Friday 5 June 2015

" పిచ్చోడు గింజలు విసిరెన్.." (ఓ యదార్ధ గాధకు కథారూపం.)

//" పిచ్చోడు గింజలు విసిరెన్.." (ఓ యదార్ధ గాధకు  కథారూపం.)//

                                                - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్, 28.05.2015

             విజయవాడ వంటి ఒకానొక నగరంలో ఇది జరిగినట్లు.. చిన్నప్పుడు వినట్లు గుర్తు.. అయినా గుర్తున్న విషయాన్ని నా పద్ధతిలో  మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను.. అది వాస్తవమైతే ఆయనకి పాదాభివందనం తెలుపుకుంటూ .. అసలు విషయానికొస్తున్నా..!

 ఓ నగరానికి మేయర్ ఎన్నికలు.. పార్టీలు పోటాపోటీగా సిద్ధమౌతున్నాయ్.. ఓ పెద్దపార్టీ తర్జనభర్జనలు పడి...లెక్కలు బొక్కలు వేసి, తీసివేతలు కూడికలు అనంతరం ఓ అనామకుడిని, రైతు కూలిని తెచ్చి మేయర్ పదవికి నిలబెట్టారు. అనూహ్యంగా అతడు గెలిచాడు.. " ఆ వేలుముద్రేగా మనదే రాజ్యం అని నాయకులు సంబరపడ్డారు..

  మేయర్ హోదాలో కార్పొరేషన్ మెట్లెక్కిన ఆయన అధికార్ల సమావేశం ఏర్పాటు చేశాడు. అతనికి కేటాయించిన అంబాసిడర్ బుగ్గ కారులో ఊరంతా కలియతిరిగాడు.. తర్వాత మరలా అధికారులతో సమావేశమై  అందరినీ పేరుపేరున కుశల ప్రశ్నలేశారు.. అనంతరం తనకి ఒక హెలికాఫ్టర్ కావాలి నగరం చూడాలి.. మనరాజ్యం ఎంతవరకూ విస్తరించి ఉందో తెలుసుకోవాలంటూ ఆదేశించాడు.. ఇదెక్కడి ఖర్మ రెండు లక్షలు ఖర్చుచేసి హెలికాఫ్టర్ అద్దెకు తెప్పించాలా అనుకుంటూ చెవులు కొరుక్కునారు అధికారులు..

ఉదయాన్నే మున్సిపల్ గౌండ్స్ కి హెలికాఫ్టర్ వచ్చి ఆగింది.. జనాలతో పాటూ అధికారులు, ప్రతిపక్ష, విపక్షాలూ గౌండ్ కి చేరాయి.. అక్కడికి చేరుకుని కారుదిగిన మేయర్ భుజాన పెద్ద మూట ఒకటి పెట్టుకుని నేరుగా హెలీప్యాడ్ వద్దకు వచ్చి హెలికాఫ్టర్ ఎక్కి పోనీ అన్నాడు.. ఆ మూట ఏవిటో, ఏం చెయ్యబోతున్నాడో అక్కడున్న ఎవ్వరికీ అంతుపట్టలేదు.. మనదేంపోయే జనాల సొమ్మేకదా అనుకున్నారు అధికారులు, మనకి కౌన్సిల్ లో గొడవ చేయడానికి మంచి సబ్జెక్ట్ దొరికిందని సంబరపడ్డారు ప్రతిపక్షాలు.. ఏదేమైనా ఆమేయర్ తీసుకెళ్ళిన మూట ఏంటో అక్కడెవ్వరికీ అంతుపట్టలేదు.. కొద్దిగా ఎగరగానే మూట విప్పిన మేయయ్.. మూటలోని గింజలను నేలపై విసురుతూ అదే చల్లుతుండటం చూసి బిత్తరపోయాడు పైలెట్.. నగరం నలుమూలలూ తిరిగి మూటలోని గింజలన్నీ చల్లి నాక తృప్తిగా క్రిందకు దిగాడు మేయర్..

 పైలెట్ ద్వారా మేయర్ ఏమిచేశాడో తెలుసుకున్న మీడియా, ప్రతిపక్షాలు.. విపక్షాలతో సహా రెండు లక్షలు నేలపాలు అని ఒహటే గొడవ.. ప్రతిపక్షనాయకుడు ఒక అడుగు ముందుకేసి పిచ్చోడు గింజలు విసిరెన్ అని పూరణ ఇచ్చాడు.. అదే నగరామంతా ప్రాకిపోయింది.. "ఏ నోట విన్నా పిచ్చోడు గింజలు విసిరెన్" అని ఒక సామెతలాగా ప్రాకిపోయింది..

 ఎవ్వరు ఎంత గోల చేస్తున్నా.. మేయర్ మాత్రం తొణకలేదు.. తాను చాలా గొప్పపని.. గతంలో ఎవ్వరూ చేయని పని చేశానని తృప్తితో గర్వంగా ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు.. ఇక అతనితో వాదన అనవసరం అని ఊరుకున్నారు...
**************************************      *****************************                        

20 ఏళ్ల అనంతరం..

