బేతాళ విక్రమార్క కహాని
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్, చీరాల. , 16.12.2014
//స్వాతి చినుకు//
మర్రిచెట్టు పైకి ఎక్కి చెట్టుకు వేలాడుతున్న శవం విడిపించి విడిపించి భుజాన్ని బేతాళుడిని విడిపించి భుజానికెత్తుకుని క్రిందకి దిగి నడవడం ప్రారంభించాడు విక్రమార్కుడు. మౌనంగా వడివడిగా అడుగులేస్తూ చెమట తుడుచుకుంటూ భుజంపై శవాన్ని సరిచేసుకుంటూ వెళ్తున్న విక్రమార్కుడిని పలుకరించాడు శవంలోని భేతాళుడు.
" రాజా మీరు పడుతున్న శ్రమ చూస్తే జాలి వేస్తోంది. మీకు శ్రమ తెలియకుండా ఒక అందమైన కథ చెబుతాను విను" అంటూ కథ చెప్పడం ప్రారంభించాడు.
_________________________________________________________________________________________________
"""అన్నా..! అన్నా...! నిన్నే..నిన్నే.." యోగేశ్వర్ రమణమూర్తిని పిలుస్తున్నాడు..""
సైకిల్ తొక్కుతూ వెళ్తున్న రమణ ఆగి యోగీశ్వర్ కేసి చూసి ఏంటి కథ అంటూ కళ్ళెగరేశాడు. " అన్న నీతో ఒక విషయం చెప్పలి కొద్దిగా సీక్రెట్? అంటూ సాగదీశాడు.. సైకిల్ దిగి వాడివైపు నడిచాడు. ప్రక్కకు వెళ్ళిన వెంటనే ఒక ఫొటోకాపీ (జీరాక్స్) ఇచ్చి చదువన్నా అన్నాడు.
అది చదువుతున్న రమణమూర్తి ఫేస్ లో రంగులు మారుతున్నాయ్.. చదవడం అయిపోగానే ఏంది యోగీ ఇది ఎవరీ స్వాతీ..ఎవరీ జిష్ణు .
యోగేశ్వర్ చాలా రోజుల నుంచి తెలుసు, పలకరిస్తునో, నమస్తే పెడుతూనో, నవ్వుతూనో, రమణమూర్తికి కనబడుతూ ఉంటాడు.
" అది సరే ఇప్పుడింతకీ ఈ ఉత్తరం నాకిప్పుడెందుకు చూపించావ్ "అడిగాడు రమణమూర్తి.
"అన్నా ఏముందన్నా.. ఆ జిష్ణు ది మీ ఊరే..! కాస్త గలతీ గాడిలా ఉన్నాడు.. ఆ స్వాతీ మా వూరమ్మయి.. మీ చెల్లెలు క్లాస్ మేట్.." అంటూ చెప్పగానే గుర్తుకొచ్చింది. ఎప్పుడూ గలగల నవ్వూతూ స్వచ్చంగా కనిపించే ఆ అమ్మాయే వ్రాసిందా?? అనుమానంగా అడిగాడు రమణమూర్తి.
" అవునంటన్న.. చాలా రోజులుగా చక్కగా మాట్లాడే ఆ స్వాతి అకస్మాత్తుగా మాట్లాడటం మానేసిందట. స్వాతీ వ్రాసిన ఈ లవ్ లెటర్స్ ని వాడు కాలేజీలోని అబ్బాయిలకీ, అమ్మయిలకీ జిరాక్స్ తీసి పంచుతున్నడు.. ఆ విషయం ఆమెకు నేను చెబితే, నేనేదో ఆమెకి లైన్ వేస్తున్నా అనుకుండే ప్రమాదం వుంది.. పోనీ మనకెందుకులే అనుకుంటే నిజంగా అమె వ్రాసుంటే ఆమె కుటుంబం ఫరువు పోతుంది.. నువ్వైతే ఏమైనా చెయ్యగలవని నీకు చెప్పానన్నా!.. ఎవ్వరికీ చెప్పమాకు అని యోగేశ్వర్ జారుకున్నాడు. నిజమైనదేనా?? మీరేమన్న తయారు చేశారా..? గట్టిగా గదిమాడు రమణమూర్తి. యోగేశ్వర్ మాట్లాడిన తీరు తెన్ను చూసి చెబుతోంది నిజమే స్వార్ధ రహితం అని నమ్మాడు. అయినా తానేమి చేయాలో బోధపడక ఆలోచిస్తూ, మనకు మాత్రం సైకిల్ తొక్కుతూ వెళ్తున్నాడు.
