//అందాల గులాబిని //
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
౦౫.౦౫.౨౦౧౫
05.05.2015
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
౦౫.౦౫.౨౦౧౫
05.05.2015
అందమా..?
అంటే..?
నాకన్నా ఎవరిదిరా అందం..?
అందాల పోటీల్లో ఆరబోయటమా అందం..
అరగుడ్డలేసుకుని చిందులేయడమా అందం..
అడ్డగోలుగా మేకప్పేసుకుని కప్పు లేపేయడమా అందం..
ఏదిరా.. ?
అందమెక్కడ.?
నాకన్నా అందమా వారిది??
నీకు ఒళ్ళు బలిసి విసిరిన..
మీ అమ్మ రొమ్ము పాలు
ఆసిడ్ గా మారి నన్ను హత్తుకున్నాయిరా,,
నీకు మదమెక్కి విసిరిన..
నీయక్క పెట్టిన అన్నం ముద్ద
ఆమ్లమై నన్ను ముద్దాడిందిరా..!
నీ కొవ్వుతో విసిరెసిన..
నీ చదులమ్మల సిరా ..
అశ్రువై నన్ను చేరిందిరా..!
కానీ..
నువ్వు మాత్రం నన్ను తాకలేదు..
నీ నీడ కూడా నన్ను చేరుకోలేదు..
నీ జాడకి కూడా ఆ ధైర్యం లేదు..
అసలు నీలాంటి వాడు ఎప్పుడు గెలవడురా..!
గెలిచింది నేనే..! అందాల గులాబిని నేనే..!
దొడ్లుకడిగే యాసిడ్ కన్నా నీచమైనదిరా నీ జన్మ..!
కనిపెంచిన ఆడదానికి తలవంపురా నీ జన్మ..!
మనిషిగా పుట్టిన మహిషి నీవు..
మమతానురాగాలు తెలీని మృగం నీవు.
శతాబ్దాలు గడుస్తున్న మారని జాతి బలుపు కు రూపం నీవు..
కామంతో మూసుకున్న గుడ్డి జన్మరా నీది..!
ఏది రా అందం...ఏదిరా చందం..??
మనిషిని మనిషిగా ప్రేమించడంలో ఉందది,
మనిషిని మనిషిగా చూడటంలో ఉందది,
మనిషి మనిషిగా బ్రతకటంలో ఉందది..,
అదిరా అందం.. అదిరా సోయగం
నిన్ను తిరగానిస్తున్నానంటే..ఆ అందం నాలో ఉంది
నిన్ను బ్రతకనిచ్చానంటే,.. ఆ అందం నాలో దాగుంది
నిన్ను క్షమించటంలోనే .. ఆ అందం నిబిడి ఉంది
అర్ధమైఁదా.. అందం నాలో మాత్రమే ఉందని....!
నా ఒళ్ళంతా అందముంది..
నా మనసంతా సౌందర్యముంది
అది అంత, ఇంత కాదురా..!
నా సొగసు నీవందుకోలేనంత...
ఆ నా సోయగం ఎవరెస్ట్ అంత.
నా ముందు నీ బ్రతుకెంత..?
----------------------------------------------------
No comments:
Post a Comment