Thursday 26 May 2016

అరణ్య రోదన

//అరణ్య రోదన//

_ కరణం కళ్యాణ్ కృష్ణకుమార్
25.05.2016



వేదనా సంద్రాన్ని
విరహానికి ఓపికెక్కువే.. 
ఒంటి చేత్తో ఈదేసే, మనసు
తీరం చేరాలని, తరంగంగా మారి..
మొప్పలు పట్టుకుని.. 
అటు ఇటూ ఊగిసలాడుతూ ...
 
తదేకంగా.. లక్ష్యం కోసం
అందిపుచ్చుకోవాలన్న...
చూపుల లంగరేసి.. 
తపిస్తూ.. తపస్సే చేస్తూ.. 
 మధుమాసపు విరుల అందాన్ని 
 ఆశల వలయంలో
ఎన్ని అవస్థలు పడుతోందో

చిక్కుకున్న తుమ్మెదై.. 
మనోవేదన పై కనీళ్ళ జల్లునే 
కళ్ళాపిజల్లుతూ 
నా పిడికిలంత హృదయం
 నీ విరహతాపంలో...
ఆ రాకకై, వేచి వేచి చూస్తున్నా..

తెలిసీ.. ఏం చెప్పనూ..! 
నన్ను గేలిచేస్తూ.. 
ఎప్పుడూ నీవే గెలిచేలా చేసే.. 
నీ రాక.. అందని ద్రాక్షేనని....!

కబుర్లన్నీ వెదుక్కుంటూ..
కనులు నొచ్చుకుంటూనే ఉన్నా,.... 
 సముదాయిస్తూ.. సతాయింపు భరిస్తూ.. 
 వెర్రినై..వేదనాభరితమై.. 

 నీవు నీటిపై రాసిన స్వరానికి నోరునొక్కి..
తాత్సారానికి అలవాటుపడ్డ
నా చితికి నేనే 
 దహన సంస్కారం చేసుకుంటూ.. 
 అసంకల్పితంగా రోదిస్తూ.. 
రాలే జ్ఞాపకాల పత్రాలని 
దీనంగా చూస్తూ.. 
 నిన్నే తలుస్తూ.. 
సమయాన్ని నిందిస్తూ..

అరణ్య రోదన చేస్తున్న
 నా అంతరాత్మ గొంతుపై 
 అరిపాదాలేసి నొక్కేస్తున్నా..! 
నీ నిశబ్దం బద్దలు కొట్టాలని..
 నీలో నన్ను ఐక్యం చేయాలని..!!

Friday 20 May 2016

సిరివెన్నెల సిరా జల్లు





నా అభిమాన 'సినీ' నెలవంక , నా మానస త్రిమూర్తులలో ఒకరు, గురువులు , అపర సరస్వతీ మానసపుత్రులు శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి జన్మదినం సందర్భంగా గతంలో నేను వ్రాసి వారికి సవినయంగా సమర్పించుకుంటున్న ఓ నూలుపోగు.. ఈ అక్షరాభిషేకం.. సీతారమశాస్త్రి గారికి మన: పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. _ కరణం

సిరివెన్నెల సిరా జల్లు
                           - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ 


సిరి మువ్వల చప్పుడు ఆయన గీతమాలికలు
సిరి అంచు పట్టు ఆయన అక్షరములు
సిరి వెన్నెల వెలుగులు ఆయన నగవులు
సిరియాయె భారతి ఆయనకు రమాకృష్ణా..!


ఆ 'చెంబోలు' కళ్ళు ...

వెదుకుతూనే ఉంటాయి ప్రపంచాన్ని..
ఎటేపో ఒంటరి ఆడదై ప్రయాణిస్తాయి.
ఎవరో ఒకరు.. నడవరా అంటూ చలన నాడులౌతాయ్
దుర్బిణి వేసి చూస్తాయి కాల గమనాన్ని..
బూడిదిచ్చేవాడిని ఏమి కోరాలంటూ నిలదీస్తాయి..
ఉందిగా సెప్టెంబరు మార్చి పైన అంటూ ఓదారుస్తాయి..

శరమై చండాడుతాయి..సన్నివేశాన్ని..
నిప్పుతునకతో కార్చిచ్చురగిలిస్తాయి..
సిగ్గులేని జనాన్ని అగ్గితో కడిగిపారేస్తాయ్

ఆమాంతం తడుముతాయి..
లక్షలపుస్తకాలలోని అక్షరక్రమాన్ని..!
సాహసం చేసేందుకు డింభకుణ్ణి సిద్ధం చేస్తాయి..
నువ్వే..నువ్వే..నువ్వేనువ్వు..అంటూ గుండె కవాటాలను కదిలిస్తాయ్
వద్దురా..సోదరా నువెళ్ళెళ్ళి పెళ్ళి గోతిలో పడొద్దంటూ హెచ్చరిస్తాయ్..

ఆయన పాళీ.. సిరా ..!



ఈ వేళలో నువ్వేం చేస్తూ ఉంటావో అంటూ..
ప్రియ గారాలతో ఆరాలు తీస్తాయ్..
కన్నుల్లో నీరూపం పదిలమంటూ..
వర్తమాన దర్శినై నిన్ను నీకే చూపుతాయ్..
కోటానుకోట్ల పదాలలో మునిగి సరళమై..
మదిని తాకుతాయ్..మనోరంజనమౌతాయ్..
వెన్నెల జలపాతాల సడిలోని చల్లనిగాలై  స్పర్శిస్తాయ్..
పులకింతలతో.. పునీతం చేస్తాయ్..
కమ్మగా అమ్మై జోలపాట పాడతాయ్..

 ఆ సుమధురాక్షరాల అక్షతలు..

ఆవేశమై అరుస్తాయి..
అణువణువూ అణ్వేషిస్తాయ్..
అంతా తానై ఆలోచిస్తాయ్..
ఆపుకోలేక ఆక్రోశిస్తాయ్..
అంతలోనే ఆనందిస్తాయ్..
అవేదనలో తమతో తామే రమిస్తాయ్..

దిక్సూచై మెరుస్తాయి ఆయన 'కల ' మధురిమలు
భాండమై నిలుస్తాయి శిష్యులను వరించ 'కల 'లు
నిర్మాతల శిరముపై ఆ పదాలు  పన్నీటి జల్లులు
పండితపామరులపై కురిసే సిరివెన్నెల తరగలు.. ఆయన పాటలు
అవి అచ్చంగా తెలుగు నేలపై పరచిన వెన్నెలకిరణాలు

ఆ పల్లవులు సిరిజ్యోతల సంస్కారమై నమస్కరిస్తాయ్
ఆ చరణాలు సిరిమల్లెల పరిమళాలై ఆహ్వానిస్తాయ్..
ఆ వచానాలు విరితేనెల రంగరించిన తెలుగునుచ్చరిస్తాయ్..



ఆ...
ప్రణవనాద జగత్తుకు ప్రాణం పోసిన

సీతారా'ముని'కి కరణం ప్రణామాలు
నడిచే పాటకు నమోవాకాలు
కదిలే కవితకు అక్షరలక్షలు
జతుల జావళికి సిరిజ్యోతలు
నిలువెత్తు కవనానికి నెసర్లు
వాచస్పతికి వేవేల వందనాలు
సరిగమల సెలయేరుకు సాధువాదాలు
      - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
            05.04.2014