Saturday, 23 January 2016

// న్యూ వర్ల్డ్ ...//

// న్యూ వర్ల్డ్ ...//
             - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ 
                          21.01.2016.. 16.11  


కొత్త ప్రపంచం..కొత్త ప్రపంచం..
ఆశల వలయాల ఆవల..
ఈర్ష్యాద్వేషాలకు సుదూరాన.. 
నాలో నీవు నీలో నేనూ..
కవ్విస్తూ..మురిపిస్తూ..
మెత్తగా హత్తుకుని..
ఆ గాఢ పరిష్వగంలో
మైమరమరచి..
ఏకాకుల్లా ఏకమై.. 

ఎడారి ఒయాసిస్సు ఒడ్డున
అడుగులో అడుగేసుకుంటూ..
మంచు శిఖర చిటారు కొనపై..
ఊసులాడుకుంటూ..
శంబరమాటున మెరిసిపోతూ
శరధి నురుగై తేలిపోతూ ..
కరిగిపోతూ ..కలిసి పోతూ...
సవ్వడి ఎరుగని చీకటిలో..
కిరణం సంయోగించని చిట్టడవిలో..

ఒకరికొకరం ..
ఒకరై ఇద్దరం...
 చలించి జ్వలించి .. 
కేళీ విలాసాన
విజయపుటంచుల కేతనం ఎగురేయాలి...
కొంగ్రత్త ప్రపంచపు ఆది మనమవ్వాలి...
అంతవరకూ...నీవు నాతో ఉంటావు కదూ..
యు ఆర్ మై న్యూ వర్ల్డ్. 
లవ్యూ ఫరెవర్..._ నీ కరణం...
                                              21.01.2016.. 16.11

(చిత్రం గీసిన మహానుభావుడికి శిరస్సు వంచి నమస్సులతో.. గుగూల్ నుంచి..!! 
కవితకు చిత్రం వెదకటంలో సహకరించిన నా ప్రాణ మిత్రులకు కృతజ్ఞలతో..!- కరణం )

Monday, 10 August 2015

// మా ఇంట్లో ఓ శంకర్ దాదా..//

// మా ఇంట్లో ఓ శంకర్ దాదా..//
                                      - కె.కె. కృష్ణ కుమార్, 05.08.2015

ఎందరో మహానుభావులు అందరికీ వందనము... మా పెద్దోడు శ్రీరాంశరణ్ ఎంబిబిఎస్ చేరాడు.. ఒంగోలు లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో.. వారం రోజుల టెన్షన్.. ఒకరికి కాదు ఇద్దరికి కాదు.. ఇంటిల్లిపాదిదీ ఇదే పరిస్థితి.. కారణం లేకపోలేదు..


మొదట తెలంగాణా కౌన్సిలింగ్ జరిగింది గత నెల 29 న తేదీన. తెలంగాణాలో మావాడు నాన్-లోకల్.. ర్యాంకు 196 మాత్రమే.. ఉస్మానియా వస్తుందనుకున్నాం.. కనీసం గాంధీ మెడికల్ కాలేజ్‌కూడా రాలేదు.. వరంగల్ లో వచ్చింది.. కానీ.. మేము సానుకూలంగాలేక వరంగల్ వద్దనుకున్నాం.. నో-ఆప్షన్ పెట్టేశాం.. ఆ నిర్ణయం తప్పు కావచ్చని ఆ క్షణం మాకు తెలీదు..
ఆం.ప్ర లో లోకల్ ..ర్యాంకేమో 967.. 
ఈరోజున ( ఆగస్టు 5 న)ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిలింగ్ కోసం ఏమౌతుందో తెలీక నానా ఇబ్బందీ పడ్డాం... సీట్ వస్తుందో రాదో అర్ధం కాని పరిస్థితి.. రిజర్వేషన్లు అన్నీ పోగా మిగిలిన వాటిలోనే రావాలని తెలిసి భయపడ్డాం.. లెక్కలు.. వగైరా లతో తల బొప్పి కట్టింది.. ఇక ఎదురుగా కౌంట్‌డౌన్ స్టార్ట్... ఒకొక్క సీటు ఐపోతూ.. భయపెట్టింది కంప్యూటర్ స్క్రీన్ ..
విశాఖ మేము లోనికి వెళ్ళకముందే పూర్తెపోయాయ్.. చూస్తుండగానే గుంటూరు, కాకినాడ, విజయవాడ సీట్లు హుష్ కాకి.. చివరకి గవర్నమెంట్ కాలేజీలో చేరాలన్న సంకల్పంతో ఒంగోలు రింస్ కాలేజీ లో చేరాడు శ్రీరాం..మావంశంలో రెండో డాక్టర్..

