందుకంటే ఆ మేయర్ చనిపోయి అప్పటికి చాలాకలం అయ్యింది నేరుగా వెళ్ళి చెప్పాలన్నా కుదర్దు...గనుక.

****************************************************

అదన్నమాట ఫ్రెండ్స్.. ఎక్కడికో వెళ్ళారు కదా.. వచ్చేయండి... అవును.. మరి ...

అందుకే మొక్కలు నాటండి.. మీ పిల్లల భవిష్యత్తుని కాపాడండి..
అన్నట్లు మిత్రులు మీరందరు ఎదో ఒక్కటి.... కొటేషన్ లేదా. కవిత.. లేదా. ప్రభుత్వానికి ఓ సలహానో, పద్యాలో ... ఇలా ఎదో ఒకటి కామెంట్ చెయ్యండి.. అవి పదిమందికి  ఇన్స్పిరేషన్ ఇచ్చేలా ఉండాలి..అవన్నీ ప్రభుత్వానికి నివేదించే  ప్రయత్నం చేద్దాం

.  "రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటుదాం.. భవిష్యత్తుకు  పచ్చని సిరులు అందిద్దాం.."
                                                                                                                       -  మీ కరణం

ఫొటో గూగుల్ సౌజన్యం..

(ఇది కథారూపం మాత్రమే.. ఎవరినీ ఉద్దేసించినది ఏ మాత్రం కాదని మనవి చేసుకుంటున్నాను.. కాగా విజయవాడనగరంలో జంధ్యాల శంకర్ గారు చైర్మన్ గా ఉన్నప్పుడు అజిత్ సింగ్ గారు కమీషనర్ గా పనిచేసినప్పుడు విజయవాడలో గ్రీనరీ పెరిగేందుకు ఎంతో కష్టపడ్డారని, అందుకే అజిత్ సింగ్ గారి పేరిట విజయవాడ నగరంలో ఓ పేటకు నామకరణం చేశారని ఫేస్ బుక్ మిత్రుల్లో పెద్దలు తమ తమ కామెంట్ ద్వారా తెలిపారు.. కాబట్టి ఈ సందర్భంలో వారిని స్మరించుకోవడం స్ఫూర్తిదాయకమని నా భావన. నమోస్తు.)

Saturday, 30 May 2015

//మౌనముని//


//మౌనముని//

     - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్, 29.05.2015

తనకు తాను భారమైనా
తాను ఏడ్వలేకున్నా..
తన స్తనాలెండి* పోతున్నా..
వాన మబ్బులు..
నీటి జాడలు
ఎండమావులైనా..
వేడి సెగలు ఉడికిస్తున్నా..
ఉక్కపోతకు ఊపిరి ఆగుతున్న

నిన్నుకన్న పాపానికి,,
నిన్ను మోస్తూనే ఉంది..
తనంతట తానేమీ అడగని అభాగిని
నిన్ను,నీతల్లినిగన్న ఈ ‘అవని’...
గుక్క నీరులేక
నోరు తెరిచేసింది..
నిలువ నీడలేక
భోరున విలపిస్తోంది..
నిప్పుల కుంపటిలా మారి
నిన్నే వెక్కిరిస్తోంది.   
నీ స్వార్ధానికి..
నీ స్వంతానికి,
నీ పంతానికి,
నీవు నరికిన పచ్చచెట్టు కోసం
ఆవురావురు మంటున్నది..
అక్సిజన్ ఎక్కడంటున్నది..
నీ  స్వప్రయోజనా చర్యలతో
బిత్తరపోతోంది..
బావురుమని..
చెమ్మగిల్లుతోంది.

ప్రచండ భానుడిని నిలువరించ
మొక్కనొకటి పెంచమంటూ
అంతకన్నా వేరఖ్కర్లేదంటూ..
దీక్షబూని రమ్మంటూ..
మౌనమునిలా చేతులు చాస్తోంది..
మలయమారుతమై
ఊపిరులూదమంటోంది.  


