Sunday, 26 July 2015

//మరణ శాసనం రావాలి//



//మరణ శాసనం రావాలి//
                  - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                        26.07.2015

నిర్దయ..నిర్దయ
నిస్సిగ్గు..నిస్సిగ్గు
నిర్లజ్జ..నిర్లజ్జ
నిస్సంకోచంగా..
నిరాటంకంగా..
నిన్నొకటి నేడొకటి రేపొకటి  


ఎత్తుకొని పెంచినోళ్ళు, బిడ్డలు
ఎత్తు ఎదగాలని ఆశపడితే
అడియాస వెంటాడి
కన్నీటి కడలి మిగిలాక..
ఆశలన్నీ ఆవిరై వెక్కిరించాక..
కన్నబిడ్డే శవమై కాటికేగాకా..






ఎందుకా నిర్భయ
తలవంచుకుని వివస్త్రగా..
ఎందుకా కాపాడలేని ఖాకీ
ఉప్పుచారలతో ఊరేగడానికి
ఎందుకా చట్టాల కాగితాలు
పొత్తిగుడ్డల ప్రతిరూపాలుగా
ఎందుకా  నాయకశిఖామణులు
మొసలి కన్నీరు కార్చడానికి..
ఎందుకా అధికారులు
ఎందుకా అధ్యాపకగణాలు
ఎందుకు..ఎందుకు
ఎందుకు ..ఎందుకు



ఏమిటా ధైర్యం
ఎందుకా ద్రోహం
ఎందుకా మలినం
ఎంతవరకూ .. 
ఎందుకొరకూ...
తపన తపన
ఆరాటం..ఆరాటం
మనిషిగా బ్రతికేందుకు లేని తపన
మనుషుల మధ్య బ్రతికేందుకు లేని ఆరాటం

మనిషిలోని మనిషి చచ్చి
మనిషిలోనే మహిషి పుట్టి
నేలమీద నరకానికి ఆనవాళ్ళై..
రాత రాసే విధాతనే దారి మళ్ళిస్తూ..
ఎందుకురా బ్రతకటం...దండగ
రెండు కాళ్ళ మధ్య శవంగా చిక్కి చావక..

ప్రకృతి వైపరీత్యాలు.. 
వస్తుంటాయ్.. పోతుంటాయ్
మీలాంటి నికృష్టులను 
వెర్రి సన్నాసులను
వాజమ్మలను 
మదపిచ్చి మృగాలను
తమతో తీసెకెళ్ళటానికి
వాటికీ భయమే..!

ప్రమాదాలు రోజూ
ఎందరినో మింగేస్తుంటాయ్
రాక్షస జాతికి ఆనవాళ్ళు..
ప్రకృతి కి బద్ధవిరోధులైన
మీ జోలికి రావెందుకో..
మీతో సహవాసానికి
వాటికీ గుండెదడే.....




ప్రతి చావుకేక  మరణ శాసనం కావాలి
చావుకు ప్రతిచావు దండన రావాలి
అప్పటిదాకా ఆగరు ఈ మదపు ఆంబోతులు..
కన్న తల్లిదండ్రుల పాలిట శాపాలు..
కలకంఠి పాలిట మృత్యు శకలాలు

ప్రతి చావుకేక  ఒక ఉరి కంబం కావాలి
అప్పటిదాకా ఆగవు ఆడవారి మరణాలు
అప్పటిదాకా ఆగవు ఎగసిపడే కన్నీళ్ళు..
అప్పటిదాకా ఉండదు.. ఉండదు
నింగికెగసిన కపోతాలకు ఆత్మశాంతి

( కలచి వేసిన నాగార్జున విశ్వవిద్యాలయ విద్యార్ధిని చి.రిషికేశ్వరి ఆత్మహత్య సందర్భంలో.. )
                                     

No comments:

Post a Comment