మా నాన్నగారి కల.. : మనుమడీని డాక్టర్ గా చూడాలన్నది, మా నాన్నగారు కరణం సుబ్బారావు గారి చిరకాల వాంఛ. ఇక ఆ వేటలో మా శ్రీరాం ఒంటరిగానే పోరాడాడని చెప్పాలి.. కేవలం మేము వాతావరణ కల్పించడం మినహా ఏమీ చేయలేదు.. ఇక ఎంట్రన్స్ సమయంలో .. భావరాజు పద్మిని గారు, వారి శ్రీవారు శ్రీ సతీష్ గారు బెంగులూరులో ఎంట్రన్స్ వ్రాయడానికి వెళ్ళినప్పుడు మాకు గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసి సహకరించారు.. వారికి ఈ సందర్భంలో ప్రత్యేక కృతజ్ఞతలు.. ఇక మాయింటికి రండి అంటూ కొల్లూరు విజయశర్మగారూ, రేఖ గారూ కూడా ఆహ్వానించినా దూరం అవ్వడం వల్ల మేము భావరాజు సతీష్ గారు ఏర్పాటు చేసిన వసతి గృహాన్ని వినియోగించుకున్నాము.. కొల్లూరు విజయా శర్మ గారికి, Naveenrekha Ns మేడం గారికి కృతజ్ఞతలు.. ఇక సీట్ ల వేటలో సహకరించిన మా తమ్ముడి మామగారు శ్రీ ప్రసాద్ గారూ, మా ఫొటోగ్రాఫర్ మిత్రుడు శ్రీ శివరంజని సాయి (చీరాల)అన్నకు, మూర్తి గారు (ఆర్టిసి, ఒంగోలు )వారికి, మా శ్రీరాం స్నేహితుల పేరెంట్స్ అందరికీ పేరుపేరున నా ప్రత్యేక కృతజ్ఞతలు..
ఇక మాఇంట్లో సంబరాలు చేసుకోవాలి.. ఇక్కడ ఎవరి ఫేరైనా చెప్పడం మరచిపోతే తిట్టకండే.. ఆనందంలో మరిచిపోయానని క్షమించేయండే...
ఇక పాటేస్కుంటాం మరి.." శ్రీరాం శరణ్ ఎంబిబిఎస్.. ఊ..హ..ఊ..హ"
శుభసాయంత్రం - మీ కరణం





//తన కోసం...//

//తన కోసం...// 
                                                         _ కె.కె. కృష్ణ కుమార్, 09.08.2015
తను వస్తేనే తనువులు ..మనువాడినంత సంబరపడతాయ్
తను వస్తేనే కనులు.. సుషుప్త రెప్పల దుప్పటి తొలిగిస్తాయ్.
తను వస్తేనే మనసులు .. రెక్కలు తొడిగి రెపరెపలాడతాయ్..

తను వస్తేనే జీవులు.. సాగరన నావల్లే తేలిపోతాయ్..
తను వస్తేనే నేలమ్మ.. నేలమీదమ్మ లేత పాదాల గజ్జెలు ఘల్లు మంటాయ్...
లేత ఆకుల నుంచి ..
లేత కిరణాలు పంచి..
లేత మనసు ను గిలిగింతలెట్టే..
తను వస్తేనే.. 
సర్వం తెల్లారినట్లౌతుంది...
సకలం సాకారమౌతుంది..



Monday, 3 August 2015

నిన్న ఇష్టం లేక ఈ రోజు పోస్టా.. !

నిన్న ఇష్టం లేక ఈ రోజు పోస్టా.. !

స్నేహం క్షణభంగురమా..?

నేస్తాలు.. మిత్రులూ.. ఫ్రెండ్స్.. స్నేహితులూ, హితులూ, సన్నిహితులు, అంటు, అనుకూలుడు, అనుగులము, అనుసరుడు, అనుసారకుడు, ఆక్రందుడు, ఆప్తుడు, ఇతవరి, ఇష్టసఖుడు, ఇష్టుడు, ఉద్దికాడు, ఉద్దీడు, చనవరి, చెలికాడు, చెలిమరి, చెలిమికాడు, తోడు, దోస్తు, నంటుకాడు, నందంతుడు, నందివర్ధనుడు, నిజుడు, నెచ్చెలి, నెత్తురుబొత్తు, నెయ్యరి, నెయ్యుడు, నేస్తకాడు, నేస్తము, నేస్తి, పక్కము, పక్షము, పరేతరుడు, పొందు, పొందుకాడు, పొత్తుకాడు, పోటిగాడు, బాసట, బోడిక, భరణ్యువు, మనుకునంటు, మిత్త, మిత్తరుడు, మిత్రము, మిత్రుడు, మైత్రుడు, వయస్యుడు, విధేయజ్ఞుడు, విహితుడు, శ్రేయోభిలాషి, సంగడి, సంగడికాడు, సంగడీడు, సంగాతకాడు, సంగాతి, సకుడు, సఖుడు, సగంధుడు, సచి, సచివుడు, సజుఘుడు, సమ్మోదికుడు, సవయస్కుడు, సహచరుడు, సహభావి, సహవాసి, సహాయుడు, సుహృత్తు, సుహృదయుడు, సుహృదుడు, స్నిగ్ధుడు, స్నేహి, స్నేహువు, స్వకుడు, హితవరి, హితుడు.............................................................. 

   ...... వంటి ఎన్నో పర్యాయపాదాలున్నాయి కదా.. మరి స్నేహమంటే శాశ్వతం, కలకాలం.. నిత్యం.. చివరికంటా,.. నీడగా.. కట్టెకాలేవరకురా, అని అనే వారు స్నేహితులంటున్నాము కదా.. !

ముఖపుస్తక మిత్రులందరూ.. కట్టె కాలే వరకూ మిత్రులుగా ఉంటారంటారా..? నాకెందుకో స్నేహం అనే దానికి అర్ధం సరిగా లేదేమో అనిపిస్తోంది..

