Tuesday 7 June 2016

// అడుగుజాడలు//

// అడుగుజాడలు//
                                                       - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                                                                           06.06.2016




కదిలిస్తే.. పగిలేందుకు సిద్ధంగా ఉన్న కన్నీటి కుండలే..!
అదిలిస్తే...  వర్షించేందుకు సిద్ధంగా ఉన్న కారుమేఘాలే...!!
పంటి బిగువున స్వేచ్ఛను తొక్కిపట్టుకున్న నడిచే జీవశ్చవాలే...!
తీరం ఉన్నా, చేరేందుకు ఆరాట పడని అలుపెరగని కెరటాలే..!!

ఎన్ని కథలకు అక్షరాల అరువు కావాలో ...
అన్ని గాథల గ్రంథాలయాలు..
జీవిత తిరగమోతల... ఘాటైన మసాలాలు..
విషాద ముగింపులకు ఆముఖాలు...
ప్రేమ మైకం ముంచిన వెర్రితనాలు..
కట్టుకున్నోడి కొరకొర చూపుల కాలిన చికెన్ పీసులు..
ఆలి గేలి చేసిన అభాగ్యపు మగతనాలు...

ఏ చరిత్ర లోనో ఎందుకూ..
ఏ మేను తరచి చూసినా ఏముంటోంది, గర్వకారణం...!
నిస్తేజ జీవితాల మైదానాలు
నేలపై పారాడే కడలి తరంగాలు...
అంతర్మధనంలో గూడుకట్టుకున్న భావాల చెలమలు..
కలం రెక్కలు కట్టుకున్న స్వేచ్చా విహంగాలు...
అక్షరాలే దారప్పోగులై నింగని తాకుతున్న పతంగాలు...
విజ్ఞాన గనుల నుండి పుట్టుకొస్తున్న మాణిక్యాలు..
విశృంఖలాలను నిలదీస్తున్న విప్లవ జ్యోతులు..
లోకం పోకడలను కలంపోటుతో నిలదీస్తూ..
సమాధుల్లా బ్రతుకీడుస్తున్న సమాజాల కాటికాపరులు
ఆలోచనల పుట్టలు..ఆవేశపు వడగాలులు..
అందరూ తమవారే అని అనుకునే అమాయక ధ్వజాలు
సమాజం కోసం కలం కత్తిగ మార్చి యుద్దం చేసే గెరిల్లాలు

మాయామర్మం తెలియని మాలోకాలు...
ప్రపంచం పట్టించుకోని అక్షర శిల్పులు
తమలోకం వారిని వెతుక్కుంటూ .. 
సంబరపడే అల్ప సంతోషులు..
వారికి వారె ఆత్మీయులు...
చిరునవ్వు వెనుక బడబాగ్ని బంధించి..
నవ్వుతూ బ్రతికేటి నిప్పుల కుంపట్లు .. నా నేస్తాలు...
కవి అన్న చిన్న పదానికి ..అంకితమై
అహరహం అక్షర సేద్యం చేసే కర్షకులు..
అందరు ఉన్నా ఒంటరిగా మిగిలే అనాధలు..
భావి తరానికి బాసటై..
బాటలుగా మారే అక్షరాల అడుగుజాడలు..!

శుభమధ్యాహ్నం మిత్రాస్_ మీ కరణం