అంచలంచెలుగ పెరిగే భూతాపం ఆప,
ఒక్క మొక్కనైనా పెంచమంటోందిరా..
ఇంతకాలం తానేమీ అడగలేదుగా..
ఒక్కసారి మనసారా తన కోర్కె తీర్చరా.!
జన్మభూమి గొప్పదనం ఇంతని చెప్పలేమురా..
ఋణం  తీర్చుకోను మొక్క ఒక్కటి చాలురా!

నేటి మొక్కలే రేపటి ప్రకృతి
నేటి మొక్కలే రేపటి నీటిజాడ
నేటి మొక్కలే రేపటి జీవితం
నేటి మొక్కలే రేపటి అరణ్యం

పచ్చదనం మనకు శ్రీరామ రక్షరా..!
పచ్చదనం మనకు మూలధనం సోదరా..!
భవితలోన ఆనందపు సౌందర్యం చూడరా..!
                        - కరణం

(స్తనాలెండి పోతున్నా = చెరువులెండిపోతున్నా)
                                                                     


Tuesday, 26 May 2015

అశోకుడు చెట్లు నాటించెను..

"అశోకుడు చెట్లు నాటించెను.."
                              -  కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ , 26.05.2015

    "అప్పుడెప్పుడో అశోకుడు నాటిన చెట్ల గురించి ఇప్పుడు మాకెందుకు సార్.. చరిత్ర ఉత్త చెత్త" అనేవాళ్ళో..అనుకునే వాళ్ళు కోకొల్లలు.. నిజంగా ఆ పాఠాలు ఇప్పుడు పిల్లలతో పాటు పెద్దలకీ వినిపించాలేమో .. !   లేకుంటే ..

ఏమిటీ విపరీతం.. ఎందుకీ దుస్థితి.. ఎవరు కారకులు...??

           గడిచిన వారం రోజులలో రెండు తెలుగు రాష్ట్రాల దీనస్థితి చూస్తుంటే..  నాకు చిన్నప్పుడెప్పుడో చూసిన "ఆదిత్య 369" చిత్రం గుర్తొస్తోంది.. కొద్ది రోజుల్లో మనం మర మనుషుల్లా.. వాతావరణం లోంచి వచ్చే వాయువులను తట్టుకోవడానికి మాస్క్ లు ధరించాలేమో..!


ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం  ప్రతి ఒక్కరికీ ఉంది.. ఇది నిజం.. మనం నిజం మాత్రమే మాట్లాడుకుందాం కాసేపు..

      నేను నేల మీద ఆంలెట్ వేశానేను మూడేళ్ల క్రితం అప్పుడు వడదెబ్బ మృతులు అతి తక్కువ నమోదయ్యాయ్.. అప్పుడు నమోదైన ఉష్ణోగ్రతలు 47- 48 వరకూ అత్యధికంగా, రామగుండం ని మించి భానుడు భగ్గుమన్నాడు..



        ఇప్పుడు గత రెండేళ్లలో కన్న ఉష్ణోగ్త్రతలు తక్కువే 43- 46 వరకే నమోదవుతున్నయ్.. కొండకచో 47 డిగ్రీలు.  అయినా  వృద్ధులు, పిల్లలు పిట్టల్లా నేలరాలుతున్నరు.. పండుటాకుల పరిస్థితి శోచనీయం. కనీసం గంటకు ఒకరుగా వడదెబ్బకు మృతి చెందుతుంటే ఒక జర్నలిస్టుగా నిశ్చేష్టుణ్ణయ్యా.. మృతిచెందిన వారిలో పదొకొండు రోజుల పసికందు నుంచి 75 ఏళ్ల వృద్ధుడి వరకూ ఉన్నారు.. ఆంధ్రా, తెలంగాణా వారితో పాటు అర్జెంటీనా యాత్రికుడు ఉన్నాడు..

ఒళ్ళంతా ఒకటే మంట.. ! ఉక్కపోత.. వరంగల్ లాంటి చోట ఆక్సిజన్ కూడా అందలేదని ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది..