 కష్టమొచ్చినా.. నష్టమొచ్చినా వీడిపోనిదీ ఫ్రెండు ఒక్కడే.. అద్దెంటే లేనే లేనిది ఫ్రెండ్ షిప్ ఒక్కటే.. పాట అత్యద్భుతం.. నిజం నేను అలాగే ఉంటుందని గతంలో తలిచేవాడిని నాకు లేని నేస్తాల కోసం.. అర్రులు చాచేవాడిని.. మరి ... తుమ్మితే ఊడిపోయే స్నేహాలకు మరేదైనా పేరుంటే బాగుండు.. ఎందుకంటే ముఖపుస్తక ఫ్రెండ్స్ ఎవ్వరూ కలకాలం కలిసి ఉండే అవకాశం మాత్రం కనపడటం లేదు నాకు మాత్రం.. మరి మీరేమంటారో తెలుపండి.. ముఖపుస్తక స్నేహితులూ.. మీకూ అనుభవంలోకి వచ్చి ఉండవచ్చు.. ఆ అనుభవాన్ని కూడా పంచుకుంటే బావుంటుందని నా అభిలాష..- మీ కరణం..

Sunday, 26 July 2015

//మరణ శాసనం రావాలి//



//మరణ శాసనం రావాలి//
                  - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                        26.07.2015

నిర్దయ..నిర్దయ
నిస్సిగ్గు..నిస్సిగ్గు
నిర్లజ్జ..నిర్లజ్జ
నిస్సంకోచంగా..
నిరాటంకంగా..
నిన్నొకటి నేడొకటి రేపొకటి  


ఎత్తుకొని పెంచినోళ్ళు, బిడ్డలు
ఎత్తు ఎదగాలని ఆశపడితే
అడియాస వెంటాడి
కన్నీటి కడలి మిగిలాక..
ఆశలన్నీ ఆవిరై వెక్కిరించాక..
కన్నబిడ్డే శవమై కాటికేగాకా..






ఎందుకా నిర్భయ
తలవంచుకుని వివస్త్రగా..
ఎందుకా కాపాడలేని ఖాకీ
ఉప్పుచారలతో ఊరేగడానికి
ఎందుకా చట్టాల కాగితాలు
పొత్తిగుడ్డల ప్రతిరూపాలుగా
ఎందుకా  నాయకశిఖామణులు
మొసలి కన్నీరు కార్చడానికి..
ఎందుకా అధికారులు
ఎందుకా అధ్యాపకగణాలు
ఎందుకు..ఎందుకు
ఎందుకు ..ఎందుకు



ఏమిటా ధైర్యం
ఎందుకా ద్రోహం
ఎందుకా మలినం
ఎంతవరకూ .. 
ఎందుకొరకూ...
తపన తపన
ఆరాటం..ఆరాటం
మనిషిగా బ్రతికేందుకు లేని తపన
మనుషుల మధ్య బ్రతికేందుకు లేని ఆరాటం

మనిషిలోని మనిషి చచ్చి
మనిషిలోనే మహిషి పుట్టి
నేలమీద నరకానికి ఆనవాళ్ళై..
రాత రాసే విధాతనే దారి మళ్ళిస్తూ..
ఎందుకురా బ్రతకటం...దండగ
రెండు కాళ్ళ మధ్య శవంగా చిక్కి చావక..

ప్రకృతి వైపరీత్యాలు.. 
వస్తుంటాయ్.. పోతుంటాయ్
మీలాంటి నికృష్టులను 
వెర్రి సన్నాసులను
వాజమ్మలను 
మదపిచ్చి మృగాలను
తమతో తీసెకెళ్ళటానికి
వాటికీ భయమే..!

ప్రమాదాలు రోజూ
ఎందరినో మింగేస్తుంటాయ్
రాక్షస జాతికి ఆనవాళ్ళు..
ప్రకృతి కి బద్ధవిరోధులైన
మీ జోలికి రావెందుకో..
మీతో సహవాసానికి
వాటికీ గుండెదడే.....




ప్రతి చావుకేక  మరణ శాసనం కావాలి
చావుకు ప్రతిచావు దండన రావాలి
అప్పటిదాకా ఆగరు ఈ మదపు ఆంబోతులు..
కన్న తల్లిదండ్రుల పాలిట శాపాలు..
కలకంఠి పాలిట మృత్యు శకలాలు

ప్రతి చావుకేక  ఒక ఉరి కంబం కావాలి
అప్పటిదాకా ఆగవు ఆడవారి మరణాలు
అప్పటిదాకా ఆగవు ఎగసిపడే కన్నీళ్ళు..
అప్పటిదాకా ఉండదు.. ఉండదు
నింగికెగసిన కపోతాలకు ఆత్మశాంతి

( కలచి వేసిన నాగార్జున విశ్వవిద్యాలయ విద్యార్ధిని చి.రిషికేశ్వరి ఆత్మహత్య సందర్భంలో.. )
                                     

Thursday, 23 July 2015

బేతాళ విక్రమార్క కహాని

బేతాళ విక్రమార్క కహాని
          - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్, చీరాల. , 16.12.2014

//స్వాతి చినుకు//

     మర్రిచెట్టు పైకి ఎక్కి చెట్టుకు వేలాడుతున్న  శవం  విడిపించి  విడిపించి భుజాన్ని  బేతాళుడిని విడిపించి భుజానికెత్తుకుని క్రిందకి దిగి నడవడం ప్రారంభించాడు విక్రమార్కుడు. మౌనంగా వడివడిగా అడుగులేస్తూ చెమట తుడుచుకుంటూ భుజంపై శవాన్ని సరిచేసుకుంటూ వెళ్తున్న విక్రమార్కుడిని పలుకరించాడు శవంలోని భేతాళుడు.