అప్పటి దాకా వీళ్ళిద్దారి సంభాషణను దూరం నుంచి చూస్తున్న స్వాతి బంధువొకామె స్వాతీని నిలదీయడంతో ఆ పిల్లోడు నన్నేడిపిస్తున్నాడు.. నోటీకొచ్చినట్లు మాట్లాడుతుంటే చీవాట్లు పెట్టీ వస్తున్నా అంటూ గడుసుగా, నమ్మకంగా అన్నగురించి అర్ధాలు పెడార్ధాలు తీసి చెప్పీంది.
స్వాతిని యోగేశ్వర్ ఊరిలోనే అందగత్తెగా చెబుతుంటారు. స్వాతి చినుకు ముత్యపు చిప్పలో ముత్యం ఎంత అందంగా ఉంటుందో..స్వాతి కూడా అంతే అందంగా ఉంటుంది.. అమె చిరునవ్వుకోసం వీథుల్లో కుర్రాళ్ళు అర్రులు జాస్తుంటారు. ఆమెకీ ఆవిషయం పై కాస్త స్పష్టమైన అభిప్రాయం ఉండటంతో కాస్త గర్వం పాలుకూడా అధికమే!.. అయినా స్వాతి ఎదుటి వారిని తన అందాల గర్వంతో రెచ్చగొడుతుందేమో గానీ ఈ లెటర్ ఏమిటి అంత చండాలంగా వ్రాసింది?? ఆమె వ్రాసిందంటే నమ్మబుద్ధికాక రమణమూర్తి బుర్ర తిరుగుతోంది. నేరుగా చెబుదామంటే ఆమెతో ఎప్పుడూ మాట్లాడలేదు.. పోనీ ఊర్లో వాడని చెప్పిన జిష్ణు ఎవడోకూడా తెలీదు.. ఊర్లో వాళ్ళంతా తెలియాలని లేదు.. మనకెందుకులే అనుకోవడానికా చెల్లెలి స్నేహితురాలు.. ఏంచేయాలో అర్ధం కావటంలా. చెల్లికి చెప్పడానికీ ఆమె అదే వయసు అమ్మాయి. వాళ్ళ మైండ్ చెడగొట్టగూడదన్న ఉద్దేశ్యంతో సైకిల్ తొక్కుతూ వెళ్తున్నాడు రమణమూర్తి.
వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు నడుం తిప్పుకుంటూ, పుస్తకాలు చంకనెట్టుకుని ఎదురుగా వస్తూ రమణమూర్తికి కనబడింది స్వాతి. లెటర్ విషయమై ఆమెని జాగ్రత్తపడమని హెచ్చరిస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చాడు.
" స్వాతీ" పిలిచాడు.
" అన్నయా నన్నేనా? అమాయకంగా నటించింది స్వాతి. ఎందుకంటే అక్కడ పిలవడానికి ఎవ్వరూ లేరు తనూ, రమణమూర్తి తప్ప.
" మా ఇంటి నుంచి వస్తున్నావా? "
"అవునన్నయ్యా"
"సరే కాలేజీలో మగపిల్లలతో కాస్త జాగ్రత్తగా ఉండు స్వాతీ.. " సుతారంగా హెచ్చరించాడు.
"ఏన్నా ఎవడైనా నా గురించి కంప్లైంట్ చేశాడా? ఎవడాడు చెప్పుతో కొడతా" ఇక స్వాతి నోరును ఆపడం తన వల్ల కాదని ముందే గ్రహించిన రమణమూర్తి "నీవు కాలేజ్ లో ఎవరికో లవ్ లెటర్ వ్రాశావుట వాడు వాటిని అందరికీ పంచిపెడుతున్నాడు.. చాలా చండాలంగా ఉన్నయ్ పదాలు జాగ్రత్త. " ఇబ్బందులొస్తాయ్. వాడూ ఉత్త వెధవల్లే ఉన్నాడు అని చెప్పదలుచుకున్నది చెప్పాడు రమణమూర్తి. ఏ లెటర్ ? ఏముందందులో ఐ మీన్ కంటేంట్" అడిగింది స్వాతి..
"దాన్లో అంతా... " ... వద్దులే నేను చెప్పలేను గాని చాలా అసభ్యంగా ఉంది.. వాడేమో కాలేజ్ లో పంచేస్తున్నాడట జాగ్రత్త ..అంటూ అక్కడ నుంచి కదిలాడు.