మరి ఇంతమంది మృతి చెందడానికి ఎవరు కారణం..? ఈ పరిస్థితికి కారణం ఎవ్వరు..?
మనమే..! అని నాకనిపించింది. మనం వాడుతున్న ఫ్రిజ్ లు, ఏసిలు వగైరాలు ముఖ్యభూమిక పోషిస్తుంటే.. అడ్డగోలుగా చెట్లు నరకడం మరో దారుణం. మనల్ని ఇప్పుడు ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడలేవు..

  "పచ్చని చెట్టు మాత్రమే మనల్ని కాపాడ గలిగే ఏకైక అస్త్రం.".



ఇవి పాటిస్తే బావుండు...



 1. ప్రతి మనిషి కనీసం రెండు చెట్లను అధికారికంగా దత్తత తీసుకోవాలి..
 2. ఇళ్ళలో ఎవరైన పుట్టిన వెంటనే రెండు చెట్లు వారి పేరు మీద నాటాలి.
3. అవసరార్ధం ప్రభుత్వ సర్వెంట్లు చెట్టు నరకాల్సి వస్తే వారు వెంటనే పది చెట్లు నాటేలా చర్యలు తీసుకోవాలి.
4. ఇళ్ళలో జరిగే ప్రతి కార్యక్రమానికి గుర్తుగా ఒక చెట్టు నాటాలి.
5. పెద్ద కార్యక్రమాలకు అంతే పెళ్ళి వంటి కార్యక్రమాలలో ప్లాస్టిక్ డబ్బాలు..స్టీలు బొచ్చ్చెలు బదులుగా ఒక మొక్కను పంపిణీ చెయ్యాలి..

ఇలా వీలైనన్ని చెట్లు నాటడం చేసేందుకు ఇవే కాక,  మీకు వీలైన పద్దతులు ఎంచుకోవచ్చు..

పెరట్లో చెట్టు పెంచడం వల్ల భూగర్భ జలం అభివృద్ధి చెందే అవకాశం కూడా మెండుగా ఉంటుంది.. ఉదయం కాలం ఆక్సిజన్ ఇస్తుంది.  చక్కని నీడతో పాటు.. చల్లని గాలిని ఇస్తుంది..
                              
                             - మీ కరణం, 26.05.2015

Tuesday, 5 May 2015

అందాల గులాబిని

//అందాల గులాబిని //
                             - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                             ౦౫.౦౫.౨౦౧౫
                                             05.05.2015

అందమా..?
అంటే..?
నాకన్నా ఎవరిదిరా అందం..?

అందాల పోటీల్లో ఆరబోయటమా అందం..
అరగుడ్డలేసుకుని చిందులేయడమా అందం..
అడ్డగోలుగా మేకప్పేసుకుని కప్పు లేపేయడమా అందం..

ఏదిరా.. ?           


అందమెక్కడ.?
 నాకన్నా అందమా వారిది??

నీకు ఒళ్ళు బలిసి విసిరిన..
 మీ అమ్మ రొమ్ము  పాలు
ఆసిడ్ గా మారి నన్ను హత్తుకున్నాయిరా,,

నీకు మదమెక్కి విసిరిన..
 నీయక్క పెట్టిన అన్నం ముద్ద
ఆమ్లమై నన్ను ముద్దాడిందిరా..!

నీ కొవ్వుతో విసిరెసిన..
నీ చదులమ్మల సిరా ..
అశ్రువై  నన్ను చేరిందిరా..!
 

కానీ..
నువ్వు మాత్రం  నన్ను తాకలేదు..       
నీ నీడ  కూడా నన్ను చేరుకోలేదు..
నీ జాడకి కూడా ఆ ధైర్యం లేదు..
అసలు నీలాంటి వాడు ఎప్పుడు గెలవడురా..!

గెలిచింది నేనే..! అందాల గులాబిని నేనే..!

దొడ్లుకడిగే యాసిడ్ కన్నా  నీచమైనదిరా నీ జన్మ..!
కనిపెంచిన ఆడదానికి తలవంపురా నీ జన్మ..!
మనిషిగా పుట్టిన మహిషి  నీవు..
మమతానురాగాలు తెలీని మృగం నీవు.
శతాబ్దాలు గడుస్తున్న మారని జాతి బలుపు కు రూపం నీవు..
కామంతో మూసుకున్న గుడ్డి జన్మరా నీది..!