  " రాజా మీరు పడుతున్న శ్రమ చూస్తే జాలి వేస్తోంది. మీకు శ్రమ తెలియకుండా ఒక అందమైన కథ చెబుతాను విను" అంటూ కథ చెప్పడం ప్రారంభించాడు.
_________________________________________________________________________________________________
 
"""అన్నా..! అన్నా...! నిన్నే..నిన్నే.." యోగేశ్వర్ రమణమూర్తిని పిలుస్తున్నాడు..""

 సైకిల్ తొక్కుతూ వెళ్తున్న రమణ ఆగి యోగీశ్వర్ కేసి చూసి ఏంటి కథ అంటూ కళ్ళెగరేశాడు. " అన్న నీతో ఒక విషయం చెప్పలి కొద్దిగా సీక్రెట్? అంటూ సాగదీశాడు.. సైకిల్ దిగి వాడివైపు నడిచాడు. ప్రక్కకు వెళ్ళిన వెంటనే ఒక ఫొటోకాపీ (జీరాక్స్) ఇచ్చి చదువన్నా అన్నాడు.

 అది చదువుతున్న రమణమూర్తి ఫేస్ లో రంగులు మారుతున్నాయ్.. చదవడం అయిపోగానే ఏంది యోగీ ఇది ఎవరీ స్వాతీ..ఎవరీ జిష్ణు .
యోగేశ్వర్ చాలా రోజుల నుంచి తెలుసు, పలకరిస్తునో, నమస్తే పెడుతూనో, నవ్వుతూనో,  రమణమూర్తికి కనబడుతూ ఉంటాడు.

  " అది సరే ఇప్పుడింతకీ ఈ ఉత్తరం నాకిప్పుడెందుకు చూపించావ్ "అడిగాడు రమణమూర్తి.

"అన్నా ఏముందన్నా.. ఆ జిష్ణు ది మీ ఊరే..!  కాస్త గలతీ గాడిలా ఉన్నాడు.. ఆ స్వాతీ మా వూరమ్మయి.. మీ చెల్లెలు క్లాస్ మేట్.." అంటూ చెప్పగానే గుర్తుకొచ్చింది. ఎప్పుడూ గలగల నవ్వూతూ స్వచ్చంగా కనిపించే ఆ అమ్మాయే వ్రాసిందా?? అనుమానంగా అడిగాడు రమణమూర్తి.

 " అవునంటన్న.. చాలా రోజులుగా చక్కగా మాట్లాడే ఆ స్వాతి  అకస్మాత్తుగా మాట్లాడటం మానేసిందట. స్వాతీ వ్రాసిన ఈ లవ్ లెటర్స్ ని వాడు కాలేజీలోని అబ్బాయిలకీ, అమ్మయిలకీ జిరాక్స్ తీసి పంచుతున్నడు.. ఆ విషయం ఆమెకు నేను చెబితే,  నేనేదో ఆమెకి లైన్ వేస్తున్నా అనుకుండే ప్రమాదం వుంది.. పోనీ మనకెందుకులే అనుకుంటే  నిజంగా అమె వ్రాసుంటే ఆమె కుటుంబం ఫరువు పోతుంది.. నువ్వైతే ఏమైనా చెయ్యగలవని నీకు చెప్పానన్నా!.. ఎవ్వరికీ చెప్పమాకు అని యోగేశ్వర్ జారుకున్నాడు.  నిజమైనదేనా?? మీరేమన్న తయారు చేశారా..?  గట్టిగా గదిమాడు రమణమూర్తి. యోగేశ్వర్ మాట్లాడిన తీరు తెన్ను చూసి చెబుతోంది నిజమే స్వార్ధ రహితం అని నమ్మాడు. అయినా తానేమి చేయాలో బోధపడక ఆలోచిస్తూ, మనకు మాత్రం సైకిల్ తొక్కుతూ వెళ్తున్నాడు.




అప్పటి దాకా వీళ్ళిద్దారి సంభాషణను దూరం నుంచి చూస్తున్న స్వాతి బంధువొకామె స్వాతీని నిలదీయడంతో ఆ పిల్లోడు నన్నేడిపిస్తున్నాడు.. నోటీకొచ్చినట్లు మాట్లాడుతుంటే చీవాట్లు పెట్టీ వస్తున్నా అంటూ గడుసుగా, నమ్మకంగా అన్నగురించి అర్ధాలు పెడార్ధాలు తీసి చెప్పీంది.

        స్వాతిని యోగేశ్వర్ ఊరిలోనే అందగత్తెగా చెబుతుంటారు. స్వాతి చినుకు ముత్యపు చిప్పలో ముత్యం ఎంత అందంగా ఉంటుందో..స్వాతి కూడా అంతే అందంగా ఉంటుంది.. అమె చిరునవ్వుకోసం వీథుల్లో కుర్రాళ్ళు అర్రులు జాస్తుంటారు. ఆమెకీ ఆవిషయం పై కాస్త స్పష్టమైన అభిప్రాయం ఉండటంతో కాస్త గర్వం పాలుకూడా అధికమే!.. అయినా స్వాతి ఎదుటి వారిని తన అందాల గర్వంతో  రెచ్చగొడుతుందేమో గానీ ఈ లెటర్ ఏమిటి అంత చండాలంగా వ్రాసింది?? ఆమె వ్రాసిందంటే నమ్మబుద్ధికాక రమణమూర్తి బుర్ర తిరుగుతోంది. నేరుగా చెబుదామంటే ఆమెతో ఎప్పుడూ మాట్లాడలేదు..  పోనీ ఊర్లో వాడని చెప్పిన జిష్ణు ఎవడోకూడా తెలీదు.. ఊర్లో వాళ్ళంతా తెలియాలని లేదు.. మనకెందుకులే అనుకోవడానికా  చెల్లెలి స్నేహితురాలు.. ఏంచేయాలో అర్ధం కావటంలా. చెల్లికి చెప్పడానికీ ఆమె అదే వయసు అమ్మాయి. వాళ్ళ మైండ్ చెడగొట్టగూడదన్న ఉద్దేశ్యంతో సైకిల్ తొక్కుతూ వెళ్తున్నాడు రమణమూర్తి.

  వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు నడుం తిప్పుకుంటూ, పుస్తకాలు చంకనెట్టుకుని ఎదురుగా వస్తూ రమణమూర్తికి కనబడింది స్వాతి. లెటర్ విషయమై  ఆమెని జాగ్రత్తపడమని హెచ్చరిస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చాడు.

  " స్వాతీ" పిలిచాడు.
" అన్నయా నన్నేనా? అమాయకంగా నటించింది స్వాతి. ఎందుకంటే అక్కడ పిలవడానికి ఎవ్వరూ లేరు తనూ, రమణమూర్తి తప్ప.
" మా ఇంటి నుంచి వస్తున్నావా? "
"అవునన్నయ్యా"
"సరే కాలేజీలో  మగపిల్లలతో కాస్త జాగ్రత్తగా ఉండు స్వాతీ.. " సుతారంగా హెచ్చరించాడు.
"ఏన్నా ఎవడైనా నా గురించి కంప్లైంట్ చేశాడా? ఎవడాడు చెప్పుతో కొడతా" ఇక స్వాతి నోరును ఆపడం తన వల్ల కాదని ముందే గ్రహించిన రమణమూర్తి "నీవు కాలేజ్ లో ఎవరికో లవ్ లెటర్ వ్రాశావుట వాడు వాటిని అందరికీ పంచిపెడుతున్నాడు.. చాలా చండాలంగా ఉన్నయ్ పదాలు జాగ్రత్త. " ఇబ్బందులొస్తాయ్. వాడూ ఉత్త వెధవల్లే ఉన్నాడు అని చెప్పదలుచుకున్నది చెప్పాడు రమణమూర్తి.  ఏ లెటర్ ? ఏముందందులో ఐ మీన్ కంటేంట్" అడిగింది స్వాతి..
"దాన్లో అంతా... "  ... వద్దులే నేను చెప్పలేను గాని చాలా అసభ్యంగా ఉంది.. వాడేమో కాలేజ్ లో పంచేస్తున్నాడట జాగ్రత్త ..అంటూ అక్కడ నుంచి కదిలాడు.  
 ఆమెను ఇబ్బంది పాలుజేయడం ఇష్టం లేని రమణమూర్తి ఆమెకు విషయం చెప్పలేదు.   "వాడు ఉత్త రోగ్ నాగురించి అసత్య ప్రచారాలు ఎక్కువ చేస్తున్నాడు. " అంటూ ఉండిపోయింది స్వాతి.

అప్పటిదాకా వీళ్ళనే గమనిస్తున్న స్వాతీ బంధువు స్వాతి ని నిలదీయటంతో రమణమూర్తి తనని గోల చేస్తున్నాడంటూ బుకాయించింది.. కాదు నమ్మించింది.

 ఇంతకీ ఆ ఉత్తరంలో... " ఏం జిష్ణు నాతో మాట్లాడటం మానేశావ్ .. నువ్ నచ్చలేదన్నావని ఆరోజు నుంచి ఆ డ్రస్ వాడటం లేదు కదా..! నువ్వే ఆ ఫేస్ కి కాస్త పౌడర్ వ్రాయంటే వ్రాసి చావలేదు..ఎందుకో నామీదమోజు తగ్గిందా? ప్రౌఢను తలపించే నా  మేను అందాలు నీకు నచ్చలేదా జిష్ణు  ... " అంటూ ఆ లేఖలో ఉన్న ప్రతి పదం గుర్తొస్తుండగా ..... సైకిల్ తొక్కుతున్న రమణమూర్తి నేరుగా ఎదురుగా వస్తున్న కారునిఢీ కొనబోయి తప్పించుకుని ఇల్లు చేరాడు.

  కొద్దిరోజులు గడిచాయ్..  "ఎవరు చెప్పారు నీకు ?? ఏముందందులో" అని కనపడ్డప్పుడల్ల స్వాతి అడుగుతున్నా ... ఆమె వ్రాసిందని చెప్పబడి సాక్ష్యంగా నిలిచిన ఆ లేఖలోని పదబంధాలు ఆమెకు తన నోటితో చెప్పడానికి ససేమిరా అన్నాడు రమణమూర్తి.