ఆమెను ఇబ్బంది పాలుజేయడం ఇష్టం లేని రమణమూర్తి ఆమెకు విషయం చెప్పలేదు. "వాడు ఉత్త రోగ్ నాగురించి అసత్య ప్రచారాలు ఎక్కువ చేస్తున్నాడు. " అంటూ ఉండిపోయింది స్వాతి.
అప్పటిదాకా వీళ్ళనే గమనిస్తున్న స్వాతీ బంధువు స్వాతి ని నిలదీయటంతో రమణమూర్తి తనని గోల చేస్తున్నాడంటూ బుకాయించింది.. కాదు నమ్మించింది.
ఇంతకీ ఆ ఉత్తరంలో... " ఏం జిష్ణు నాతో మాట్లాడటం మానేశావ్ .. నువ్ నచ్చలేదన్నావని ఆరోజు నుంచి ఆ డ్రస్ వాడటం లేదు కదా..! నువ్వే ఆ ఫేస్ కి కాస్త పౌడర్ వ్రాయంటే వ్రాసి చావలేదు..ఎందుకో నామీదమోజు తగ్గిందా? ప్రౌఢను తలపించే నా మేను అందాలు నీకు నచ్చలేదా జిష్ణు ... " అంటూ ఆ లేఖలో ఉన్న ప్రతి పదం గుర్తొస్తుండగా ..... సైకిల్ తొక్కుతున్న రమణమూర్తి నేరుగా ఎదురుగా వస్తున్న కారునిఢీ కొనబోయి తప్పించుకుని ఇల్లు చేరాడు.
కొద్దిరోజులు గడిచాయ్.. "ఎవరు చెప్పారు నీకు ?? ఏముందందులో" అని కనపడ్డప్పుడల్ల స్వాతి అడుగుతున్నా ... ఆమె వ్రాసిందని చెప్పబడి సాక్ష్యంగా నిలిచిన ఆ లేఖలోని పదబంధాలు ఆమెకు తన నోటితో చెప్పడానికి ససేమిరా అన్నాడు రమణమూర్తి.
అంతలో ఒకరోజు బండి మీద ఒక కుర్రాడితో కలిసి బండి మీద వెళ్తున్న స్వాతిని చూశాడూ రమణమూర్తి. ప్చ్.. మనకెందుకులే అనుకుని నిట్టూర్చి ఇంటికి చేరాడు. రాత్రికి పడుకుని ప్రొద్దుటే లేచే సరికి ఇంటి ముందర బోలెడు మంది జనాలు ఏంమైందని అడిగిన రమణమూర్తి నాన్నతో “ రమణమూర్తే..., స్వాతీని, జిష్ణు గాడు లేపుకు పోయేలా సహకరించా”డని గోల చేస్తున్నారు. ఇంటికొచ్చిన వాళ్ళలో స్వాతి బంధువుకూడా ఉంది.. ఆమె ఎవరో కూడా రమణమూర్తికి తెలీదు. వాళ్లకి సర్ధి చెప్పి , మా అబ్బయితో నేను మాట్లాడతానంటు వాళ్లని పంపించి, బెల్టు తీసుకున్న రమణమూర్తి నాన్న నిష్టారావు... రమణమూర్తిని నోటికొచ్చినట్లు తిడుతూ బెల్టుకి పని చెప్పాడు. బెల్టు తెగిన తర్వాత "ఏరా.. ఆ అమ్మయితో నీకేం సంబంధం.. ఫోఫో బయటకు పో అంటూ మెడపట్టి బయటకు నెట్టేశాడు. కొడుకుని కనీసం ఏంజరిగిందో అడగాలన్న స్పృహకూడా అప్పుడు నిష్ణారావుకి ఆ క్షణం లేదు.
ఇప్పుడు రమణరావు పరిస్థితి అగమ్యగోచరం. వెనుక నుంచి పాట లీలగా వినిపిస్తోంది.. " దేవుడే ఇచ్చాడు వీథి ఒక్కటి .. ఇంక ఊరేల ,సొంత ఇల్లేల ఓ చెల్లెలా..ఏల ఈ స్వార్ధం.. ఏది పరమార్ధం.. .. పాపం పుణ్యం నావి కావే పోవే చిట్టెమ్మా!... నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా.. ఏది నీది.. ఏది నాది.." అంటూ అంతులేని కథలో పాట రేడియోలో వస్తోంది.
