//మౌనముని//
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్, 29.05.2015
తనకు తాను భారమైనా
తాను ఏడ్వలేకున్నా..
తన స్తనాలెండి* పోతున్నా..
వాన మబ్బులు..
నీటి జాడలు
ఎండమావులైనా..
వేడి సెగలు ఉడికిస్తున్నా..
ఉక్కపోతకు ఊపిరి ఆగుతున్న
నిన్నుకన్న పాపానికి,,
నిన్ను మోస్తూనే ఉంది..
తనంతట తానేమీ అడగని అభాగిని
నిన్ను,నీతల్లినిగన్న ఈ ‘అవని’...
గుక్క నీరులేక
నోరు తెరిచేసింది..
నిలువ నీడలేక
భోరున విలపిస్తోంది..
నిప్పుల కుంపటిలా మారి
నిన్నే వెక్కిరిస్తోంది.
నీ స్వార్ధానికి..
నీ స్వంతానికి,
నీ పంతానికి,
నీవు నరికిన పచ్చచెట్టు కోసం
ఆవురావురు మంటున్నది..
అక్సిజన్ ఎక్కడంటున్నది..
నీ స్వప్రయోజనా చర్యలతో
బిత్తరపోతోంది..
బావురుమని..
చెమ్మగిల్లుతోంది.
ప్రచండ భానుడిని నిలువరించ
మొక్కనొకటి పెంచమంటూ
అంతకన్నా వేరఖ్కర్లేదంటూ..
దీక్షబూని రమ్మంటూ..
మౌనమునిలా చేతులు చాస్తోంది..
మలయమారుతమై
ఊపిరులూదమంటోంది.
అంచలంచెలుగ పెరిగే భూతాపం ఆప,
ఒక్క మొక్కనైనా పెంచమంటోందిరా..
ఇంతకాలం తానేమీ అడగలేదుగా..
ఒక్కసారి మనసారా తన కోర్కె తీర్చరా.!
జన్మభూమి గొప్పదనం ఇంతని చెప్పలేమురా..
ఋణం తీర్చుకోను మొక్క ఒక్కటి చాలురా!
నేటి మొక్కలే రేపటి ప్రకృతి
నేటి మొక్కలే రేపటి నీటిజాడ
నేటి మొక్కలే రేపటి జీవితం
నేటి మొక్కలే రేపటి అరణ్యం
పచ్చదనం మనకు శ్రీరామ రక్షరా..!
పచ్చదనం మనకు మూలధనం సోదరా..!
భవితలోన ఆనందపు సౌందర్యం చూడరా..!
- కరణం
(స్తనాలెండి పోతున్నా = చెరువులెండిపోతున్నా)