    అంతలో ఒకరోజు బండి మీద ఒక  కుర్రాడితో కలిసి బండి మీద వెళ్తున్న స్వాతిని చూశాడూ రమణమూర్తి. ప్చ్.. మనకెందుకులే అనుకుని నిట్టూర్చి ఇంటికి చేరాడు. రాత్రికి పడుకుని ప్రొద్దుటే లేచే సరికి ఇంటి ముందర బోలెడు మంది జనాలు ఏంమైందని అడిగిన రమణమూర్తి నాన్నతో  “ రమణమూర్తే..., స్వాతీని, జిష్ణు గాడు లేపుకు పోయేలా సహకరించా”డని గోల చేస్తున్నారు. ఇంటికొచ్చిన వాళ్ళలో స్వాతి బంధువుకూడా ఉంది.. ఆమె ఎవరో కూడా రమణమూర్తికి తెలీదు.  వాళ్లకి  సర్ధి చెప్పి , మా అబ్బయితో నేను మాట్లాడతానంటు వాళ్లని పంపించి,  బెల్టు తీసుకున్న రమణమూర్తి నాన్న నిష్టారావు... రమణమూర్తిని నోటికొచ్చినట్లు తిడుతూ బెల్టుకి పని చెప్పాడు. బెల్టు తెగిన తర్వాత "ఏరా.. ఆ అమ్మయితో నీకేం సంబంధం.. ఫోఫో బయటకు పో అంటూ మెడపట్టి బయటకు నెట్టేశాడు. కొడుకుని కనీసం ఏంజరిగిందో అడగాలన్న స్పృహకూడా అప్పుడు నిష్ణారావుకి ఆ క్షణం లేదు.

 ఇప్పుడు రమణరావు పరిస్థితి అగమ్యగోచరం.  వెనుక నుంచి పాట లీలగా వినిపిస్తోంది.. " దేవుడే ఇచ్చాడు వీథి ఒక్కటి .. ఇంక ఊరేల ,సొంత ఇల్లేల ఓ చెల్లెలా..ఏల ఈ స్వార్ధం.. ఏది పరమార్ధం.. .. పాపం పుణ్యం నావి కావే పోవే చిట్టెమ్మా!... నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా.. ఏది నీది.. ఏది నాది.." అంటూ  అంతులేని కథలో పాట రేడియోలో వస్తోంది.


ఇప్పుడు చెప్పు విక్రమార్క మహారాజా.. ఈ కథలో తప్పెవరిది?

మంచి పిల్ల అని అందరు అనుకునే  స్వాతి అందాలు వర్ణిస్తూ ప్రేమలేఖ వ్రాయడమా?
నమ్మకంగా ఉండాల్సిన స్నేహితుడు జిష్ణు.... ఆమె నమ్మకంగా రాసిన లేఖ ను పదుగురికీ పంచడమా?
అనవసరంగా రోడ్డున విషయాన్ని రమణమూర్తికి చేరవేసిన యోగీశ్వర్ దా?
తనకెందుకులే అని ఊరుకోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి , ఎవరు చెప్పారో దాచి పెట్టిన రమణమూర్తిదా?
లేక ఎవరేది చెబితే అది నమ్మి 20 ఏళ్ళు కళ్ళెదుట పెరిగిన కొడుకుని విచక్షణారహితంగా కొట్టి , బయటకు గెంటిన నిష్టారావుదా?

సమాధానం తెలిసీ చెప్పకపోయావో నీ తల వెయ్యి ఒక్కలౌతుంది..ఖబడ్దార్ అంటూ విక్రమార్కుడిని హెచ్చరించాడు శవంలోని  బేతాళుడు.

దానికి విక్రమార్క మహారాజు సమాధానం చెప్పడం ప్రారంభించాడు.

యవ్వనంలో ప్రేమ చిగిరించడం తప్పు కాదు గనుక స్వాతిని తప్పు పట్టలేం . పైగా ఆడపిల్ల మానసికంగా పరిపక్వత రాలేదని అర్ధమౌతోంది కనుక ఆమె తప్పు లేదు.
ఇక యోగేశ్వర్.. అతను చెప్పిన విధానం అమ్మాయిని కాపాడటం కాబట్టి అందులో కనబడుతున్న తప్పు ఏమీ లేదు. ఉంటే ఏదైనా స్వార్ధం ఉందనుకున్నా నువ్ అడిగిన ప్రశ్న ప్రకారం  తప్పు మాత్రం లేదు.

ఇక రమణమూర్తి జాగ్రత్తగా ఉండమని చెప్పాడేకానీ ఆమెని కించపరిచే విధంగాకుడా ఏమీ చెయ్యలేదు.. ఇంకా స్వాతీ నే తప్పుడు సమాచారాన్ని ఆమె బంధువుకు ఇచ్చి ఆపద్దర్మ అబద్దం ఆడింది.

ఇక స్నేహితుడు అనేవాడు రక్షకుడిగా ఉండాలేకానీ భక్షకుడిగా మాత్రం కాదు. కానీ మేకవన్నె పులిలా స్వాతిని ఆమె లేఖలు వ్రాసిందంటూ .. నిజమైన విషయమైనా,  అబద్దమైనా అందరికీ పంచడం మాత్రం జిష్ణు చేసిన భయంకర అపరాధం. ఖచ్చితంగా శిక్షార్హమే..! అంత గలభా చేసిన వాడు మరలా ఆమెను తనవైపు తిప్పుకోవడం లో కృతకృత్యుడైయ్యాడు కాబట్టి  మేకవన్నె పులి అనడంలో తప్పులేదు.

      ఇక రమణమూర్తి తండ్రి...  ఖచ్చితంగా బయట వారు చెప్పింది నోరు తెరుచుకు విన్నాడే కానీ తన అనుకున్న వారు మోసం చేశారని ఆవేశపడ్డాడే గానీ .. కన్నకొడుకు అవ్విధంగా  చేస్తాడని రమణమూర్తి గురించి, కనీసం ఆలోచించకుండా మెడబెట్టినెట్టి నిష్టా రావు తప్పు చేశాడు. ఒకవేళ అతనే తప్పుచేస్తే  నిష్ణారావు పెంపక దోషమౌతుంది .