ఇప్పుడు చెప్పు విక్రమార్క మహారాజా.. ఈ కథలో తప్పెవరిది?
మంచి పిల్ల అని అందరు అనుకునే స్వాతి అందాలు వర్ణిస్తూ ప్రేమలేఖ వ్రాయడమా?
నమ్మకంగా ఉండాల్సిన స్నేహితుడు జిష్ణు.... ఆమె నమ్మకంగా రాసిన లేఖ ను పదుగురికీ పంచడమా?
అనవసరంగా రోడ్డున విషయాన్ని రమణమూర్తికి చేరవేసిన యోగీశ్వర్ దా?
తనకెందుకులే అని ఊరుకోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి , ఎవరు చెప్పారో దాచి పెట్టిన రమణమూర్తిదా?
లేక ఎవరేది చెబితే అది నమ్మి 20 ఏళ్ళు కళ్ళెదుట పెరిగిన కొడుకుని విచక్షణారహితంగా కొట్టి , బయటకు గెంటిన నిష్టారావుదా?
సమాధానం తెలిసీ చెప్పకపోయావో నీ తల వెయ్యి ఒక్కలౌతుంది..ఖబడ్దార్ అంటూ విక్రమార్కుడిని హెచ్చరించాడు శవంలోని బేతాళుడు.
దానికి విక్రమార్క మహారాజు సమాధానం చెప్పడం ప్రారంభించాడు.
యవ్వనంలో ప్రేమ చిగిరించడం తప్పు కాదు గనుక స్వాతిని తప్పు పట్టలేం . పైగా ఆడపిల్ల మానసికంగా పరిపక్వత రాలేదని అర్ధమౌతోంది కనుక ఆమె తప్పు లేదు.
ఇక యోగేశ్వర్.. అతను చెప్పిన విధానం అమ్మాయిని కాపాడటం కాబట్టి అందులో కనబడుతున్న తప్పు ఏమీ లేదు. ఉంటే ఏదైనా స్వార్ధం ఉందనుకున్నా నువ్ అడిగిన ప్రశ్న ప్రకారం తప్పు మాత్రం లేదు.
ఇక రమణమూర్తి జాగ్రత్తగా ఉండమని చెప్పాడేకానీ ఆమెని కించపరిచే విధంగాకుడా ఏమీ చెయ్యలేదు.. ఇంకా స్వాతీ నే తప్పుడు సమాచారాన్ని ఆమె బంధువుకు ఇచ్చి ఆపద్దర్మ అబద్దం ఆడింది.
ఇక స్నేహితుడు అనేవాడు రక్షకుడిగా ఉండాలేకానీ భక్షకుడిగా మాత్రం కాదు. కానీ మేకవన్నె పులిలా స్వాతిని ఆమె లేఖలు వ్రాసిందంటూ .. నిజమైన విషయమైనా, అబద్దమైనా అందరికీ పంచడం మాత్రం జిష్ణు చేసిన భయంకర అపరాధం. ఖచ్చితంగా శిక్షార్హమే..! అంత గలభా చేసిన వాడు మరలా ఆమెను తనవైపు తిప్పుకోవడం లో కృతకృత్యుడైయ్యాడు కాబట్టి మేకవన్నె పులి అనడంలో తప్పులేదు.
ఇక రమణమూర్తి తండ్రి... ఖచ్చితంగా బయట వారు చెప్పింది నోరు తెరుచుకు విన్నాడే కానీ తన అనుకున్న వారు మోసం చేశారని ఆవేశపడ్డాడే గానీ .. కన్నకొడుకు అవ్విధంగా చేస్తాడని రమణమూర్తి గురించి, కనీసం ఆలోచించకుండా మెడబెట్టినెట్టి నిష్టా రావు తప్పు చేశాడు. ఒకవేళ అతనే తప్పుచేస్తే నిష్ణారావు పెంపక దోషమౌతుంది .
విక్రమార్క మహారాజా.. ఎంత చక్కగా విశ్లేషించావు.. అందుకే నువ్వు నాకు నచ్చావ్.. నీకు వ్రతభంగం కలిగింది .. నువ్వు మాట్లాడావ్ ....కాబట్టి ఇక నేనుంటా బైయ్ బైయ్.. అంటూ తుర్రుమని బేతాళుడు శవంతో సహా తిరిగి చెట్టెక్కాడు.
తనకు మాలిన ధర్మం.. మొదలు చెడ్డ బేరం...- మీ కరణం
అదీ సంగతి .. మరి మీరేవర్ని తప్పుపడతారు ..??