ఆనగరం ఆకాశానికి పచ్చదనపు సోయగాలు చూపింది..
వర్షపాతంలో రికార్డు నమోదు చేసింది.
ఆరోగ్యంలో ఆసియాలో ఫస్ట్ నిలిచింది..
చల్లని గాలితో ప్రజలను అక్కున చేర్చుకుంది.


ఒక చిన్న పిల్లాడు..  తన తాతతో చెట్ల నీడన నడుస్తూ.. తాతా మనూర్లో ఇన్ని చెట్లు  ఎవరు నాటించారు.. అశోకుడా.. అ..? " అని అడిగాడు..

"పిచ్చోడు గింజలు విసిరెన్.." అనబోయిన అప్పటి ప్రతిపక్షనాయకుడైన తాత నాలిక కరచుకుని.. తడబడ్డాడు.. అప్పటి తప్పు మరలా చేయదలచుకోలేదాయన్.. అప్పటి మేయర్ ను పిచ్చోడు గింజలు విసిరెన్ అని అన్న వ్యక్తి అతనే..


అసలా రోజేం జరిగిందని గుర్తుతెచ్చుకున్నాడు అప్పటి ప్రతిపక్షనాయకుడైన తాత.

  మేయర్ ప్రమాణం తర్వాత మంచి వర్షాలు పడ్డాయి.. మధ్యలో హెలికాఫ్టర్ లో ఆకాశమార్గాన తిరిగిన మేయర్ ఊరంతా గింజలు చల్లాడు.
     .. కొండలు గుట్టలు.. ఎక్కడా ఖాళీ ప్రదేశాలూ వదిలి పెట్టకుండా గింజలు చల్లాడు.. ఆ తర్వాత వర్షాలు జోరుగాపడ్డాయి.. దీంతో గింజలన్నీ మొలకెత్తాయ్.. అత్యధికంగా మొక్కలన్నీ బ్రతికాయ్..

      దీంతో నగరం అంతా పచ్చదనం పరచినట్లైంది.. కేవలం రెండు లక్షలతో అడవినే పండించాడు మేయర్ అని తోచిందిప్పుడా నాయకుడికి.. వేలుముద్ర మేయర్ ముందు చూపుకి.. మనసులోనే హేట్సాఫ్ చెప్పుకున్నాడు..  మేయర్ ని అవహేళన చేసినందుకు చిన్నబుచ్చుకుని చుట్టూ పరచిన పచ్చసోయగాలను చూస్తూ.. "చదువుకున్న నాకంటే చదురాని మేయర్ ఎంతాబాగా భవిస్యత్తుని ఊహించాడు" అనుకుంటూ  నడినెత్తిన సూరీడు పెళపెళలాడే సమయంలో మనుమడితో కలిసి చెట్టు నీడలో  ముందుకు నడిచాడు అప్పటి ప్రతిపక్షనాయకుడు..

      "పిచ్చోడు గింజలు విసిరెన్" అని మేయర్ ని తననోటితో తొలిగా అన్నందుకు మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నాడు., ఎందుకంటే ఆ మేయర్ చనిపోయి అప్పటికి చాలాకలం అయ్యింది నేరుగా వెళ్ళి చెప్పాలన్నా కుదర్దు...గనుక.

****************************************************

అదన్నమాట ఫ్రెండ్స్.. ఎక్కడికో వెళ్ళారు కదా.. వచ్చేయండి... అవును.. మరి ...

అందుకే మొక్కలు నాటండి.. మీ పిల్లల భవిష్యత్తుని కాపాడండి..
అన్నట్లు మిత్రులు మీరందరు ఎదో ఒక్కటి.... కొటేషన్ లేదా. కవిత.. లేదా. ప్రభుత్వానికి ఓ సలహానో, పద్యాలో ... ఇలా ఎదో ఒకటి కామెంట్ చెయ్యండి.. అవి పదిమందికి  ఇన్స్పిరేషన్ ఇచ్చేలా ఉండాలి..అవన్నీ ప్రభుత్వానికి నివేదించే  ప్రయత్నం చేద్దాం

.  "రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటుదాం.. భవిష్యత్తుకు  పచ్చని సిరులు అందిద్దాం.."
                                                                                                                       -  మీ కరణం

ఫొటో గూగుల్ సౌజన్యం..

(ఇది కథారూపం మాత్రమే.. ఎవరినీ ఉద్దేసించినది ఏ మాత్రం కాదని మనవి చేసుకుంటున్నాను.. కాగా విజయవాడనగరంలో జంధ్యాల శంకర్ గారు చైర్మన్ గా ఉన్నప్పుడు అజిత్ సింగ్ గారు కమీషనర్ గా పనిచేసినప్పుడు విజయవాడలో గ్రీనరీ పెరిగేందుకు ఎంతో కష్టపడ్డారని, అందుకే అజిత్ సింగ్ గారి పేరిట విజయవాడ నగరంలో ఓ పేటకు నామకరణం చేశారని ఫేస్ బుక్ మిత్రుల్లో పెద్దలు తమ తమ కామెంట్ ద్వారా తెలిపారు.. కాబట్టి ఈ సందర్భంలో వారిని స్మరించుకోవడం స్ఫూర్తిదాయకమని నా భావన. నమోస్తు.)