ఏది రా అందం...ఏదిరా చందం..??
మనిషిని మనిషిగా ప్రేమించడంలో ఉందది,
మనిషిని మనిషిగా చూడటంలో ఉందది,
మనిషి మనిషిగా బ్రతకటంలో ఉందది..,
అదిరా అందం.. అదిరా  సోయగం

నిన్ను  తిరగానిస్తున్నానంటే..ఆ అందం నాలో ఉంది
నిన్ను బ్రతకనిచ్చానంటే,.. ఆ అందం నాలో దాగుంది
నిన్ను క్షమించటంలోనే .. ఆ అందం నిబిడి ఉంది
అర్ధమైఁదా.. అందం నాలో మాత్రమే ఉందని....!

నా ఒళ్ళంతా అందముంది..
నా మనసంతా సౌందర్యముంది
అది అంత, ఇంత కాదురా..!
నా సొగసు నీవందుకోలేనంత...
 ఆ నా సోయగం ఎవరెస్ట్ అంత.
నా ముందు నీ బ్రతుకెంత..?
----------------------------------------------------


Sunday, 22 March 2015

శ్రీరాముడికి సోదరి ఉందని తెలుసా..??

శ్రీరాముడికి సోదరి ఉందని తెలుసా..??

                   - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                      22.03.2015

దశరధునికి భార్యలు మువ్వురు కౌసల్య సుమిత్ర కైకేయి..

ధసరధునికి  పుత్రులు నల్గురు.. రామలక్ష్మణభరత శతృఘ్నులు.. అదే కదా మనకి తెలిసింది.. మరి శ్రీరామునికి సోదరి కూడా ఉందని తెలుసా..?

 సోదరి అంటే పెద్దదా చిన్నదా? అంటే అక్క?? చెల్లెలా??

ఉంటే ముగ్గురు భార్య లో ఎవరు కన్నారు??  ఆమె ప్రస్తావన ఎక్కడా ఎందుకు కనబడలేదు..? ఉంటే ఆమె పేరేమిటి?? ఇత్యాది అనుమానాలు టక టక మీ మనసు రామాయణాన్ని శోధిస్తోంది కదూ../ విచిత్ర రామాయణంలో ఆమె ప్రస్తావన ఉంది.

ఆమె పేరు శాంత.

శాంత గురించి పెద్దగా మనకు తెలీదు..

ఈ శాంత గురించి కాస్త మనమూ తెలుసుకుని .. భవిష్యత్తుకూ అందించాల్సిన బాధ్యత ఉందనిపిస్తోంది..

శాంత కథ  తెలుసుకుందామా..?



శ్రీరాముడు ఇత్యాదులు పుట్టక మునుపు ధశరధునికి సురభి అనుగ్రహంతో పుట్టిన కుమార్తె శాంత..

    దశరధుని స్నేహితుడైన  అంగరాజ్యాధిపతి రోమపాదుడి కి పిల్లలు లేకపోవడంతో శాంత ను అక్కడ పెంచే ఏర్పాటు చేశారు. కొందరి వివరాల ప్రకారం ఆరునెలలు రోమపాదుడి ఇంట అంగరాజ్యంలో , మరో ఆరునెలలు దశరధుని ఇంట అయోధ్యలో  పెరిగేది శాంత.

 యుక్తవయస్కురాలైన తర్వాత  ఆమెకి దశారధుడు స్వయంవరం ప్రకటిస్తే.. ఆగ్రహంతో రాజప్రాసాదం చేరుకున్న  పరుశరాముడు , శాంత వివాహాన్ని అడ్డుకునేందుకు  దశరధుని పై కత్తి దుశాడు.  వశిష్టుడు అడ్డుపడి పరుశరాముని శాంతిబరచి, అనంతరం .. పరుశరాముని ఆదేశం ( బ్రాహ్మణునికిచ్చి చేయమని) మేరకు ఋష్యశృంగ మహర్షికి ఇచ్చి వివాహం  చేయడం జరిగింది..  శ్రీరామాదులు జన్మించడానికి కారణమైన పుత్రకామేష్టి యాగమును దశరథునిచేత చేయించినది ఈ ఋష్యశృంగుడే!  కాబట్టి  శ్రీరామాదుల న్వంత అక్క గారే..శాంత.