విక్రమార్క మహారాజా.. ఎంత చక్కగా విశ్లేషించావు.. అందుకే నువ్వు నాకు నచ్చావ్.. నీకు వ్రతభంగం  కలిగింది .. నువ్వు మాట్లాడావ్ ....కాబట్టి ఇక నేనుంటా బైయ్ బైయ్.. అంటూ తుర్రుమని బేతాళుడు శవంతో సహా తిరిగి చెట్టెక్కాడు.  
                              
తనకు మాలిన ధర్మం.. మొదలు చెడ్డ బేరం...- మీ కరణం                 

 అదీ సంగతి .. మరి మీరేవర్ని తప్పుపడతారు ..??
                                      


             


Friday, 5 June 2015

" పిచ్చోడు గింజలు విసిరెన్.." (ఓ యదార్ధ గాధకు కథారూపం.)

//" పిచ్చోడు గింజలు విసిరెన్.." (ఓ యదార్ధ గాధకు  కథారూపం.)//

                                                - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్, 28.05.2015

             విజయవాడ వంటి ఒకానొక నగరంలో ఇది జరిగినట్లు.. చిన్నప్పుడు వినట్లు గుర్తు.. అయినా గుర్తున్న విషయాన్ని నా పద్ధతిలో  మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను.. అది వాస్తవమైతే ఆయనకి పాదాభివందనం తెలుపుకుంటూ .. అసలు విషయానికొస్తున్నా..!

 ఓ నగరానికి మేయర్ ఎన్నికలు.. పార్టీలు పోటాపోటీగా సిద్ధమౌతున్నాయ్.. ఓ పెద్దపార్టీ తర్జనభర్జనలు పడి...లెక్కలు బొక్కలు వేసి, తీసివేతలు కూడికలు అనంతరం ఓ అనామకుడిని, రైతు కూలిని తెచ్చి మేయర్ పదవికి నిలబెట్టారు. అనూహ్యంగా అతడు గెలిచాడు.. " ఆ వేలుముద్రేగా మనదే రాజ్యం అని నాయకులు సంబరపడ్డారు..

  మేయర్ హోదాలో కార్పొరేషన్ మెట్లెక్కిన ఆయన అధికార్ల సమావేశం ఏర్పాటు చేశాడు. అతనికి కేటాయించిన అంబాసిడర్ బుగ్గ కారులో ఊరంతా కలియతిరిగాడు.. తర్వాత మరలా అధికారులతో సమావేశమై  అందరినీ పేరుపేరున కుశల ప్రశ్నలేశారు.. అనంతరం తనకి ఒక హెలికాఫ్టర్ కావాలి నగరం చూడాలి.. మనరాజ్యం ఎంతవరకూ విస్తరించి ఉందో తెలుసుకోవాలంటూ ఆదేశించాడు.. ఇదెక్కడి ఖర్మ రెండు లక్షలు ఖర్చుచేసి హెలికాఫ్టర్ అద్దెకు తెప్పించాలా అనుకుంటూ చెవులు కొరుక్కునారు అధికారులు..

ఉదయాన్నే మున్సిపల్ గౌండ్స్ కి హెలికాఫ్టర్ వచ్చి ఆగింది.. జనాలతో పాటూ అధికారులు, ప్రతిపక్ష, విపక్షాలూ గౌండ్ కి చేరాయి.. అక్కడికి చేరుకుని కారుదిగిన మేయర్ భుజాన పెద్ద మూట ఒకటి పెట్టుకుని నేరుగా హెలీప్యాడ్ వద్దకు వచ్చి హెలికాఫ్టర్ ఎక్కి పోనీ అన్నాడు.. ఆ మూట ఏవిటో, ఏం చెయ్యబోతున్నాడో అక్కడున్న ఎవ్వరికీ అంతుపట్టలేదు.. మనదేంపోయే జనాల సొమ్మేకదా అనుకున్నారు అధికారులు, మనకి కౌన్సిల్ లో గొడవ చేయడానికి మంచి సబ్జెక్ట్ దొరికిందని సంబరపడ్డారు ప్రతిపక్షాలు.. ఏదేమైనా ఆమేయర్ తీసుకెళ్ళిన మూట ఏంటో అక్కడెవ్వరికీ అంతుపట్టలేదు.. కొద్దిగా ఎగరగానే మూట విప్పిన మేయయ్.. మూటలోని గింజలను నేలపై విసురుతూ అదే చల్లుతుండటం చూసి బిత్తరపోయాడు పైలెట్.. నగరం నలుమూలలూ తిరిగి మూటలోని గింజలన్నీ చల్లి నాక తృప్తిగా క్రిందకు దిగాడు మేయర్..

 పైలెట్ ద్వారా మేయర్ ఏమిచేశాడో తెలుసుకున్న మీడియా, ప్రతిపక్షాలు.. విపక్షాలతో సహా రెండు లక్షలు నేలపాలు అని ఒహటే గొడవ.. ప్రతిపక్షనాయకుడు ఒక అడుగు ముందుకేసి పిచ్చోడు గింజలు విసిరెన్ అని పూరణ ఇచ్చాడు.. అదే నగరామంతా ప్రాకిపోయింది.. "ఏ నోట విన్నా పిచ్చోడు గింజలు విసిరెన్" అని ఒక సామెతలాగా ప్రాకిపోయింది..