 దీనికి ఆధారాలుగా జానపదం లో శాంత ప్రస్తావన ఉంది. శ్రీ సత్యనారాయణ పిస్కావారు తన్ బ్లాగ్ లో అందించిన ఓ జాణపదంలో శాంత ప్రస్తావన కనబడింది.. ( http://andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=238&PageNum=4 )

      శాంత :

       " అక్కచెల్లెండ్రు మీరూ మిక్కిలీ సౌందర్యశాలులమ్మా
        మా తమ్ములు నలుగురినీ వలపించు జాణలకు దౄష్టి తగులూ
        దృష్టి తగులాకుండనూ నీలాల నివ్వాళులివ్వరమ్మా


         (అని సీతమ్మకే మారు వడ్డించింది. గడసరి సీతమ్మ ఊరుకుంటుందా!)


        మాయన్న ఋష్యశృంగూ వనములో కూడి యెడబాయకున్నా
        ఏమి యెరుగని తపసినీ ఓ వదినె! కేళించి విడిచినావూ
        దృష్టి తగులాకుండనూ నీలాల నివ్వాళులివ్వరమ్మా "

ఈ రెండు పాదాలు శ్రీరాం సోదరులకు అక్క ఉన్నదని ఖచితంగా రూఢి చేస్తున్నాయ్.. కాగా ఆమె భర్త ఋష్యశృంగుడనీ ఖరారు చేస్తున్నాయ్.



 

"లవకుశ" సినిమాలో శాంతాదేవి పాత్ర ఉంది. గుర్తొచ్చిందా..? . ఆ పాత్రను అలనాటి నటి సంధ్య (తమిళనాడు మాజీముఖ్యమంత్రి జయలలిత  కన్నతల్లి) పోషించారు.   
  వీలైతే "లవకుశ" మళ్ళీ చూడండి. ఇక, శాంత వివాహవృత్తాంతం పాతచిత్రం "ఋష్యశృంగ" లో చూడవచ్చును. అలనాటి నటుడు ముక్కామల కృష్ణమూర్తి ఈ చిత్రమును నిర్మించారు. అందులో ఋష్యశృంగునిగా అందాలనటుడు హరనాథ్ నటించారు. శాంతగా ఆశాలత అనే నటి వేసింది. ఇంకా రాజసులోచన, ముక్కామల వగైరాలు నటించారు.


కాబట్టి మిత్రులారా..! దశరధునికి పిల్లలు ఐదుగురు..  శ్రీరామ సోదరుల ఏకైక సోదరి శాంతాదేవి.

Saturday, 21 March 2015

ఉగాది తెలుగు వారిది మాత్రమేనా..??

ఉగాది తెలుగు వారిది మాత్రమేనా..?? 
                        - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                           31.03.2014

లేలేత కిరణాలు...
వీడని మంచు తెరలు..
రాలిన సుమాలు..
కోయిల కేరింతలు..
కొత్త చివురులు..
చిలక పలుకులు....
మామిడి రుచులు..
ప్రకృతి రమణియతను ఇంత అందంగా కళ్లకు కట్టేది.. వసంత రుతువు.

ఒక సారి ఋతువులను తెలుసుకుందాం :

౧. వసంత రుతువు
౨. గ్రీష్మ రుతువు
౩. వర్ష రుతువు
౪. శరద్ రుతువు / శరదృతువు
౫. హేమంత రుతువు
౬. శిశిర రుతువు

రుతువులలో ..తొలి ఋతువు వసంతం.. వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం..తొలి పక్షం శుక్లం.. అందులో తొలి రోజు పాడ్యమి.. ఆ రోజే ఉగాది..

సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి సంక్రమణ సమయంలోని చంద్రోదయం తదుపరి ఉగాది అని చెప్పటం జరుగుతోంది.

అసలు ఉగాది నేపథ్యం చూద్దాం..!

ఉగాది సంస్కృతం నుంచి వచ్చిన పదం. యుగ+ఆది
యుగ అనగా కాలం / వయస్సు అని అర్ధాలున్నాయి.(ఇంకా అనేకం వున్నాయు.), ఆది అనగా మొదలు అని అర్ధం.
శ్లో : యస్మిన్ కృష్ణో దివంవ్యత:
తస్మత్ ఏవ ప్రతిపన్నం కలియుగం                   



అని మహర్ష వేదవ్యాసుల వారు కలియుగారంభం గురించి ప్రకటించారు. అంటే ద్వాపర యుగం అంతంలోకృష్ణుడు ప్రపంచాన్ని విడిచి వెళ్ళిన నాటి నుండి.. కలియుగం ఆరంభం ఆయినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. కృష్ణుడు తన అవతారం చాలించిన తదుపరి బ్రహ్మ కలియుగ సృష్టిని ఆరంభించిన రోజునే యుగాది అంటారని కూడా తెలుస్తోంది.

సుమారు క్రీ.పూ. 3012 ఫిబ్రవరి 17/18 అర్ధరాత్రి నుంచి కలియుగం ఆరంభమై వుండవచ్చని గణిత శాస్త్రజ్ఞుల అంచనా..!
ఇక ఖగోళ ,గణిత శాస్త్ర కోవిదుడు అయిన భాస్కరాచార్య.. 12వ శతాబ్ధంలో యుగాది ఆరంభం గురించి ఇలా చెప్పారు.

" చెట్లకు ఆకురాలి, తిరిగి ఆకు చిగురించు కాలాన్ని.. తొలి ఋతువుగా.. కొత్తనెల ,కొత్త పక్షం, కొత్త ఘడియలను.. దక్షిణం నుంచి ఉత్తరానికి రవి సంక్రమణ సమయంలో చంద్రోదయం వెంట వచ్చే తొలి ఘడియల నుంచి ఉగాది ప్రారంభం అయినట్లు భాస్కరాచార్య.. లెక్కలు గట్టారు. దీంతో ల్యూనార్ క్యాలెండర్ (భారతీయ పంచాంగం..)చంద్రమాన పంచాంగం ప్రకారం నూతన సంవత్సరం.. చైత్రమాసం శుక్ల శుద్ధపాడ్యమి రోజు ప్రారంభమౌతుందన్నమాట.

శాలివాహన శకం ఆధారంగా మన పంచాంగం (కాలెండర్) రూపొందించ బడింది. గౌతమీ పుత్రశాతకర్ణి ఆయిన శాలివాహనుడు ఆయన హయాంలో భారతీయ పంచాంగం రూపొందింపజేశారు. అనాటి నుండి కాల నిర్ణయం చేసి రూపొందించడం వల్ల అది శాలివాహన శకం గా పేర్కొనబడింది. ఆంగ్ల గ్రెగోరియన్ కాలెండర్ కు భారతీయ పంచంగం (ల్యునార్ క్యాలెండర్ కు 78 ఏళ్ళ తేడా ఉంటుంది. అంటే గ్రెగోరియన్ కాలెండర్ ప్రకారం 2014 అయితే.. శాలివాహన శకం ప్రకారం 1936 వ సంవత్సరం నడుస్తుందన్నమాట.! శాలివాహన శకం పంచాంగం ప్రకారం.. ప్రతి 60 ఏళ్ళు తిరిగి వస్తాయి. మొదట ప్రభవ నామ సం వత్సరంతో మొదలై 60 పూర్తి చేసుకుని మరలా ప్రభవ నామ వత్సరం వస్తుందన్నమాట.! గ్రెగోరియన్ లేదా హూణ లేదా ఆంగ్ల కాలెండర్ ప్రకారం మార్చ్ నెలాఖరు లేదా ఏప్రియల్ తొలివారాలలో ఈ ఉగాది పర్వదినం వస్తుంది.