 ఎవ్వరు ఎంత గోల చేస్తున్నా.. మేయర్ మాత్రం తొణకలేదు.. తాను చాలా గొప్పపని.. గతంలో ఎవ్వరూ చేయని పని చేశానని తృప్తితో గర్వంగా ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు.. ఇక అతనితో వాదన అనవసరం అని ఊరుకున్నారు...
**************************************      *****************************                        

20 ఏళ్ల అనంతరం..

ఆనగరం ఆకాశానికి పచ్చదనపు సోయగాలు చూపింది..
వర్షపాతంలో రికార్డు నమోదు చేసింది.
ఆరోగ్యంలో ఆసియాలో ఫస్ట్ నిలిచింది..
చల్లని గాలితో ప్రజలను అక్కున చేర్చుకుంది.


ఒక చిన్న పిల్లాడు..  తన తాతతో చెట్ల నీడన నడుస్తూ.. తాతా మనూర్లో ఇన్ని చెట్లు  ఎవరు నాటించారు.. అశోకుడా.. అ..? " అని అడిగాడు..

"పిచ్చోడు గింజలు విసిరెన్.." అనబోయిన అప్పటి ప్రతిపక్షనాయకుడైన తాత నాలిక కరచుకుని.. తడబడ్డాడు.. అప్పటి తప్పు మరలా చేయదలచుకోలేదాయన్.. అప్పటి మేయర్ ను పిచ్చోడు గింజలు విసిరెన్ అని అన్న వ్యక్తి అతనే..


అసలా రోజేం జరిగిందని గుర్తుతెచ్చుకున్నాడు అప్పటి ప్రతిపక్షనాయకుడైన తాత.

  మేయర్ ప్రమాణం తర్వాత మంచి వర్షాలు పడ్డాయి.. మధ్యలో హెలికాఫ్టర్ లో ఆకాశమార్గాన తిరిగిన మేయర్ ఊరంతా గింజలు చల్లాడు.
     .. కొండలు గుట్టలు.. ఎక్కడా ఖాళీ ప్రదేశాలూ వదిలి పెట్టకుండా గింజలు చల్లాడు.. ఆ తర్వాత వర్షాలు జోరుగాపడ్డాయి.. దీంతో గింజలన్నీ మొలకెత్తాయ్.. అత్యధికంగా మొక్కలన్నీ బ్రతికాయ్..

      దీంతో నగరం అంతా పచ్చదనం పరచినట్లైంది.. కేవలం రెండు లక్షలతో అడవినే పండించాడు మేయర్ అని తోచిందిప్పుడా నాయకుడికి.. వేలుముద్ర మేయర్ ముందు చూపుకి.. మనసులోనే హేట్సాఫ్ చెప్పుకున్నాడు..  మేయర్ ని అవహేళన చేసినందుకు చిన్నబుచ్చుకుని చుట్టూ పరచిన పచ్చసోయగాలను చూస్తూ.. "చదువుకున్న నాకంటే చదురాని మేయర్ ఎంతాబాగా భవిస్యత్తుని ఊహించాడు" అనుకుంటూ  నడినెత్తిన సూరీడు పెళపెళలాడే సమయంలో మనుమడితో కలిసి చెట్టు నీడలో  ముందుకు నడిచాడు అప్పటి ప్రతిపక్షనాయకుడు..

      "పిచ్చోడు గింజలు విసిరెన్" అని మేయర్ ని తననోటితో తొలిగా అన్నందుకు మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నాడు., ఎందుకంటే ఆ మేయర్ చనిపోయి అప్పటికి చాలాకలం అయ్యింది నేరుగా వెళ్ళి చెప్పాలన్నా కుదర్దు...గనుక.

****************************************************

అదన్నమాట ఫ్రెండ్స్.. ఎక్కడికో వెళ్ళారు కదా.. వచ్చేయండి... అవును.. మరి ...

అందుకే మొక్కలు నాటండి.. మీ పిల్లల భవిష్యత్తుని కాపాడండి..
అన్నట్లు మిత్రులు మీరందరు ఎదో ఒక్కటి.... కొటేషన్ లేదా. కవిత.. లేదా. ప్రభుత్వానికి ఓ సలహానో, పద్యాలో ... ఇలా ఎదో ఒకటి కామెంట్ చెయ్యండి.. అవి పదిమందికి  ఇన్స్పిరేషన్ ఇచ్చేలా ఉండాలి..అవన్నీ ప్రభుత్వానికి నివేదించే  ప్రయత్నం చేద్దాం

.  "రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటుదాం.. భవిష్యత్తుకు  పచ్చని సిరులు అందిద్దాం.."
                                                                                                                       -  మీ కరణం

ఫొటో గూగుల్ సౌజన్యం..

(ఇది కథారూపం మాత్రమే.. ఎవరినీ ఉద్దేసించినది ఏ మాత్రం కాదని మనవి చేసుకుంటున్నాను.. కాగా విజయవాడనగరంలో జంధ్యాల శంకర్ గారు చైర్మన్ గా ఉన్నప్పుడు అజిత్ సింగ్ గారు కమీషనర్ గా పనిచేసినప్పుడు విజయవాడలో గ్రీనరీ పెరిగేందుకు ఎంతో కష్టపడ్డారని, అందుకే అజిత్ సింగ్ గారి పేరిట విజయవాడ నగరంలో ఓ పేటకు నామకరణం చేశారని ఫేస్ బుక్ మిత్రుల్లో పెద్దలు తమ తమ కామెంట్ ద్వారా తెలిపారు.. కాబట్టి ఈ సందర్భంలో వారిని స్మరించుకోవడం స్ఫూర్తిదాయకమని నా భావన. నమోస్తు.)