అరవై సంవత్సరాలు..
1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.






ఈ ఉగాదిని ముఖ్యంగా వింధ్యపర్వతాలు, కావేరీ మధ్యనున్న దక్షిణభారతీయులు జరుపుకుంటారు.. వీరు మాతమే కాక ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోని హైందవ సంప్రదాయం పాటించే వారు,వందల ఏళ్లక్రితం స్థిర నివాసాలేర్పరచుకున్న హైందవ సంచార జాతులు ఒకే రోజున ఉగాదిని జరుపుకుంటారు. అంతే కాక మరి కొన్ని రాష్ట్రాలలో కొద్ది రోజుల తేడాతో ఉగాది జరుపుకోవటం కద్దు.

తెలుగు - ఉగాది
కన్నడ - యుగాది
కొంకణి/మరాఠి - గుడిపాడ్వా/యుగాది
పశ్చిమ బెంగాల్ - నాభ భార్ష
రాజస్థాన్ లోని మార్వరి అనే తెగ వారు - తపన
పంజాబ్ - బైసాకి
తమిళనాడు - పుతాండు
మణిపురి - సజిబు నోంగమా పెంబ
సింధులోని సింధు తెగ వారు - చెటి చాంద్
అస్సాం - బిహూ
ఇండోనేషియా,బాలి లోని ' మురి తియూస్ ' అనే హిందూ తెగ వారు - నేపి
అనే పేరుతో ఉగాది జరుపుకుంటారు.

ఇక అత్యంత ప్రాముఖ్యం ఉగాది పచ్చడిది. ఉగాది పచ్చడిని 'కదంబ బజ్జి,'కదంబం,అని కూడా అంటారు. షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. షట్ ముఖాలకు ప్రతీకే ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ ఉగాది పచ్చడి.



పచ్చడి లో ఏమేం వాడతారు .. వాటి ఉద్దేశ్యం తెలుసుకుందాం..!

తొలిగా పుచే వేపపూత - చేదు - దిగులు, విచారం
తొలి చెరకు, బెల్లం - తీపి - ఆనందం , సంతోషం
తొలిగా పండించిన ఉప్పు - లవణం - భయం
పండించిన చింతపండు - పులుపు - చిరాకు
మిరియం ,కారం - కటువు - క్రోధం, ఆవేశం
తొలి మామిడికాయ - వగరు - ఆశ్చర్యం

ఇతరములు వారి వారి ఇష్టంతో లేక ప్రత్యామ్నాయంగా కలుపుకునేవి మాత్రమే..!

కొత్త ఆశ

// కొత్త ఆశ //
                                                       - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                                                            21.03.2015

నిజమే..!
మనిషి ఆశా జీవి..
ఆ ఆశే మాకు శ్వాసై
ముందుకు నడిపిస్తోంది..
ఎన్నికల వాగ్దాన రాజులపై ఆశ
కష్టాలు గట్టెక్కిస్తాడేమోనని,
కొలువైన రాజాధిరాజుల పై ఆశ
తోడుగా ధైర్యం ఇస్తారేమోనని,
పాలకులపై ఆశ..
ధరాభారం దించేస్తాడేమోనని,
కోటి దేవుళ్లపై ఆశ
కోరికల చిక్కుముళ్ళు విప్పుతారేమోనని,


ప్రతి ఏటా నీమీదా మాకెంతో అదే ఆశ..
కొత్త పుంతలు తొక్కిస్తావని
కొత్తగా చిగురిస్తావని..
కొత్త రాగాలు వినిపిస్తావని
కొత్త శ్వాస నింపుతావని..
కొత్త పచ్చదనపు సిరికురిపిస్తావని..
కొత్తగా మరేదో తెస్తావని..

ఎప్పటకప్పుడు అంతే ..!
మేం ఎదురుచూస్తూనే ఉంటాం..
 అవును..  మనిషి ఆశాజీవి మరి.!!